19 June 2015

మద్దతుధర ముష్టివేస్తారా...?

నాటి మాటలేమయ్యాయి బాబూ...
స్వామినాథన్ సిఫార్సుల అమలు హామీ హుళక్కి
పొరుగు రాష్ట్రాలను చూసి నేర్చుకోండి..
వైఎస్‌ఆర్ స్వర్ణయుగంలో సుభిక్షం..
వైఎస్‌కు ముందు ఆ తర్వాత అన్నదాతకు కష్టాలే..

అన్నదాతను ఆదుకుంటామని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుతామని అందుకోసం స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తామని నారా చంద్రబాబు నాయుడు ఊరూవాడా ఊదరగొట్టారు. ఎన్నికల ప్రచార సభల్లో రైతుల సంక్షేమం గురించి ఎన్నో కబుర్లు చెప్పారు. ఎన్నికల ప్రణాళిక తొలి పేజీలోనే స్వర్ణాంధ్ర నిర్మాణం శీర్షికన అన్నదాతకు ఎన్నో హామీలు గుప్పించారు. పగ్గాలు చేపట్టిన తర్వాత ఎన్నికల ప్రణాళికను బుట్టదాఖలా చేసి రైతులను వారి ఖర్మానికి వారిని వదిలేశారు. రాష్ర్టంలో చంద్రబాబు, కేంద్రంలో నరేంద్రమోడి సర్కారు పగ్గాలు చేపట్టిన తర్వాత వరుసగా రెండో సంవత్సరం కూడా ముష్టి విదిల్చినట్లుగా మద్దతు ధర పెంచడం చూస్తుంటే ఈ ప్రభుత్వాలకు రైతుల సంక్షేమం పట్ల ఎలాంటి చిత్తశుద్ధీ లేదని అర్ధమౌతోంది. ఈ ఏడాది ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 50, వేరుసెనగ పంటకు రూ. 30, పత్తికి రూ. 50 ముష్టి వేసినట్టుగా విదిల్చడం చాలా దారుణం.

మద్దతుధరపైనే రైతు మనుగడ...
రైతు పండించిన పంటకు ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరను కనీస మద్దతు ధరలుగా నిర్ణయించడమే నేటి రైతు సంక్షోభానికి ప్రధానమైన కారణం. ఏ వస్తువునైనా ఉత్పత్తి చేసినవాడే ధరను నిర్ణయించుకుంటాడు. కానీ రైతులు మాత్రమే పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోంది. వారి పంటల ధరలను ఎవరో నిర్ణయిస్తారు.  దేశంలో నేటికీ 55 శాతం మంది ప్రజలు తినేది వరి అన్నం. ఆహార ధాన్యాల్లో అత్యధికంగా పండించే పంట వరి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఉమ్మడి రాష్ట్రంలోనే ధాన్యం ఉత్పత్తి మూలంగానే రాష్ట్రానికి అన్నపూర్ణగా పేరు వచ్చింది. ఇక రాష్ట్ర విభజన తర్వాత నేటి ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌లో అన్ని పంటలు కలిపి సాధారణ సాగు 41.72 లక్షల హెక్టార్లు అయితే, ఇందులో ఒక్క వరి మాత్రమే 16.42 లక్షల హెక్టార్లు. వరి తర్వాత వేరుసెనగ 10.9  లక్షల హెక్టార్లు. పత్తి 7.7 లక్షల హెక్టార్లు. ఈ మూడు పంటలు కలిపితే సుమారుగా 82 శాతం సాగు జరుగుతోంది. రబీలో 25.8లక్షల హెక్టార్లు సాధారణ సాగు అయితే, ఇందులో వరి మాత్రమే 8 లక్షల హెక్టార్లు. ఈ మూడు పంటల గిట్టుబాటు- ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలపైనే ఆధారపడి ఉన్నది.

