22 June 2015

వంకర టింకర విన్యాసాలు

పట్టాదారు పాస్ బుక్, టైటిల్ డీడ్ ల రద్దుకు యోచన 
 హైదరాబాద్‌ః ఓటుకి కోట్లు కుంభకోణంలో పూర్తిగా మునిగిపోయిన చంద్రబాబు కి పాలన మీద పూర్తిగా పట్టు తప్పుతోంది. కొందరు సలహాదారులు ఇచ్చిన సలహాలకు వెంటనే ఓకే చెప్పేస్తున్నారు. దీంతో వాటి ప్రభావం ఎలా ఉంటుంది, సాధక బాధకాలు ఏమిటి అనే దానిపై ప్రభుత్వంలోని వారెవ్వరూ పూర్తిగా ఆలోచించటం లేదు. పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్సు రద్దు నిర్ణయం అటువంటిదే అని అంటున్నారు.
 ఏమిటీ పుస్తకాలు..!
 పూర్వం రెవిన్యూ రికార్డులన్నీ రాత పూర్వకంగా ప్రభుత్వ రికార్డుల్లోనే ఉండేవి. భూమి దారుడుకి వీటి వివరాలు సరిగ్గా తెలిసే పరిస్థితి ఉండేది కాదు. గతంలో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి గా ఉండగా ఉమ్మడి రాష్ట్రంలోని భూములన్నింటికి పట్టాదారు పాస్ బుక్‌లు, టైటిల్ డీడ్సులు ముద్రించి ఇవ్వటం మొదలెట్టారు. దీనికోసం అప్పట్లో రెవిన్యూ యంత్రాంగం తీవ్రమైన కసరత్తు చేసింది. ఇదే అదనుగా అప్పట్లో కొన్ని చోట్ల తెలుగుదేశం నాయకులు రికార్డులు తారుమారు చేసి వందలాది ప్రభుత్వ భూములకు తమ పేరిట రికార్డులు సృష్టించుకొన్నారు. మొత్తం వివరాలన్నీ లెక్క తేలాక కొందరు అధికారులు ఈ అక్రమాల్ని గుర్తించినా కానీ,  అధికార పార్టీ నాయకుల జోలికి వెళ్లటం ఎందుకని మెదలకుండా ఊరుకొన్నారు. ఆ విషయాల్ని పక్కన పెడితే అప్పటి నుంచి ఈ పుస్తకాలే అధికారిక రికార్డులుగా చెలామణీ అవుతున్నాయి. పట్టాదారు పాస్ బుక్ లు, ైటె టిల్ డీడ్సు ల్లో రైతు పేరు, చిరునామా ఇతర వివరాల్ని పొందుపరిచి, ఫోటో తో సహా ఉన్న వివరాల్ని మండల రెవిన్యూ అధికారి  సర్టిఫై చేసి ఇస్తారు. దీంతో ఈ పాస్ బుక్ లను భూముల తాలూకా అధికారిక రికార్డులుగా భద్రపరచుకొంటున్నారు.
రుణ పరపతికి ఆధారం
పంట రుణాలు, ఇతర పరపతి మార్గాలకు సెక్యూరిటీ ఉంచుకోవటం ఆనవాయితీ. అందుకే బ్యాంకులు, సహకార సంఘాల్లో రుణం తీసుకొన్నప్పుడు ఈ పుస్తకాల్ని సెక్యురిటీ గా ఉంచుకోవటంతో పాటుగా పంట రుణాల వివరాల్ని ఇందులో నమోదు చేస్తారు. అప్పుడు ఒక భూమి మీద అనేక బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవటాన్ని నిరోధించటానికి వీలవుతుంది. రుణ వివరాలు ఇందులో పొందుపరచటంతో రైతులకు కూడా రికార్డులు స్పష్టంగా ఉంటున్నాయి. ఎక్కడెక్కడ ఎంతెంత రుణాలు ఉన్నాయి, వీటి వ్యవధి ఎంత అనే వివరాలు ఇందులో స్పష్టంగా ఉంటాయి. పైగా భూముల సొంతదారులు, కౌలుదారుల వివరాలు కూడా నమోదు చేసుకొనే అవకాశం ఉంటుంది. రెవిన్యూ సిబ్బంది రికార్డుల్లో కూడా ఈ వివరాలు ఉంటాయి.
  కొత్త విధానంతో రైతుల్లో కంగారు
 ఇప్పుడు ఈ పుస్తకాల విధానాన్ని రద్దు చేసేందుకు ్రపభుత్వం ప్రయత్నిస్తోంది. కేవలం వెబ్‌సైట్ లోనే వివరాలు నమోదు చేసి ఉంచి, దీన్నే ప్రభుత్వ రికార్డుగా భావించమంటున్నారు. గతంలో పాస్ బుస్తకాల జారీ లో ఇదే తెలుగుదేశం నాయకులు ఎక్కడికక్కడ వందల ఎకరాల్ని మాయం చేసిన ఉదంతాల్ని గ్రామాల్లోని ప్రజలు గుర్తు చేసుకొంటున్నారు. ఇప్పుడు కూడా పాస్ బుక్ లు రద్దు చేసి కొత్త విదానంలోకి వెళ్లటం అంటే ఇదే అదనుగా ప్రతీ చోట ప్రభుత్వ భూముల్లో వందల ఎకరాల్ని రికార్డుల్లో మార్చేసి సొంతం చేసుకొంటారన్న మాట వినిపిస్తోంది.
