29 June 2016

కేంద్రం ప్రశ్నకు జవాబేది చంద్రబాబూ..

హైదరాబాద్: కేంద్రం ఇస్తున్న నిధుల్ని దిగమింగేసి, సొంత డబ్బా కొట్టుకొనే చంద్రబాబుకి ఢిల్లీ పెద్దలు షాక్ ఇచ్చారు. కొత్త నిధులు ఇవ్వాలంటే పాత వాటికి ఖర్చులు చెప్పాల్సిందే అని తాకీదు పంపారు.
అసలేమైందంటే..
  2014-15 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఉత్త‌రాంధ్ర‌లోని మూడు, రాయ‌ల‌సీమ‌లోని నాలుగు జిల్లాల‌కు ఒక్కో జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున రూ. 350 కోట్ల‌ను  కేంద్రం ఇచ్చింది. 2015-16 ఆర్థిక సంవ‌త్స‌రంలో కూడా ఇదే త‌ర‌హాలో జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున ఏడు జిల్లాల‌కు రూ. 350 కోట్లు ఇచ్చింది. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రానికి కూడా నిధులు ఇవ్వాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం కోరినప్పుడు కేంద్రం తీవ్రంగా స్పందించింది. జమా ఖర్చులు  పంపించాల్సిందిగా కోరినప్ప‌టికీ ఇప్ప‌టి వ‌ర‌కూ పంప‌క‌పోవ‌డాన్ని త‌ప్పుప‌ట్టింది. కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను త‌క్ష‌ణ‌మే పంపాల‌ని, అలాగే ఇచ్చిన నిధులు రూ. 700 కోట్ల‌కు సంబంధించిన వినియోగ ప‌త్రాల‌ను పంపించాల‌ని పేర్కొంది. వాటిని పంపాకే త‌దుప‌రి నిధులు ఇస్తామ‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు ఏపీ ప్ర‌ణాళిక శాఖ‌కు లేఖ రాసింది. 
కేంద్రం నిధులు ప‌క్కదారి?
వెనుక‌బ‌డిన జిల్లాల అభివృద్ధి కోసం ఇచ్చిన నిధుల‌ను ఏపీ స‌ర్కారు ప‌క్క‌దారి ప‌ట్టించిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం అనుమానం వ్య‌క్తం చేస్తోంది. స్వ‌యంగా ముఖ్య‌మంత్రి ఆదేశాల మేర‌కు ఏడు జిల్లాల్లో రూ. 52 కోట్ల‌తో  స్కానింగ్ యంత్రాల‌ను కొనుగోలు చేశారు. కేంద్రం ఇచ్చిన నిధుల నుంచే వీటిని కొన్నారు. దీంతోపాటు మ‌రికొన్ని రంగాల‌కు ఈ నిధుల‌ను వెచ్చించిన‌ట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ల‌కే ఆ నిధుల‌ను విడుద‌ల చేశామ‌ని, వారే దేనికి ఎంత వ్య‌యం చేయాలో నిర్ధారించాల్సి ఉంద‌ని రాష్ట్ర ప్ర‌ణాళికా శాఖ పేర్కొంటోంది. ఏడు జిల్లాల అభివృద్ధికి ఇచ్చిన రూ. 700 కోట్ల‌ను     ప‌క్క‌దారి ప‌ట్టించ‌డంపై కేంద్రం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 
గతంలోనూ దొంగలెక్కలు
దీనికైనా రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా స్పందిస్తుందా లేక, ఎప్పటిలాగే దొంగలెక్కలు రాసి తప్పించుకొంటుందా అన్న మాట వినిపిస్తోంది. గతంలో రాజధానికి ఇచ్చిన రూ. 18వందల కోట్లకు కేంద్రం లెక్కలు అడిగింది. అప్పుడు అమరావతి రాజధాని ప్రాంతంలో గవర్నర్ నివాసం అయిన రాజ్ భవన్, హైకోర్టు భవనాలు కట్టేసినట్లుగా లెక్కలు రాసేసి చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకొంది.

No comments:

Post a Comment