13 June 2015

బాలాయపల్లి భూములు ఎవరివి బాబూ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతి కుంభకోణాలకు అంతేలేదు. ఇపుడు ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇదే కాదు చంద్రబాబు సర్కారు ఏడాది కాలంలో అనేక కుంభకోణాలకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. అయితే బాబుగారి కుంభకోణాల ఘనకీర్తిని 2001లోనే తెహల్కా బైటపెట్టింది. దేశంలోకెల్లా చంద్రబాబు అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి అని కితాబులిచ్చింది. అపుడు తెహల్కా బైటపెట్టిన బాబు ఆస్తుల్లో నెల్లూరు జిల్లా బాలాయపల్లి భూములు కూడా ఉన్నాయి. బాలాయపల్లిలో దాదాపు 300 ఎకరాల తోటలు చంద్రబాబుకు ఉన్నాయని తెహల్కా పేర్కొంది. వాటిపై ఆ మధ్య ససాక్ష్యంగా సాక్షి దినపత్రికలో ప్రత్యేక కథనాలు వస్తే ‘‘అయ్యో.. అలాంటిదేమీ లేదు... ఆ భూములకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు....’’ అని చంద్రబాబు బుకాయించారు. వాస్తవానికి ఆ భూములు చంద్రబాబు బంధువుల పేరిట ఉన్నాయి. అంటే బినామీ భూములన్నమాట. చుట్టూ కాంపౌండ్ కూడా ఏర్పాటు చేసిన ఆ భూముల్లో దళితులకు చెందిన అసైన్డ్ భూమి కూడా ఉంది. కానీ దళితులను చంద్రబాబు బంధువులు లోనికి అడుగుపెట్టనివ్వరు. చాలా ఏళ్లుగా ఈ దౌర్జన్యం కొనసాగుతోంది. సాక్షిలో కథనాల తర్వాత స్థానిక అధికారులు దళితులను లోపలికి వెళ్లేందుకు, వారి భూములు సాగు చేసుకునేందుకు అనుమతించారు. కానీ చంద్రబాబు మరలా ముఖ్యమంత్రి కావడంతో పరిస్థితి తారుమారయ్యింది. చంద్రబాబు బంధువులు దళితులను లోనికి రానివ్వడం లేదు. తోటలు సాగుచేసుకునేందుకు, పంటను కోసుకునేందుకు వెళ్లనివ్వడం లేదు. సీఎం బంధువుల మని చెబుతూ దౌర్జన్యం చేస్తున్నారంటూ దళితులు వాపోతున్నారు. బాలాయపల్లి మండలం నిండలి గ్రామంలో నారా చంద్రబాబు నాయుడుకు సర్వే నెంబర్ 139-8బి 16లో సీలింగ్ భూమి ఉంది. 2004లో ఈ భూమిని ఆ గ్రామ ఎస్సీ ఎస్టీలకు చెందిన 18 మందికి ఆర్‌సీ నెంబరు 131-2002 ప్రకారం ఒక్కొక్కరికి 0.77 సెంట్ల చొప్పున 13.86 ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి ఆ భూములలో మామిడి తోటలు సాగుచేసుకుంటూ వారు అనుభవిస్తున్నారు. అయితే ఇపుడు మురళీనాయుడు, దొరస్వామినాయుడు, చిన్నప్పనాయుడు పేర్లుగల వ్యక్తులు దళితులను తోటల్లోకి రానీయకుండా అడ్డుకుంటున్నారు. మామిడి పండ్లు కోయకపోవడంతో రాలిపోతున్నాయంటూ దళితులు ఆందోళన చేస్తున్నారు.

No comments:

Post a Comment