21 June 2016

రైతాంగంపై చిత్తశుద్ది ముఖ్యం

హైదరాబాద్: ఏరు వాక పేరుతో ఫోటోలు దిగటం కన్నా, రైతుల్ని ఆదుకొనేందుకు చిత్తశుద్దితో ప్రయత్నించటం ముఖ్యం అని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాజీమంత్రి పార్థ సారధి అభిప్రాయ పడ్డారు. నికరంగా వ్యవసాయానికి ఎన్ని నీళ్లు ఇచ్చేది, ఎప్పటి నుంచి ఇచ్చేది తెలియ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
        ఎడ్లను అలంకరించి, నాగలిని దించినంత మాత్రాన రైతుల పట్ల ప్రేమ కనబరిచినట్లు కాదని స్పష్టం చేశారు. నాగలి దించి పంట ఇంటికి చేర్చే దాకా రైతు పడే శ్రమ కు తగినట్లుగా సహకరించి, అండగా ఉంటేనే రైతుల పట్ల చిత్త శుద్ధి ఉన్నట్లు భావించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రెండు సంవత్సరాల కాలంగా సరైన పెట్టుబడులు దొరక్క రైతులు అల్లాడిపోతున్నారు. అధిక వడ్డీలకు వ్యాపారుల నుంచి అప్పులు తెచ్చుకొని అల్లాడిపోతున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయం. అటు బ్యాంకులు అప్పులు ఈయవు, ఇటు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తెచ్చుకోలేని పరిస్థితి. ఆశలన్నీ ఎండమావులు అయిపోతున్నాయని పార్థ సారధి ఆవేదన వ్యక్తం చేశారు.
        ఈ సందర్భంగా మాజీ మంత్రి పార్థ సారధి ఒక ముఖ్య విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ప్రతీ ఏటా జిల్లా జిల్లాకు ఇరిగేషన్ సలహా మండలి సమావేశాలు జరిగేవని పేర్కొన్నారు. అంటే ఆ ప్రాంతానికి సంబంధించి నీటి వనరుల లభ్యత, ఎప్పటి నుంచీ ఏ పరిణామంలో నీరు లభిస్తుంది అనేది లెక్క గట్టి చెప్పడం జరిగేదని పేర్కొన్నారు. అటువంటిది గడచిన రెండేళ్లుగా ఎక్కడా ఐఏబీ సమావేశాలు జరగటం లేదని చెప్పారు. స్వయంగా నీటిపారుదల మంత్రి దేవినేని ఉమ ప్రాతినిధ్యం వహిస్తున్న క్రిష్ణా జిల్లాలో ఈ జాడ కనిపించటం లేదంటే ఎంతటి దయనీయమో అర్థం అవుతుందని పార్థ సారధి వ్యాఖ్యానించారు.
        వాస్తవానికి వ్యవసాయం మీద చిత్త శుద్ధి ఉంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి గట్టి చర్యలు చేపట్టి ఉండేవారని అభిప్రాయ పడ్డారు. మొన్నటి బడ్జెట్ లో కేంద్రం కేవలం వంద కోట్ల రూపాయిలు కేటాయిస్తే, దాని మీద గట్టిగా నిలదీసి అడగలేని పరిస్థితి నెలకొందని స్పష్టం చేశారు. ప్రతీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మోసం, అబద్దాల్నే అనుసరిస్తోందని ఆయన అన్నారు. పనులన్నీ పోలవరం అథారిటీకే అప్పగించాలని కేంద్రం చెబుతుంటే, చంద్రబాబు ప్రభుత్వం అందుకు అంగీకరించటం లేదని, కమీషన్ల కోసం కక్కుర్తి పడి పనులు ముందుకు సాగనీయటం లేదని అభిప్రాయ పడ్డారు.
        గతంలో కాల్వల ద్వారా నీళ్లు ఎప్పుడు ఇచ్చేది స్పష్టంగా చెప్పేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పార్థ సారధి అన్నారు. గత ఏడాది 60 టీఎమ్ సీలు మాత్రమే క్రిష్ణా డెల్టాకు ఇచ్చారని దీంతో సగందాకా పొలాల్లో సాగు చేయలేకపోయారని ఆయన వివరించారు. ఈ సంవత్సరం ఎంత వరకు నీళ్లు ఇస్తారో చెప్పటం లేదని, అటు భూగర్భ జలాలు ఎండిపోయిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటప్పుడు రైతులు ఎంత విస్తీర్ణంలో పొలాల సాగు చేపట్టాలో, ఎంత విస్తీర్ణంలో ఇతర పంటల వేసుకోవాలో సూచించటం ప్రభుత్వ కనీస కర్తవ్యం అని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంత మేర ఉంటుందో, చంద్రబాబు ప్రభుత్వంలో రైతులపట్ల ప్రేమ ఎంత అన్నది తెలుసుకోవచ్చని వివరించారు.
        ఇప్పుడు కాల్వలలకు నీళ్లు ఎపుడు వదిలేది, ఎంతవరకు ఇచ్చేది చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని పార్థసారధి పేర్కొన్నారు. దీనికి తోడు రైతులకు రావలసిన పరిహారాలు కానీ, బకాయిలు కానీ, సబ్సిడీలు కానీ విడుదల చేయలేని నిస్సహాయ పరిస్థితి కనిపిస్తోందని ఆయన అన్నారు. పారిశ్రామిక వేత్తలకు, కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన విషయంలో మాత్రం ప్రభుత్వం ఉత్సాహం చూపిస్తోందని, రైతుల విషయానికి వస్తే మాత్రం బాగా వెనుకంజ వేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో రైతులు సర్వం కోల్పోతే మాత్రం, ఇన్ పుట్ సబ్సిడీని కుంటిసాకులు చూపించి ఎగ్గొట్టారని పార్థసారధి అన్నారు. రైతులకు అందించాల్సిన సాయం విషయంలోనూ రీషెడ్యూల్ చేసి చేతులు దులుపుకొన్నారు. యాంత్రీకరణ పేరుతో యంత్రాలు తెచ్చిపెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నారని, వాటిని కొనేందుకు రైతులకు తగిన స్థోమత లేదన్నది వాస్తవం అని అన్నారు.
        రైతులు ఇన్ని కష్టాల్లో ఉంటే పట్టించుకోవటం లేదని, ఎంతసేపు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం మీద, సింగపూర్ కంపెనీల మీద మాత్రమే ఆలోచనలు పెట్టుకొంటున్నారని పేర్కొన్నారు.
        పోలవరం బాధితుల తరపున మాట్లాడితే దాన్ని అపార్థం చేసుకొంటున్నారని పార్థ సారధి అన్నారు. ప్రశ్నిస్తే దాన్ని అడ్డంకులు అంటున్నారని, పరామర్శిస్తే రెచ్చగొడుతున్నారని నెగటివ్ గా ప్రచారం చేస్తున్నారని పార్థసారధి అన్నారు. కరువు ఏర్పడినప్పుడు సరైన సమయంలో నివేదికలు కూడా పంపటం లేదన్నారు.

No comments:

Post a Comment