13 June 2015

మాఫీ జరగదు..... అప్పు పుట్టదు..

 అన్నదాతకు శాపంలా మారిన మాఫీ
 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన దొంగ హామీ... రుణమాఫీ అన్నదాతల పాలిట శాపంగా మారింది. ఒకవైపు ఇప్పటికే ఉన్న రుణాలు పూర్తిగా మాఫీ కాక రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పులిమీద పుట్రలా బ్యాంకులు కొత్త అప్పులకు నిరాకరిస్తున్నాయి. ఒక పాస్‌బుక్‌పై వ్యవసాయ రుణం లేదా బంగారం తాకట్టు రుణం ఇలా ఏదో ఒకటే ఇస్తారు. పైగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే రుణం మంజూరు చేయాలని ఆర్‌బీఐ నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలుండడంతో ఎక్కువ రుణం వచ్చే పరిస్థితి లేదు. ఏ కొంచెం ఎక్కువైనా ఇపుడున్న ఏడుశాతానికి బదులు 12శాతం వడ్డీ భరించాల్సిందే. గతంలో భూమి దస్తావేజులు, పాస్‌బుక్, టైటిల్ డీడ్‌లను తనఖా పెట్టుకుని రైతులకు పంట రుణాలిచ్చేవారు. పంట రుణమే కాదు ఈ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలిస్తే బంగారు ఆభరణాలపై 7శాతం వడ్డీకే వ్యవసాయ రుణాలు కూడా మంజూరు చేసేవారు. వ్యవసాయ యంత్రాలు, పాడి, ఆక్వా తదితర వ్యవసాయానుబంధ రంగాలకు అవసరాలకు తగినట్లుగా రుణాలిచ్చేవారు. వ్యవసాయ రుణాలకు మాత్రం తొలి లక్ష రుణానికి జీరో పర్సంట్ వడ్డీ రాయితీ కింద.. ఆ తర్వాత రెండు లక్షలకు పావలా వడ్డీ రాయితీని పరిగణనలోకి తీసుకునేవారు. మిగిలిన రుణాన్ని మాత్రం ఏడుశాతం వడ్డీతోనే రైతు చెల్లించేవాడు. ఇపుడు మాత్రం రైతుకు భూమి విస్తీర్ణాన్ని బట్టి ఆ భూమిలో వేసే పంటకు సంబంధించి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు తగ్గట్టుగా రుణాలివ్వాలని ఆర్‌బీఐ స్పష్టంగా ఆదేశించింది. వరికైతే ఎకరాకు 24వేలు, చెరుకుకు 35వేల వరకు మాత్రమే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద రుణమిస్తారు. పైగా ఒక దస్తావేజు లేదా పట్టాదారు పాస్‌పుస్తకంపై ఒక రుణాన్ని మాత్రమే పంట రుణంగా పరిగణిస్తారు. ఆ తర్వాత బంగారు ఆభరణాలను కుదువపెట్టి భూమి డాక్యుమెంట్లపై తీసుకునే రుణాలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల కోసం ఎంత రుణం కావాలన్నా ఇస్తారు. కానీ ఆ రుణంపై మాత్రం 12శాతం వడ్డీ భరించాల్సి ఉంటుంది. దీంతో గతంలో మాదిరిగా ఎవరికి బడితే వారికి పంటరుణాలు, వ్యవసాయ రుణాలు ఇచ్చే అవకాశం లేదు. అధికారులు సిఫార్సు చేసినంత మాత్రాన కౌలు రైతులకు రుణాలిచ్చే అవకాశం కూడా లేదు. భూమి యజమాని అంగీకార పత్రం కచ్చితంగా ఉండాలి.
  ఇదంతా రుణమాఫీ సరిగా జరగని ఫలితమే. రుణమాఫీ హామీని ఎగ్గొట్టడానికి చంద్రబాబు నాయుడు ఎన్నో ఎత్తులు వేసిన ఫలితమిది. రుణమాఫీని పరిమితం చేయడానికి, లబ్దిదారులను తగ్గించడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో ఎత్తుగడలు వేసింది. అందులో భాగంగానే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను రంగంలోకి తీసుకువచ్చారు. ఆ నిబంధన గతంలోనే ఉన్నా బ్యాంకులు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొంచెం అటుఇటుగా రుణాలు మంజూరు చేసేవి. అయితే ఈ స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ నిబంధనను అడ్డుపెట్టుకుని ఆ మేరకే రుణాలను మాఫీ చేయడం ద్వారా భారాన్ని తగ్గించుకోవాలని చంద్రబాబు సర్కారు చూసింది. దాంతో రైతులకు కొద్దిమేరకే రుణం మాఫీ అవుతుంది. మిగిలిన భాగం బ్యాంకులకు రైతులు చెల్లించాల్సి ఉంటుంది. అలా మిగిలిపోయే మొత్తాలకు వడ్డీ కూడా జత కలుస్తుంది. ఇవన్నీ రైతుకు పెనుభారంగా పరిణమించనున్నాయి. ప్రభుత్వం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేరకే రుణాలను మాఫీ చేస్తుండడంతో రిజర్వు బ్యాంకు కూడా ఆ నిబంధనను కఠినంగా అమలు చేయాలని బ్యాంకులకు సూచించింది. ఎందుకంటే రైతులు కట్టలేని మిగిలిన మొత్తాలన్నీ రానిబాకీలుగా మారిపోయి బ్యాంకుల పరిస్థితి ఇబ్బందిగా మారే ప్రమాదముంటుంది. అందుకని రైతులను అడకత్తెరలో పోకచెక్కలా మార్చేశారు. అటు చంద్రబాబు ప్రభుత్వం, ఇటు బ్యాంకులు కలసి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయి.

No comments:

Post a Comment