27 June 2016

బాబోయ్‌.. అవినీతి అనకొండ

అమరావతి:  రాజ‌ధాని లో అడుగ‌డుగునా పెద‌బాబు, చిన‌బాబుల అవినీతి బుస‌లు కొడుతోంది. ఈ ర‌క‌మైన‌ అరాచ‌క పాల‌న‌, అడ్డ‌గోలు నిర్ణ‌యాల‌కు మ‌రో ప్ర‌త్య‌క్ష సాక్ష్యం కొండ‌వీటి వాగు వ‌ర‌ద నీటిఎత్తిపోత‌ల ప‌థ‌కం. ఊరుపేరులేని కంపెనీకి రూ. 200 కోట్ల విలువైన ప‌నులు అప్ప‌గించేందుకు చిన్నబాబు ఏర్పాట్లు చేశారు.

జ‌రిగింది ఏమిటంటే
 గరిష్టంగా రూ. 10 లక్షల కు మించితే తప్పకుండా టెండర్లు పిలవాలనే నిబంధన ఉంది. రూ.100 కోట్ల కంటే ఎక్కువ విలువైన పనులకు టెండర్లు పిలిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని హైపవర్ కమిటీ అనుమతి త‌ప్ప‌నిస‌రి అన్న‌ది నిబంధ‌న‌. అయితే టెండర్లలో పోటీ పెరిగినా అడ్డగోలు వ్యవహారాలకు సీఎస్ అడ్డుకట్ట వేసినా అనుకున్న మేరకు ముడుపులు అందే అవకాశంలేదు. అందుకే గుట్టుచప్పుడు కాకుండా అనుకున్నవాడికి అనుకున్న రేటుకు కట్టబెట్టి భారీగా  కమీషన్లు నొక్కేసేందుకు చినబాబు వ్యూహం రచించగా  సాగునీటి శాఖ అధికారులు అమలు చేసేశారు. రూ.200 కోట్ల పనులను నిబంధనలకు విరుద్ధంగా అక్వాటెక్ కంపెనీకి అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

సాంకేతికంగా స్కెచ్‌
కొండవీటి వాగు వరద నీటి ఎత్తిపోతలకు దాదాపు రూ. 200 కోట్ల విలువైన పంపులు, మోటార్లు సరఫరా చేయడానికి కొటేషన్లు ఇవ్వాలంటూ గుంటూరు ఇరిగేషన్ సర్కిల్ ఎస్‌ఈ కేవీఎల్‌ఎన్‌పీ చౌదరి ఈనెల 15న ఎంపిక చేసిన నాలుగైదు కంపెనీలకు లేఖలు రాశారు. అందులో పని విలువ కాని, సాంకేతికపరమైన పూర్తి వివరాలు కానీ ఇవ్వలేదు. దాదాపు ఆరు వేల క్యూసెక్కుల నీటిని 10-12 మీటర్లు ఎత్తిపోవడానికి వీలుగా పంపులు, మోటార్లు ఏర్పాటుచేయాలని మాత్రమే పేర్కొన్నారు. పంపులు, మోటార్లలో పేరెన్నికగన్న కంపెనీలు కిర్లోస్కర్, కేఎస్‌బీ, విలో, ఫ్లోమోర్ లాంటి కంపెనీలకు లేఖలే రాయకపోవడం గమనార్హం. ఎస్‌ఈ లేఖకు మూడు కంపెనీలు స్పందించాయి.

తమిళనాడుకు చెందిన కంపెనీ ఈ-మెయిల్‌లో ప్రతిపాదనలు పంపించిందని సాకుగా చూపించి అనర్హత వేటు వేశారు. కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీని కూడా ఏదో సాకు చూపించి అనర్హత వేటు వేశారు. ఫైనల్‌గా చినబాబుతో ముందస్తు అవగాహన ఉన్న అక్వాటెక్ కంపెనీకి పనులు కట్టబెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వ్యవహారంలో దాదాపు రూ. 100 కోట్లు ముడుపులు చేతులు మారనున్నట్లు సాగునీటి శాఖలో ప్రచారం జరుగుతోంది.
 
విద్యుత్ లేకుండా ఎలా
దాదాపు ఆరు వేల క్యూసెక్కుల వరద నీటిని తోడటానికి వీలుగా ఏర్పాటుచేయనున్న మోటార్లకు 30 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా. అయితే అత్యవసరంగా అంత విద్యుత్ సరఫరా చేయడానికి అవకాశం లేదు. 220 కేవీ విద్యుత్ లైన్ నుంచి సరఫరా చేస్తే, లోడ్ సరిపోదని విద్యుత్ ఇంజనీర్లు చెప్పారు. ఈ నేపథ్యంలో డీజిల్ జనరేటర్లు ఏర్పాటు చేసి, విద్యుత్ సరఫరా అందించాలనే నిర్ణయానికి వచ్చారు. నార్లతాతారావు థర్మల్ పవర్ స్టేషన్(ఎన్టీటీపీఎస్) ఒక్కో యూనిట్‌లో 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అందులో ఏడో వంతు విద్యుత్ ఉత్పత్తిని డీజిల్ జనరేటర్లతో చేయాలని, దాంతో ఎత్తిపోతల మోటార్లు నడిపించాలని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా డీజిల్ వాడటం వల్ల కాలుష్యం భారీగా పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు డీజిల్ జనరేటర్లు సరఫరా చేసే కాంట్రాక్టును కూడా చినబాబు సూచించిన వ్యక్తికి ఇవ్వడానికి పావులు కదులుతున్నాయి. మోటార్లు, పంపులు సిద్ధమైన తర్వాత అత్యవసరం పేరిట డీజిల్ మోటార్లు భారీ ధరలకు తెచ్చిపెడతారని అధికార వర్గాలు తెలిపాయి. డీజిల్ జనరేటర్లు, ఇతర సివిల్ పనులు కనీసం రూ. 200 కోట్లుగా నిర్ధారించడానికి రంగం సిద్ధమయిందని ఆ వర్గాల సమాచారం.

No comments:

Post a Comment