11 July 2015

చంద్రబాబు ఒప్పందాల లో గుట్టు ఏమిటి..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా జపాన్ వెళ్లి వచ్చారు. ఎప్పటిలాగే ఆయన వెంట కోర్ కమిటీ కీలక మంత్రులు తరలి వె ళ్లారు. చాలా ఒప్పందాలు జరిగాయని, రాష్ట్రానికి  పెట్టుబడులు వరదలా ప్రవహిస్తాయని చెప్పుకొచ్చారు. ఇంతకీ, ఒప్పందాల పూర్తి వివరాలు ఏమిటి, ఎమ్ ఓ యూల వివరాలు ఏమిటి  అనేది మాత్రం రహస్యంగానే ఉంచుతున్నారు.

 సమస్తం సింగపూర్ మయం
 ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏ ముహుర్తాన ప్రమాణ స్వీకారం చేశారో తెలీదు కానీ, ప్రభుత్వ సొమ్ముతో జోరుగా షికారు చేసి వస్తున్నారు. ముఖ్యంగా సింగపూర్ తో అయితే చె ట్టపట్టాల్ వేసుకొని మరీ తిరుగుతున్నారు. పదవిలో లేకపోయినా, చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు క్రమం తప్పకుండా సింగపూర్ కు వెళ్లి వచ్చేవారు. అక్కడ ఆస్తుల్ని సమకూర్చుకొన్నారని, అందుకే అక్కడకు తరచు వెళుతున్నారని చెప్పుకొనే వారు. ఈ విషయం అలా ఉండగానే చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం, రాజధాని పనుల బాధ్యత మొత్తంగా సింగపూర్ కే అంకితం అన్న ప్రకటన  రావటం జరిగిపోయింది. ఇక అప్పటి నుంచి సింగపూర్ హడావుడి జోరుగా సాగింది. ఇక్కడ నుంచి అక్కడకు ఏమి వెళుతోందో, అక్కడ నుంచి ఇక్కడకు ఏమి వస్తోందో అంతా రహస్యమే. అన్నీ అయ్యాక మాస్టర్ ప్లాన్ అంటూ ఒక డాక్యుమెంట్ మాత్రం రిలీజ్ అయ్యింది. ఇక అంతే సంగతులు. రాజధాని విషయంలో అంతటి అత్యుత్సాహం ఎందుకు, వేల ఎకరాల దోపిడీ  ఎందుకు అనే దానికి మాత్రం సూటిగా జవాబులు లభించలేదు.

 చైనా కు సలామ్
 ఈలోగా చైనా వంతు వచ్చింది. చంద్రబాబు నాయుడు టీమ్ చైనాకు వెళ్లి వచ్చింది. అక్కడ నుంచి ఏం తెచ్చుకొన్నారో, ఏం ఒప్పుకొన్నారో తెలీదు కానీ రాష్ట్రంలో వేల కొద్దీ ఎకరాల భూమి అప్పగించేందుకు సిద్దంగా ఉందని ప్రకటన చేశారు. దీంతో చైనా బృందాలు రాష్ట్రానికి వచ్చి వెళ్లాయి. అన్నీ చూశాక, విజయవాడలోని భవానీ ద్వీపం నచ్చిందని నిర్ధారణ కు రావటమే తరువాయి, దీన్ని చైనా కు అప్పగించేందుకు ప్రభుత్వం తల ఊపేసింది. ఇక్కడ అంతే.. అసలు ఒప్పందం ఏ ప్రాతిపదికన జరుగుతోంది, ఏ ఏ అంశాల్ని దృష్టిలో పెట్టుకొన్నారు.. అసలు ఇంత హడావుడిగా ఒప్పందం ఎందుకు అన్న దానిపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 అసలు మ్యాటర్ జపాన్ తో..!
 ఇటీవల కాలంలో చంద్రబాబు నోట జపాన్ మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో చాలా వరకు నిర్మాణాలు చేపట్టబోయేది జపాన్ కంపెనీలే అని తేల్చి చెప్పుతున్నారు. హీరో హోండా కంపెనీకి 600 ఎకరాలు ఇస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఏ ప్రాతిపదికన కేటాయింపులు చేస్తున్నారో వె ల్లడించటం లేదు. జపాన్ తో నిర్మాణాలకు ఒప్పందం కుదుర్చుకొంటున్నప్పుడు ప్రాతిపదికలు వె ల్లడించాలన్న డిమాండ్ వస్తున్నప్పటికీ ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. మరో వైపు రాష్ట్రంలో జపాన్ బృందాల అవసరాల కోసం చక చకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి రెడ్ కార్పెట్ పరచి పనులు సాగిస్తున్నారు.

 విద్యుత్ ఒప్పందంలోనూ మతలబు..!
పోలాకి దగ్గర ఏర్పాటు తలపెట్టిన థర్మల్ విద్యుత్‌ఉత్పత్తి కేంద్రం కోసం జపాన్ సంస్థ తో ఒప్పందం చేసుకొన్నారు దీని కోసం 2వేల 500 ఎకరాల భూమిని కేటాయిస్తున్నారు. అయితే ఈ సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకొన్న ఎమ్ ఓ యూ  ని మాత్రం బయటకు వెల్లడి చేయటం లేదు. ఆఖరికి సమాచార హక్కు చట్టం కింద పిటీషన్ వేసినా కూడా వివరాలు బయటకు రానీయటం లేదు. మౌళిక వసతుల కల్పన చట్టం కు విరుద్ధంగా ఒప్పందం చేసుకొన్నట్లు విమర్శలు వస్తున్నప్పటికీ, ప్రభుత్వం గోప్యంగా పనులు సాగిస్తోంది.
  ఈ విధంగా ప్రభుత్వం విదేశీ సంస్థలతో చక చకా ఒప్పందాలు చేసుకొంటోంది తప్పితే దీనికి సంబంధించిన ఒప్పంద వివరాలు మాత్రం బయటకు రానీయటం లేదు. అరకొరగా వివరాలు అందించి చేతులు దులుపుకొంటున్నారు. దీన్ని బట్టి ఈ ఒప్పందాల వెనుక గుడుపుఠాణీ జరుగుతోంది అన్న వాదన బలంగా వినిపిస్తోంది

No comments:

Post a Comment