గత ఏడాదీ ఇంతే...
స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని వాగ్దానం చేసిన నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు వాస్తవానికి వాటిని ఏనాడో మరచిపోయారు. అధికారానికి వచ్చిన మొదటి సంవత్సరం 2014-15లో ధాన్యానికి మద్దతు ధర రూ. 1310 నుంచి రూ. 1360కు అంటే 3.8 శాతం, రెండవ సంవత్సరం 2015-16లో రూ. 1360 నుంచి రూ. 1410కు అంటే 3.67 శాతం, అలానే పత్తికి గత సంవత్సరం రూ. 4000 నుంచి రూ. 4050కు, రాబోయే సంవత్సరానికి రూ. 4050 నుంచి రూ. 4,100కు మాత్రమే పెంచారు. వేరుసెనగకు గత సంవత్సరం ఒక్క రూపాయి పెంచలేదు. రాబోయే సంవత్సరానికి కేవలం రూ. 30 పెంచారు. అన్ని రకాల పంటలకు ఏటా పెట్టుబడులు పెరుగుతూ పోతున్నాయి. కానీ వాటికి అనుగుణంగా మద్దతు ధరలు పెరగడం లేదు.

వైఎస్ స్వర్ణయుగంలో... అంతకు ముందు.. ఆ తర్వాత...
యూపీఏ ప్రభుత్వ విధానాల మూలంగానే రైతులు సంక్షోభానికి వెళ్ళారని విమర్శిస్తున్న నేతలు వారు మాత్రం చేసిందేమిటి? ఏనాడూ చంద్రబాబు కేంద్రంపై వత్తిడి తెచ్చి రైతుల పక్షాన మాట్లాడిందే లేదు. మద్దతు ధర పెంపు కోసం పోరాటం చేసిందే లేదు. 1999 నుంచి 2004 వరకు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల కాలంలో ధాన్యానికి పెరిగిన మద్దతు ధర- రూ. 490 నుంచి రూ. 550 మాత్రమే. అంటే 12.24 శాతం. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ కాలమే అన్నదాతకు అన్నివిధాలా స్వర్ణయుగం. ఈ 5 ఏళ్ళ కాలంలో ధాన్యానికి పెరిగిన మద్దతు ధర- రూ. 550 నుంచి రూ. 1000. అంటే 81.8 శాతం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖరరెడ్డి మద్దతు ధరలపై అనేకసార్లు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయటమే కాకుండా పార్లమెంటు సభ్యులు, అప్పటి కేంద్ర మంత్రుల ద్వారా చేసిన ఒత్తిడి పర్యవసానమే ఈ పెరుగుదల.  2009 నుంచి 2014 వరకు పెరిగిన మద్దతు ధర రూ. 1000 నుంచి రూ. 1310 అంటే 31 శాతం. మరలా ఎన్డీఏ ప్రభుత్వం రెండు సంవత్సరాలకు కలిపి రూ. 1310 నుంచి రూ. 1410కు మాత్రమే పెంచడం జరిగింది. అంటే 7.6 శాతం. తిరిగి 1999-2004 నాటి ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగిన పరిస్థితే పునరావృత్తం అయ్యేటట్లు కనిపిస్తున్నది.

మన రైతులకే ఎక్కువ నష్టం...
మద్దతు ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ రైతులు మాత్రమే ఎక్కువగా నష్టపోతున్నారు. ధాన్యం పండించే ప్రధాన రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పండే బాస్మతి రకం, పూసా 1121 రకం ఎగుమతులు అవుతాయి. అంతేగాక పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిసాలలో ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్‌లో పండే ధాన్యం బంగ్లాదేశ్‌కు బహిరంగంగానే స్మగుల్డ్ అవుతాయి. మన రాష్ట్రంలో ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉండటం మూలంగా రైతులు పూర్తిగా సంక్షోభంలోకి నెట్టబడుతున్నారు.

