20 July 2015

21నుంచి మూడోవిడత రైతు భరోసా యాత్ర ప్రారంభం

అనంతపురంజిల్లాలో ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాలకు పరామర్శ
 ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లాలో మూడో విడత రైతు భరోసా యాత్ర చేపడుతున్నారు. గత ఫిబ్రవరి నెల చివరి వారంలో ఐదు రోజుల పాటు, మేలో 8 రోజుల పాటు అనంతపురం జిల్లాలో ఆయన ఈ యాత్రను నిర్వహించారు. ఇప్పుడు మరల అదే అనంతపురం జిల్లా  నుంచి యాత్రను కొనసాగించనున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొన్న రైతు కుటుంబాలను ఆయన పరామర్శించనున్నారు. అసలు ఆత్మహత్యలనేవే లేవని అడ్డగోలుగా వాదిస్తూ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శ యాత్ర జరుపుతుండడంతో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను గుర్తించడం ప్రారంభించింది. అంతేకాదు ఆ కుటుంబాలకు పరిహారం కూడా చెల్లిస్తూ వస్తున్నది.
 బుకాయించిన ప్రభుత్వానికి బుద్ది వచ్చేలా..
 జగన్‌మోహన్‌రెడ్డి రైతు భరోసాయాత్రకు శ్రీకారం చుట్టడానికి అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా జరిగిన చర్చ కారణమయ్యింది. అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో వ్యవసాయ దారుల కష్టాల మీద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గట్టిగా నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం అడుగడుగునా ఏ రకంగా దగా చే స్తూ వస్తోందో సోదాహరణంగా వివరించారు. ముఖ్యంగా రైతు రుణ మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి, మాఫీ చేయకపోగా రైతుల్ని అదే పనిగా మభ్య పెడుతూ రావటం వల్ల జరుగుతున్న అనర్థాన్ని కళ్లకు కట్టినట్లుగా వివరించి చెప్పారు. ఆధారాలతో సహా ప్రభుత్వ బండారాన్ని బయట పెట్టారు. ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పలేని ప్రభుత్వం ఆయన మీద ఎదురు దాడిని కొనసాగించింది. అసలు ఈ ప్రభుత్వ హయాంలో రైతులంతా ఆనందంగా ఉన్నారని అడ్డంగా వాదించటమే కాకుండా రైతులు ఎవరూ ఆత్మ హత్యలు చేసుకోవటం లేదని అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు ఆడింది. దీన్ని ఖండించిన వైఎస్‌జగన్ ..ఆత్మహత్యలు చేసుకొన్న రైతుల దగ్గరకు తాను వెళతానని, ఆయా కుటుంబాల వివరాల్ని బహిరంగ పరుస్తానని అసెంబ్లీలో స్పష్టం చేశారు. అందులో భాగంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు.
 ఆత్మహత్యలను అవహేళన చేసిన చంద్రబాబు...
 రైతు భరోసా యాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో  అనంత పురం జిల్లా వాసులకు వైఎస్ జగన్ స్వయంగా విడమరిచి చెప్పారు. ‘‘అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై నేను గట్టిగా నిలదీశా. ప్రజల ఓట్లతో అవసరం ఉన్నప్పుడు ఏం చేస్తామని చెప్పారు. ప్రజలు ఓట్లేసి అవసరం తీరిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు అని గట్టిగా అడిగాను. మీ అబద్దాలు నమ్మి ప్రజలు మీకు ఓట్లేసి గెలిపించి సీఎం పీఠంపై కూర్చోబెట్టారు. కానీ ఇచ్చిన హామీ నిలుపుకోలేదు. రైతులు, చేనేతలు, డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం నుంచి భరోసా కరువైంది. మీరాడిన పచ్చి అబద్దాలతో మోసపోయిన రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. దీనంతటికీ మీరు కారణం కాదా.. అని అడిగా. 