 ప్రైవేటు పరం
 మన భూమి వెబ్‌సైట్ లో ఉంచిన రికార్డులే ఇక నుంచి చెలామణీ అవుతాయని చెబుతున్నారు. ప్రభుత్వ రెవిన్యూ అధికారులు నిర్వహించే పాస్‌బుక్ లు, ైటె టిల్ డీడ్సు లోనే అవకతవకలు జరుగుతూ  ఉంటే.. ఇక, ప్రైవేటు మీ సేవ ఆపరేటర్లు నిర్వహించే మనభూమి వెబ్ సైట్ లో ఎన్ని అవకతవకలు చోటు చేసుకొంటాయో అని రైతులు కంగారు పడుతున్నారు. పైగా వెబ్ సైట్ లో రికార్డులను రైతులు అర్థం చేసుకోవటం కష్టం అన్న మాట వినిపిస్తోంది.
 రుణమాఫీ ఉదంతమే ఉదాహరణ
 చంద్రబాబు ప్రభుత్వం గొప్పగా చెప్పి తుస్సు మనిపించిన రుణమాఫీ ఉదంతాన్ని గుర్తు చేసుకొంటున్నారు. రైతుల్లో ఎవరెవరకు రుణమాఫీ అయింది, ఎందుకు అయింది, ఎందుకు కాలేదు అనేది ఎవ్వరికీ అంతుబట్టడం లేదు. వెబ్ సైట్ లో చూపించిన రికార్డులే బ్రహ్మ రాతలు అన్నట్లుగా ప్రచారం చేసేస్తున్నారు. దీంతో రుణమాఫీ విషయంలో ఇప్పటికీ జనం జుట్టు పీక్కొంటున్నారు.
 భూముల తికమకలతో గొడవలు
 పల్లెటూళ్లలో చాలా తగాదాలకు మూలం పొలాల సరిహద్దు వివాదాలు. చాలా స్పష్టంగా రైతుల దగ్గర పాస్ బుక్ లు ఉంటేనే ఈ వివాదాలు తలెత్తుతుంటాయి. ఇప్పుడు వీటిని రద్దు చేసి వివరాలన్నీ ఆన్ లైన్ లో ఉంచటంతో సమస్యలు వస్తాయని క్షేత్ర స్థాయిలోని అధికారులు అంటున్నారు. ఒక ప్రాంతానికి చెందిన సరిహద్దులు మార్చేసి, కొంత కాలం పోయాక దీని ఆధారంగా గొడవకు దిగితే చేసేది ఏముంటుంది అని ్రపశ్నిస్తున్నారు. పైగా కొన్ని చోట్ల ఈ వెబ్‌సైట్ నుంచి ప్రభుత్వ భూమికి కూడా టెన్-1 అడంగళ్ వెలువడుతున్న దృష్టాంతాల్ని ఉదహరిస్తున్నారు. పాస్ బుక్ లు లేకపోవటంతో ఈ అడంగళ్ సాయంతో రుణాలు పొందలేక పోతున్నారు. ఇక, పాస్ బుక్ లు రద్దు చేసేస్తే వీటి సాయంతో ప్రభుత్వ భూముల పైన ప్రైవేటు వ్యక్తులు రుణాలు తీసుకొనే ప్రమాదం ఉంది. అప్పుడు మరింత గొడవలు అవుతాయని చెబుతున్నారు.
 కుట్ర దాగి ఉందా..!
 ఇన్ని గొడవలు తలెత్తుతాయన్న సంగతి ప్రభుత్వ పెద్దలకు తెలుసన్న మాట వినిపిస్తోంది. గతంలో మాదిరిగానే రెవిన్యూ రికార్డులు మార్చేసే సందర్బంలో వేలాది ఎకరాల భూమిని ఒక్కసారిగా చేజిక్కించుకొనేందుకు కుట్ర జరుగుతోందన్న మాట వినిపిస్తోంది. అందుకే ఈ మొత్తం కసరత్తుని చాప కింద నీరులా చేయిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. పైగా ఆంధ్రప్రదేశ్ లో అనేక చోట్ల ఇప్పటికే భూముల ధరలకు రెక్కలు వచ్చేశాయి. ఇప్పుడు ఉన్న అధికారం తర్వాత ఉంటుందో లేదో తెలియనే తెలియదు. అటువంటప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబె ట్టుకొనే కుట్ర జరుగుతోందన్న మాట వినిపిస్తోంది. ప్రతీ జిల్లాలోనూ ప్రభుత్వ భూమిని గుర్తించి బడా నాయకులు ఒక కన్నేసి ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. 

No comments:

Post a Comment