25 June 2015

తెలంగాణలో దొరికిపోయినా జ్ఞానోదయం కలగలేదా?

టీడీపీపై బొత్స సత్యనారాయణ విమర్శ
 హైదరాబాద్ : తెలంగాణలో ఓటుకు కోట్లు కుంభకోణానికి పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయినప్పటికీ తెలుగుదేశం పార్టీకి జ్ఞానోదయం అయినట్లు లేదని వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. సరిపడినంత బలం లేకపోయినా అభ్యర్థులను నిలుపుతూ డబ్బు వెదజల్లి గెలవాలని భావిస్తోందని, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో తమకు బలం ఉండబట్టే సూత్రబద్ధమైన వైఖరితో అభ్యర్థిని నిలబెట్టామని, కానీ తగినంత బలం లేదని తెలిసినా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టిందని అన్నారు. దాన్ని బట్టి తెలంగాణలో అనుసరించిన పద్ధతులనే ఇక్కడా అనుసరించాలని భావించినట్లు అర్ధమౌతుందని అన్నారు. సంఖ్యాబలాన్ని తారుమారు చేయడం కోసం తెలుగుదేశం పార్టీ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందన్నారు. రాజకీయపార్టీలు వస్తుంటాయి పోతుంటాయి కానీ నిబంధనల మేరకు అధికారులు నిస్పాక్షికంగా వ్యవహరించాలని బొత్స పేర్కొన్నారు. అధికారులు నీతిమాలిన పనులు చేయడం సరికాదని, తలదించుకునే పరిస్థితి తెచ్చుకోరాదని బొత్స హితవు పలికారు. అధికారం చేతిలో ఉంది కదా అని నాయకులు చెప్పినట్లు అధికారులు వింటే ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకొకమారు ఎన్నికలు జరుగుతాయి.. రేపు  అధికారం చేతులు మారితే ఇప్పుడు చేసిన పనులకు అప్పుడు తలదించుకోవలసి వస్తుందని ఆయన అన్నారు. చట్ట ప్రకారం కార్యక్రమాలు చేస్తే అభ్యంతరం లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రవర్తించకూడదని అన్నారు. ‘‘నెల్లూరులో జరిగిన ఘటన చూస్తే చట్టాన్ని ఎలా చేతిలోకి తీసుకోవాలో, వాళ్లు పోలీసు వ్యవస్థను ఎలా ఉపయోగించారో అర్ధమౌతుంది. వ్యవస్థ దారి తప్పితే దాన్ని సక్రమ మార్గంలో పెట్టడం కష్టం. ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం ఇలాంటి నీతిమాలిన పనులు చేయడం సరికాదనే మాకు బలం లేని చోట పోటీకి దూరంగా ఉన్నాం . ఇపుడు వీరు కొత్త డ్రామా తీసుకొచ్చారు. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో వైఎస్ జగన్ ఎవరినో కలిశారంటూ కొత్త వాదన తీసుకొచ్చారు. ఇది చాలా దురదృష్టకరం. నిజంగా సాక్ష్యాలుంటే ఏం జరిగిందో చెప్పాలి. అదేమీ లేకుండా ఎక్కడో ఎవరో చెబితే దాన్ని వీళ్లు ప్రచారం చేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటున్నారు. అది తప్పు. ఇప్పటికే మీ మాయ మాటలు నమ్మి మోసపోయినందుకు ప్రజలు పశ్చాత్తాపపడుతున్నారు. మళ్లీ అలాంటి మోసపు మాటలు చెప్పకండి’’ అన్నారు. ‘‘రాష్ర్ట విభజన నేపథ్యంలో పార్లమెంటులో చట్టం అయినపుడు అందులో తప్పున్నా, ఒప్పున్నా చట్టాన్ని తుచ తప్పకుండా అమలు చేయాలనే మేం ముందునుంచీ చెబుతున్నాం. అందులో సెక్షన్8 ఉన్నా, 9 ఉన్నా అమలు చేయాల్సిందే. రాష్ర్ట విభజన జరిగిన రోజు నుంచే ఇవన్నీ అమలు లోకి వస్తాయి. అంతేతప్ప ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి ఇపుడు సెక్షన్ -8 అమలు చేయాలనడం తప్పు’’ అని బొత్స వివరించారు.

No comments:

Post a Comment