23 June 2016

వైయ‌స్సార్‌సీపీది అల‌సిపోయే సైన్యం కాదు...కవాతుకు సిద్ధంగా ఉన్న సైన్యం

  • బాబు చరిత్రే రైతు వ్యతిరేక చరిత్ర
  • హామీల అమలుపై పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు
  • ప్రజలు అన్నీ గమనిస్తున్నారు
  • ముద్రగడ పట్ల వ్యవహరించిన తీరు దుర్మార్గం
  • వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన క‌రుణాక‌ర్‌ రెడ్డి

హైదరాబాద్ః ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల్లో 90 శాతానికి పైగా నేర‌వేర్చామ‌ని చంద్ర‌బాబు ఒంగోలులో చెప్ప‌డం సిగ్గు చేట‌ని వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి  ధ్వజమెత్తారు. ఏ ఒక్క వాగ్ధానాన్ని నెరవేర్చకుండానే బాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. రైతుల క‌న్నీళ్లు తుడుస్తా... డ్వాక్రామ‌హిళ‌లకు రూ. 14వేల కోట్ల రుణాలు చెల్లిస్తా... బ్యాంకుల్లో తాక‌ట్టు పెట్టిన బంగారాన్ని విడిపిస్తాన‌ని చెప్పిన చంద్రబాబు ఏ ఒక్కరికీ మాఫీ చేసిన పాపాన పోలేదన్నారు. ఎన్నిక‌ల‌ప్పుడు ఉన్న రూ. 87వేల కోట్ల రుణాలు కాస్తా రెండేళ్ల‌లో ల‌క్ష ప‌దికోట్ల రూపాయ‌లు అయ్యింద‌న్నారు. రుణాలు లక్షా 10 వేల కోట్లుంటే ....రూ. 11,000 కోట్లు రుణామ‌ఫీ చేశాన‌ని మిగ‌తా రూ. 13వేల కోట్లు మూడేళ్ల‌లో చెల్లిస్తాన‌ని బాబు చెప్ప‌డం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. 

రూ.24వేల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘ‌న‌త  టీడీపీకే చెల్లింద‌న‌డం దుర్మార్గమన్నారు. రైతుల క‌ళ్ల‌లో ఆనందం, సంతృప్తి, వెలుగు చూస్తున్నాం... గ‌తంలో ఎప్పుడూ ఈ ర‌కంగా లేదు.  ప్ర‌భుత్వం చేసిన‌ పనులను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలంటూ బాబు టీడీపీ నేతలకు చెప్పడం విడ్డూరమన్నారు. ప్రజలకు ఏమీ చేయకుండానే చేశామని చెప్పడం దారుణమన్నారు. రోజూ ప‌త్రికా స‌మావేశాలు, టెలికాన్ఫ‌రెన్స్‌ల పేరిట బాబు చెప్పే ఊకదంపుడు ఉపన్యాసాల‌ను విన‌లేక ... బుచాడు వ‌చ్చాడు పారిపోదామన్న తీరు ప్ర‌జ‌ల్లో నెల‌కొంద‌ని భూమన అన్నారు. 

మంత్రగాళ్లను మించిన మాయగాడు బాబు..
దోపిడీ చేయ‌డంలో ప్ర‌పంచంలోనే బాబు అగ్ర‌గామిగా నిలిచారని భూమన విమర్శించారు.  బాబు చేసిన మోసాలు, వాగ్దానాల భంగంపై వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ జూలై 8వ తేదీ నుంచి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు వైయ‌స్సార్‌కాంగ్రెస్ పార్టీ నినాదంతో ఎండగడుతుందని భూమన చెప్పారు. చంద్ర‌బాబు చేసిన‌ హామీలు నేర‌వేర్చారా లేదా అని ఇంటింటికి వెళ్లి తెలుసుకుంటామ‌న్నారు.  మోసగాళ్లు, చేత‌బడులు చేసే మంత్రగాళ్లు కూడా బాబు మాదిరి అబ‌ద్ధాలు చెప్పర‌ని భూమన ఎద్దేవా చేశారు. బాబు మాయ‌ల మ‌రాఠీల‌ను మించిన మాయ‌గాడ‌ని భూమన ఆరోపించారు. 

ఎన్నిక‌ల‌ప్పుడు ఇచ్చిన హామీల్లో ఒక్క‌టి కూడా స‌రైన రీతిలో అమ‌లు చేసిన దాఖాలాలు లేవ‌న్న‌ది రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్ర‌జ‌లకు తెలిసిన నిజ‌మ‌న్నారు. సీఎంగా బాబు మొద‌టి సారి చేసిన ఐదు సంతాకాలో  ఒక్క‌టి కూడా అమ‌లు కాలేద‌న్నారు. రెండేళ్ల పాల‌న త‌ర్వాత కోన‌సీమ రైతులు మ‌ళ్లీ క్రాప్ హాలీడేను ప్ర‌క‌టించార‌న్నారు. బాబు రైతాంగ వ్య‌తిరేక విధానాల వ‌ల్ల వ్య‌వ‌సాయం చేయ‌డం వీలుకావ‌డం లేద‌ని కోన‌సీమ‌లోని అల్లావ‌రం మండ‌ల ప‌రిధిలోని అన్ని గ్రామాలు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నాయ‌న్నారు. రైతుల‌కు శ‌త్రువుగా మారిన వ్య‌క్తి బాబు అని భూమన దుయ్యబట్టారు.  రైతాంగానికి ఉచిత విద్యుత్‌ను అంద‌జేస్తామ‌న్న బాబు ఇప్పుడు ఏం చేస్తున్నార‌ని ప్ర‌శ్నించారు. 

