4 July 2015

బాధిత కుటుంబాల్లో జగన్‌మోహన్‌రెడ్డి భరోసా

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్టణం, ఉభయగోదావరి జిల్లాల్లో జరిపిన మూడురోజుల పర్యటన ఫలప్రదమయ్యింది. బాధిత కుటుంబాలలో భరోసా కలిగించింది. ప్రతి మృతుని ఇంటికీ వెళ్లి కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలుకరించి వారికి కొండంత ధైర్యాన్నిచ్చారు. జగన్ పరామర్శ తమలో స్థయిర్యాన్ని నింపిందని బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి. పర్యటన ఆద్యంతం ఎక్కడికక్కడ జనం బారులు తీరి జగన్‌ను పలుకరించేందుకు, జగన్ చేయిని తాకేందుకు పోటీపడ్డారు. 22 మంది ఒక రోడ్డుప్రమాదంలో మరణించి 18 గడిచిపోయినా పరిహారం అందించకపోవడంపై జగన్ మండిపడ్డారు. వెంటనే పరిహారం అందజేయకపోతే కలెక్టరేట్ వద్ద తానే ధర్నా చేస్తానని హెచ్చరించడంతో అచ్యుతాపురం ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ర్టప్రభుత్వం ఆగమేఘాల మీద పరిహారాన్ని అందించింది. తాను రాకపోతే అసలు పరిహారం ఇవ్వలేదన్న విషయం కూడా తెలిసేది కాదని జగన్ సరిగ్గానే చెప్పారని దీన్ని బట్టి అర్ధమౌతోంది.

 బాధిత కుటుంబాలకు అండగా..
 తొలిరోజు పర్యటనలో అచ్యుతాపురం చేరుకున్న జగన్ ఇటీవల రాజమండ్రి ధవళేశ్వరం బ్రిడ్జివద్ద వాహనం నదిలో పడి 22 మంది  మరణించిన ఘటనకు సంబంధించి వారి బంధువులను పరామర్శించారు. పబ్లిసిటీ ఉంటేనే చంద్రబాబు పరామర్శకు వస్తున్నారని, ఐదు లక్షల రూపాయల పరిహారం ప్రకటిస్తున్నారని జగన్ ద్దేవా చేశారు. పబ్లిసిటీ రాదనుకుంటే చంద్రబాబు రావడం లేదని, మంత్రులు వచ్చినా అరకొరగా లక్షో, రెండు లక్షలో పరిహారం ప్రకటించి వెళ్తున్నారని, ఆ తర్వాత ఆ కుటుంబాలు ఏమయ్యాయో పట్టించుకోవడం లేదని జగన్ విమర్శించారు. తుని నియోజకవర్గం లోని కొత్తపట్నం, రామన్నపాలెం గ్రామాల్లో వేటకు వెళ్లి మృతి చెందిన తొమ్మిది మంది మత్స్యకారుల కుటుంబాలను జగన్ పరామర్శించారు. ఆ తర్వాత కాకినాడలోని పరాడపేటలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుని కుటుంబాన్ని ఓదార్చారు. కాకినాడ రూరల్ పరిధిలోని ఉప్పలంక, పగడాలపేట గ్రామంలో పెళ్లికి వెళ్లి వస్తూ ప్రమాదానికి గురై మరణించిన కుటుంబాలవారిని జగన్ పరామర్శించారు. పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలోని దేవరపల్లిలో పొగాకు రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

 వర్షాన్ని లెక్కచేయని అభిమానం
 అచ్యుతాపురంలో విపరీతమైన ఉక్కపోత వాతావరణం ఉంది. అయితే జగన్ అక్కడకు చేరుకునేసరికి ఒక్కసారిగా మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణం చల్లబడిపోయింది. అప్పటివరకు ఇళ్లలో ఉండిపోయిన జనం జగన్ రాగానే ఆయన్ను చూడడానికి పోటెత్తారు. దాదాపు అరగంటపాటు వర్షం కురుస్తున్నా తడుస్తూనే నినాదాలు చేస్తూ నిల్చున్నారు. జగన్ కూడా వర్షంలో తడుస్తూనే మృతుల కుటుంబాలను పరామర్శించారు.