నష్టాలు తట్టుకోలేకే క్రాప్ హాలిడే...
2011లో దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అత్యంత సారవంతమైన, అత్యంత సాగు నీటి వనరులు కలిగిన గోదావరి డెల్టాలోని కోనసీమ ప్రాంతంలోని రైతులు పంట పండించి నష్టపోతున్నాం అని సాగు సమ్మె(క్రాప్ హాలిడే) చేసిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ అధికార లెక్కల ప్రకారం ధాన్యం ఉత్పత్తి వ్యయం క్వింటాల్‌కు రూ. 1250. మద్దతు ధర రూ. 1080. ఈ పంట పండించి క్వింటాల్‌కు రూ. 170 అధికారిక లెక్కల ప్రకారమే రైతు నష్టపోయాడు. అదే 2014-15లో ఉత్పత్తి వ్యయం రూ. 1280లు, మద్దతు ధర రూ. 1360. ఒక క్వింటాల్ ఉత్పత్తి మూలంగా రైతు రూ. 248 నష్టపోయాడు. ఇదే నేటి రైతు సంక్షోభానికి ప్రధాన కారణం.

రైతుకు నష్టం... సర్కారుకు లాభం
మన రాష్ట్రంలో 2014-15లో రైతు ఒక క్వింటాల్ ధాన్యం పండించటం ద్వారా ఖర్చు రూ. 1708 - ధర 1360 = రూ. 348 నష్టపోయాడు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 1360కి 19.5 శాతం పన్నుల ద్వారా రూ. 265 ఆదాయం గడిస్తున్నది.  ఎకరానికి సరాసరి దిగుబడి 22 క్వింటాళ్ళు వస్తే.. ఒక ఎకరం పంట ద్వారా రైతు రూ. 7,656 నష్టపోయాడు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రూ. 5830 ఆదాయం చేకూర్చుకున్నది.
 ఇవేనా రైతు అనుకూల విధానాలంటే..?

పొరుగురాష్ట్రాలను చూసైనా...
రైతుకు భూమి కన్న తల్లి. ఆ కన్న తల్లి లాంటి భూమిని బీడుగా ఉంచడు. ఎంత సంక్షోభంలో ఉన్నా పంటలు పండిస్తూనే ఉంటాడు. మన అందరికీ కావాల్సిన ఆహార ధాన్యాలు వస్తూనే ఉంటాయి కాబట్టి, మనందరికీ ఆహార భద్రత ఇస్తూ పంట ద్వారా తాను పెట్టిన పెట్టుబడి రాక అప్పుల పాలై తన కుటుంబానికి ఆర్థిక భద్రత ఇవ్వలేక, ఆత్మాభిమానం చంపుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఈ పరిస్థితికి ఎవరు కారకులు? దేశానికి రైతు అవసరం. రైతుకు ఆదాయం అవసరం. రైతుకు ఆదాయం గిట్టుబాటు ధరల నుంచి మాత్రమే రావాలి అనే విషయాన్ని మర్చిపోయి, నేటి పాలకులు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి, వాస్తవాలకు దూరంగా రైతులకు ముష్టి వేసినట్టుగా మద్దతు ధరలు పెంచడం చాలా దారుణం. ధాన్యం పండించే అనేక రాష్ట్రాలు వారి రైతుల శ్రేయస్సు కోసం 2013-14లో ఛత్తీస్‌గఢ్ రూ. 300, కర్ణాటక రూ. 290, కేరళ రూ. 490, మధ్యప్రదేశ్ రూ. 150, తమిళనాడు రూ. 70 బోనస్‌గా క్వింటాల్ ధాన్యానికి ఇస్తున్నాయి.