బాబు చ‌రిత్రే రైతు వ్య‌తిరేక చ‌రిత్ర‌ అని, బాబు గ‌త‌మంతా ఇదేనని భూమన ఆరోపించారు. ప్ర‌జ‌లు ఏం చెప్పినా నమ్ముతారన్న ధీమాతోనే బాబు ఇలా అబ‌ద్దాలు చెబుతున్నార‌ని విమ‌ర్శించారు.  బాబు పాల‌న‌పై ఎవ‌రైనా వ్య‌తిరేకంగా మాట్లాడితే అక్ర‌మ కేసులు పెడుతూ భ‌య‌భ్రాంతుల‌కు గురి చేస్తున్నార‌న్నారు.  హామీలపై ఒత్తిడి తెస్తే వారిపై ప్ర‌జాద్రోహులుగా ముద్ర వేయ‌డం బాబుకు ప‌రిపాటిగా మారింద‌ని ఆగ్రహించారు. రాజ‌కీయ రాక్ష‌సులుగా బాబు మారార‌ని ధ్వజమెత్తారు. బీసీల్లో చేరుస్తామని చెప్పడంతో న‌మ్మి ఓట్లు వేసిన కాపుల‌ను బాబు ఎంత దారుణంగా వంచించారో, ఎంత అమానుషంగా ప్రవర్తించారో స‌భ్య స‌మాజం చూసింద‌న్నారు. 

బాబు  తీరు మాన‌వ జాతికే మ‌చ్చ‌
బాబు త‌న అధికార బ‌లంతో ప్ర‌చార మ‌ధ్యమాల‌ను ఇనుప డెక్కాల కింద అణిచివేసిన తీరును ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని భూమన గుర్తు చేశారు. ముద్ర‌గ‌డ కుటుంబంపై బాబు స‌ర్కారు తీరు మానవ జాతికే మ‌చ్చ అన్నారు. మ‌హిళ‌లు అని కూడా చూడ‌కుండా ముద్ర‌గ‌డ భార్య‌, కోడ‌లి ప‌ట్ల వ్య‌వ‌హరించిన తీరు అమానుషమా కాదా అని భూమన బాబును ప్ర‌శ్నించారు. ఇంత‌ దారుణంగా, దుర్మార్గంగా వ్య‌వ‌హరించ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌న్నారు. రైతులు  గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాల‌ని కోరితే బాబు ఎంత వెట‌క‌రంగా మాట్లాడారో ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. 

తిరుగుబాబుకు నాయ‌కుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి
ప్ర‌తిప‌క్షాల గొంతు నొక్క‌డ‌మే కాకుండా స‌ర్వ‌నాశనం చేయ‌డానికి బాబు  ప్ర‌య‌త్నిస్తున్నార‌ని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.  కొద్దికాలం బాబు అందర్నీ చెప్పుచేత‌ల్లో ఉంచుకున్న‌ా... ఈ నిరంకుశ ధోర‌ణికి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు త్వ‌ర‌లోనే తిరుగుబాటు చేస్తార‌న్నారు. తిరుగుబాటుకు నాయ‌కుడుగా వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి ఉంటార‌న్నారు. ఎప్ప‌టికైనా గెలుపు వైయ‌స్సార్‌సీపీదేన‌న్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఏ ఒక్క‌రు కూడా సంతృప్తితో లేదరని భూమన చెప్పారు. పార్టీ మారి చాలా పెద్ద త‌ప్పు చేశామ‌న్న ధోరణిలో ఎమ్మెల్యేలు ఉన్నార‌న్నారు. బాబు వైఖ‌రి ప‌ట్ల అంద‌రూ తీవ్ర అసంతృప్తితో ఉన్నార‌న్న‌ది నిజ‌మ‌న్నారు. 

అల‌సిపోయే సైన్యం కాదు... క‌వాతుకు సిద్ధంగా ఉండే సైన్యం 
అల‌సిపోయే సైన్యం వైయ‌స్సార్‌సీపీలో లేరని భూమన చెప్పారు. నిరంత‌రం క‌వాతుకు సిద్దంగా ఉండే సైనికుల్లాగా వైయ‌స్సార్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఉన్నార‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పిలుపు మేరకు జూలై 8వ తేదీనుంచి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామ‌న్నారు. బాధ్య‌త‌ాయుతమైన ప‌ద‌విలో ఉన్న శాస‌న‌ స‌భ‌ాప‌తి ఎన్నిక‌ల్లో రూ. 11.5 కోట్లు ఖ‌ర్చు పెట్ట‌ానని చెప్పడం ద్వారానే... బాబు పార్టీ ఎన్ని వేల కోట్లు ఖ‌ర్చు పెట్టి అధికారంలోకి వ‌చ్చిందో ప్ర‌జ‌లు గ‌మ‌నించార‌న్నారు.  స్పీకర్ కోడెలపై ఎన్నిక‌ల క‌మిష‌న్‌, కోర్టులు త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భూమన కోరారు. 

No comments:

Post a Comment