 జగన్ అల్టిమేటమ్‌తో దిగివచ్చిన ప్రభుత్వం
 ‘‘ 22 మంది మరణించి 18రోజులు గడుస్తున్నా పట్టించుకోరా... రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించి చేతులు దులుపుకుంటారా...? ధవళేశ్వరం ప్రమాదాన్ని ఓపెను విపత్తుగా పరిగణించి మృతులు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి’’ అని జగన్ రాష్ర్టప్రభుత్వానికి అల్టిమేటమ్ జారీ చేశారు. నాలుగురోజుల్లో బాధిత కుటుంబాలకు పరిహారం అందజేయకుంటే జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. దాంతో రాష్ర్టప్రభుత్వం కదిలివచ్చింది. అధికార యంత్రాంగాన్ని ఆగమేఘాలపై పరుగులుపెట్టించింది. జగన్ పర్యటన పూర్తి కాకుండానే ఆయన చెప్పిన గడువు లోపుగానే పరిహారం అందజేయడం గమనార్హం. జగన్ పర్యటించకపోయి ఉంటే బాధిత కుటుంబాలను వారి మానాన వారిని వదిలివేసి ఉండేవారు. అంత్యక్రియల సమయంలో వచ్చిన అధికార పార్టీ నాయకులు, మంత్రులు ఆ తర్వాత మళ్లీ కనిపించలేదని అందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలిన వెంకులు జగన్‌కు వివరించాడు. అయితే జగన్ పర్యటన మూలంగా అధికారులు వచ్చి ఆయనకు పరిహారం అందించి వెళ్లారు.

 కరప్షన్ మహారాజు చంద్రబాబు
 రెండు తెలుగురాష్ట్రాలలో చంద్రబాబు చేస్తున్న అవినీతిని ఈ పర్యటనలో జగన్‌మోహన్‌రెడ్డి తూర్పారబట్టారు.  ‘‘అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొంటున్న కరప్షన్ మహారాజు చంద్రబాబు’’ అని విమర్శించారు. రాష్ర్టంలో అవినీతి సొమ్ము సంపాదించి రు.100 కోట్ల నుంచి 150 కోట్లతో పక్కరాష్ర్టంలో ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని, తప్పు చేసి దొరికిపోయిన తర్వాత సెక్షన్ 8 అంటూ వివాదాలు సృష్టిస్తున్నారని జగన్ ఎద్దేవా చేశారు. ‘‘ఈ రాష్ర్టంలో సిగ్గులేని వ్యక్తి చంద్రబాబు. పట్టపగలు డబ్బుతో ఎమ్మెల్యేని కొనడానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డాడు. ఆ మర్నాడే విజయవాడ వచ్చి అవినీతి రహిత రాష్ర్టం చేస్తానంటూ చిన్న పిల్లలతో ప్రమాణం చేయిస్తాడు. ఇంతకంటే సిగ్గుమాలిన పని ఇంకోటి ఉందా? చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి తప్పుడు పనులు’’ అని విమర్శించారు.

 కాకినాడ సెజ్ భూములపై అబద్దాలు
 కాకినాడ సెజ్ భూములకు సంబంధించి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం నాయకులు ఎన్నికల ముందు ఎన్నో అబద్దాలు ప్రచారం చేశారు. వాటన్నిటికీ ఈ పార్యటనతో జగన్ జవాబు చెప్పారు. కాకినాడ సెజ్ భూముల గురించి అక్కడి జనం జగన్‌కు అర్జీ ఇచ్చారు. జగన్ ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ ‘‘కాకినాడ సెజ్‌కు 2002లో జీవో ఇచ్చింది చంద్రబాబే. కానీ ఎన్నికల ముందు ఆ భూముల్లో ఏరువాక సాగించారు. ఆ భూములన్నీ జగన్‌వే నని చెప్పారు. ఇపుడు నేనే చెబుతున్నా.. ఈ భూములన్నీ రైతులకు వెనక్కి ఇచ్చేయండి చంద్రబాబూ... రైతులకు ఎకరాకు రు.3 లక్షలిచ్చి ఇపుడు ఎకరా రు.70 లక్షలకు అమ్ముకుంటున్నారు. రైతుకు రు.70 లక్షలు ఇవ్వండి లేదా భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా’’ అని జగన్ డిమాండ్ చేశారు. దాంతో జరిగిన మోసం ఏమిటో జనానికి స్పష్టంగా అర్ధమయ్యింది. నేరం చేసిన చంద్రబాబు ఆ నేరాన్ని పక్కవారిపై రుద్ది ఎలాంటి బూటకపు ప్రచారాలు చేస్తారో బాగా తెలిసివచ్చింది.