వాగ్దానాలు మోసం... మిషన్‌లూ మోసం...
గత ఏడాదిలో మద్దతు ధరలు గిట్టుబాటు ధరలుగా లేకపోయినప్పటికీ, ఆ మద్దతు ధరలు కూడా వరి, వేరుసెనగ, పత్తి, మొక్కజొన్న తదితర పంటల రైతులు అమ్ముకోలేక మద్దతు ధరలు కంటే రూ. 200 నుంచి 300 తక్కువకు తెగనమ్ముకున్న విషయం తెల్సిందే. గుంటూరు జిల్లాలో రైతుల పేరు మీద తెలుగుదేశం పార్టీకి చెందిన బ్రోకర్లు అక్రమంగా సీసీఐలో పత్తి అమ్మకాలు సాగించి కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్డిన విషయం కూడా తెలిసిందే. మద్దతు ధరలక ంటే తక్కువకు ధరలు పడిపోయినప్పుడు రైతులను ఆదుకోవటానికి రూ. 5000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెడతానని తెలుగుదేశం పార్టీ చేసిన వాగ్దానం రెండు బడ్జెట్లు పూర్తి అయినా దాని ఊసే లేదు. వేదికల మీద మాత్రం రైతు ప్రాధికార మిషన్ ను ప్రారంభించాం అని మోసపూరిత మాటలు మాట్లాడుతున్నారు. జూన్ నెలలో ఖరీఫ్ ప్రారంభంలోనే తీవ్ర సంక్షోభంలో ఉన్న అనంత రైతు వేరుసెనగ విత్తనం కోసం రోడ్డు ఎక్కిన పరిస్థితి కళ్ళముందు కనిపిస్తోంది. గత సంవత్సరకాలంలో వ్యవసాయానికి సంబంధించి రుణమాఫీ చేయని విషయం, రైతులకు రుణాలు అందించే విషయం, ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించే విషయం, తుపాను, కరువుకు దెబ్బతిన్న రైతులకు మీ విధానాల మూలంగా ఇన్సూరెన్స్ రాకుండా పోవటం.. ఇలా అన్ని విషయాల్లో రైతుకు సంబంధించినంతవరకు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కనీసం రాబోయే సంవత్సరంలోనైనా చిత్తశుద్ధితో వ్యవహరించి బూటకపు మాటలు కాకుండా రైతులకు వాస్తవంగా ఉపయోగపడే కార్యక్రమాలను తీసుకోవాలి.

కేంద్రంపై ఒత్తిడి తేవాలి
మన రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రంలోని అధికార కూటమిలో భాగస్వామి. రైతులకు మోసపూరిత మాటలు చెప్పకుండా ఇచ్చిన హామీల మేరకు అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమం కోసం కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నామని, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతోంది.

ఇతరదేశాల్లో మద్దతుధరలు 
మన దేశంలో అందరూ రైతుల గురించే మాట్లాడతారు. కానీ రైతులకు ఒరిగేది మాత్రం శూన్యం. ధాన్యం పండించే దేశాల్లో ఆయా ప్రభుత్వాలు రైతులకు ఇస్తున్న కనీస మద్దతు ధరలను పరిశీలిస్తే...
 2014-15లో థాయ్‌లాండ్ 691.2 డాలర్లు (ఫర్ మెట్రిక్ టన్ ఆఫ్ రైస్)
  ఫిలిప్పైన్స్ 593.7
  చైనా జపానికా 495.5
  చైనా ఇండికా 446.3
  ఇండోనేషియా 411.1
  ఇండియా 311.3

ధాన్యంపై విధిస్తున్న పన్నులు, ఇతర ఖర్చులు
 ఆంధ్రప్రదేశ్- 19.5 శాతం
 ఒడిసా 15.5 శాతం
 పంజాబ్ 14.5 శాతం
 హర్యానా 11.5 శాతం
 ఛత్తీస్‌గఢ్ 9.7 శాతం
 యూపీ 9 శాతం
 బీహార్ 6.5 శాతం
 ఎంపీ 4.7 శాతం
 కర్ణాటక 4 శాతం
 మహారాష్ట్ర 3.55 శాతం
 పశ్చిమ బెంగాల్ 3 శాతం

స్వామినాథన్ కమిషన్ ప్రధానమైన సిఫార్సులేమిటంటే.. 
 1. పెరుగుతున్న పెట్టుబడులకు అనుగుణంగా కనీస మద్దతు ధరలు ఉండాలి.
 2. వ్యవసాయ ఉత్పత్తులు పండించటానికి అవుతున్న ఖర్చుకు 50 శాతం అదనంగా కలిపి కనీస మద్దతు ధరలు నిర్ణయించాలి.
 3. రైతు ఇంటికి తీసుకునివెళ్ళే నికర ఆదాయం ప్రభుత్వ అధికారుల జీతంతో సమానంగా ఉండాలి.

No comments:

Post a Comment