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారని గ్రామ, మండల నియోజక వర్గాల వారీగా వివరాల్ని చూపించా. కానీ చంద్రబాబు రైతు ఆత్మహత్యల్ని అవహేళన చేశారు. రైతులు సుఖ సంతోషాలతో, డ్వాక్రా మహిళలు ఆనందంతో ఉన్నారన్నారు. ఎవరూ చనిపోలేదన్నారు. ఆత్మహత్యలు నిజమే అని ఒప్పుకొంటే ఎక్కడ రూ.5 లక్షల పరిహారం ఇవ్వాల్సి వస్తుందోనని ఒప్పుకోలేదు. అయ్యా..నేను ప్రతీ ఇంటికీ వెళ్లి రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారో చూపిస్తా.. అని చెప్పా. ప్రభుత్వం నుంచి ఆదరణ లభించని క్రమంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసి, ఆత్మహత్య చేసుకొన్న కుటుంబాలకు భరోసా కల్పించి వారికి అండగా నిలిచేందుకే రైతు భరోసా యాత్ర చేపట్టాను’’అని వైఎస్ జగన్ వివరించారు.
 రెండు విడతలుగా భరోసాయాత్ర
 అనంతపురంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే రెండువిడతలుగా రైతు భరోసాయాత్రను పూర్తి చేశారు. తొలిసారి ఈ ఏడాది ఫిబ్రవరిలో అనంతపురంలో ఆయన భరోసాయాత్ర చేశారు. ఐదురోజుల పాటు ఐదు నియోజకవర్గాలలో జగన్ భరోసాయాత్ర సాగింది. హిందూపురం, పుట్టపర్తి, ఉరవకొండ, సింగనమల, గుంతకల్లు నియోజకవర్గాలలో 780 కిలోమీటర్లు ప్రయాణించిన జగన్ తొమ్మిది చోట్ల జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. 10 కుటుంబాలలో ఆత్మహత్య చేసుకున్న 11 మంది రైతు కుటుంబాలను జగన్ పరామర్శించారు. వారిని మరామర్శించి వారిలో మనోధైర్యం నింపారు. మేలో జరిగిన రెండో విడత భరోసాయాత్ర సందర్భంగా 11 రైతు కుటుంబాలను వైఎస్ జగన్ పరామర్శించారు. రాజకీయ కారణాలతో హత్యకు గురైన ముగ్గురు వైఎస్‌ఆర్‌సీపీ నేతల కుటుంబాలను కూడా ఆయన పరామర్శించారు. రెండోవిడత రైతు భరోసా యాత్రలో భాగంగా అనంతపురం జిల్లాలో జగన్‌మోహన్‌రెడ్డి 8 రోజులపాటు పర్యటించారు. 1150 కిలోమీటర్లు ప్రయాణించారు. అనంతపురం, రాప్తాడు, సింగనమల, తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గంలలో జగన్ పర్యటించారు.
 మూడో విడత భరోసా యాత్ర ఇలా...
 ఈనెల 21 నుంచి అనంతపురం జిల్లాలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడవ విడత రైతు భరోసా యాత్ర ప్రారంభమవుతుంది. 21వ తేదీ కళ్యాణదుర్గంలోని శెట్టూరు నుంచి ప్రారంభమై 22,23 తేదీలలో ఆ నియోజకవర్గంలో కొనసాగుతుంది. 24 నుంచి పెనుకొండ, మడకశిర నియోజకవర్గాలలో యాత్ర సాగుతుంది. 21న శెట్టూరులో మధ్యాహ్నం ఒంటి గంటకు బహిరంగ సభ అనంతరం ఒక కార్యకర్త కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. 22వ తేదీన శెట్టూరు మండలంలోని కైరేవు గ్రామంలో ఒక రైతు కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తారు. ఆతరువాత కళ్యాణదుర్గం మండలంలోని ముదిగళ్లు, వర్లి గ్రామాల్లోని రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. 23వ తేదీన కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం తిమ్మాపురం, వంటారెడ్డిపల్లిలో జగన్ భరోసా యాత్ర సాగుతుంది. 

No comments:

Post a Comment