 మత్స్యకార కుటుంబాలకు బాబు అన్యాయం
 వాయుగుండం వల్ల సముద్రంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను కూడా చంద్రబాబు వదల్లేదు. వారికి ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియా విషయంలో చంద్రబాబు అదేవిధంగా మోసాలు చేస్తున్నాడు. 60 రోజుల పాటు వేటకు వెళ్లకుండా మత్స్యకారులకు సెలవు దినాలుగా ప్రకటించారు. ఆరోజులకు మత్స్యకారులందరికీ 50 కేజీల బియ్యం, రు. నాలుగువేలు ఇస్తానన్నాడు. 40 మంది మత్స్యకారులు వేటకు వెళ్లి గల్లంతైతే హెలికాప్టర్లు పెట్టి వెతికిస్తామన్నారు. వారిలో 17 మంది చనిపోగా మిగిలినవారు కొన ఊపిరితో ఇంటికి చేరారు. వారికి ఇప్పటివరకు దమ్మిడీ ఇచ్చిన పాపాన పోలేదు. ఈ విషయాలను జగన్ గుర్తించడమే కాక జనానికి అర్ధమయ్యేలా వివరించారు. సముద్రంలో గల్లంతైన బోట్లను వెతికేందుకు తుని ఎమ్మెల్యే రాజా ఆధ్వర్యంలో ప్రత్యేకంగా బోట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వంపై వత్తిడి తీసుకువచ్చి న్యాయం చేస్తామన్నారు. మత్స్యకారుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించి పరిష్కారానికి ప్రయత్నిస్తానని జగన్ హామీ ఇచ్చారు.

 పొగాకు  మద్దతు ధర పైనా జగన్ అల్టిమేటమ్
 పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లిలో పొగాకు రైతులతో జగన్ భేటీ అయ్యారు. ఇటీవలే ఇక్కడి పొగాకు రైతులు హైదరాబాద్ వచ్చి జగన్‌ను కలుసుకుని తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వారివద్దకు వస్తానని జగన్ వారికి మాట ఇచ్చారు. అన్నట్లుగానే ఆ రైతులను వారి ఊరిలో కలుసుకున్నారు. పొగాకు రైతుల సమస్యలపై కూలంకషంగా చర్చించారు. పొగాకుకు కిలో రు.150కి తగ్గకుండా మద్దతు ధర కల్పించి స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ద్వారా కొనుగోళ్లు చేయించని పక్షంలో ఈనెల 10 నుంచి పొగాకు కొనుగోలు కేంద్రాల వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుకు జగన్ అల్టిమేటమ్ జారీ చేశారు. రైతులను నట్టేట ముంచేస్తోందని, ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదని ఆయన మండిపడ్డారు. పొగాకును గతంలో 120 రోజుల కొనుగోలు చేసేవారని, ఇపుడు దాన్ని 80 రోజులకే పరిమితం చేశారని జగన్ అన్నారు. వెంటనే మద్దతుధర కల్పించి కొనుగోళ్లు జరిపించాలని రాష్ర్టప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. జగన్ పర్యటనతో తమ సమస్యలపై రాష్ర్టప్రభుత్వం దృష్టిపెడుతుందన్న నమ్మకం ఏర్పడిందని రైతులు సంతోషంగా చెబుతున్నారు. తమ సమస్యలపై పోరాడతానని జగన్ హామీ ఇవ్వడం కొండంత బలాన్నిచ్చిందని రైతులు అంటున్నారు.

No comments:

Post a Comment