15 June 2015

చంద్రబాబు మాటలకు అర్థాలే వేరు..!

గొడవలు రేపే విధంగా ప్రకటనలు, ప్రచారాలు

 హైదరాబాద్: చంద్రబాబు దివాళాగోరు రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు ఓటుకి నోటు కుంభకోణం బయట పడ్డ దగ్గర నుంచి ఆయన ప్రవర్తన ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. ముఖ్యంగా లోతులోకి కూరుకొని పోయానన్న విషయం అర్థం అయ్యాక, ఆయన తన అసలు స్వరూపాన్ని బాగా ప్రదర్శిస్తున్నారు.

 ఆడియో సంభాషణలే అసలు మూలం
 ఈ కుంభకోణం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టుతో బయటకు పొక్కింది. దీన్ని తాత్కాలిక అంశంగా మరుగున పరిచేందుకు తెలుగుదేశం వర్గాలు ప్రయత్నించాయి. దీంతో పాటుగా టీఆర్ ఎస్ పార్టీ మీద విమర్శలు గుప్పించి, అప్పుడు ఎదురయ్యే దాడిని ప్రచారం చేసి మ్యాటర్ ను మరుగున పరిచేందుకు ప్రయత్నించారు. ఈ దిశగా వేస్తున్న అడుగులు క్రమంగా బెడిసికొట్టాయి. సరిగ్గా వారం ఆగి చంద్రబాబు మాట్లాడిన టేపులు బయటకు రావటంతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. నోటుకి ఓటు కుంభకోణం అసలు సూత్రధారి చంద్రబాబే అని, అసలు రేవంత్‌రెడ్డిని అక్కడకు పంపించింది బాబే అని తేలిపోయింది. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన బాస్ చంద్రబాబే అనేందుకు కావాల్సిన ఆధారం ఒక్కసారిగా బయట పడింది. దీంతోచంద్రబాబు అసహనం పరాకాష్టకు చేరింది. దీనిపై బుకాయించటానికి ప్రయత్నించి బోర్లా పడ్డారు. ఈ సంభాషణలు తనవి కావా..అవునా.. అన్న విషయం కూడా స్పష్టంగా చెప్పటం లేదు. ఈ ఆడియో టేపు ల విషయంలో ఎలా బయట పడాలా అన్న దానిపై కోటరీ పూర్తిగా ఆలోచనలో  పడిపోయింది.

 కేంద్రాన్ని ఊబిలోకి లాగే ప్రయత్నం
 కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ ఊబిలోకి లాగితే ఈ గండం నుంచి బయట పడవచ్చని చంద్రబాబు తలంచారు. వెంటనే ఢిల్లీ ప్రయాణం అయ్యారు. అక్కడ ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం మాదిరిగా పెద్దల్ని కలిసి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదలుకొని, సీనియర్ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాజకీయంగా ఎదురయ్యే సమీకరణాల్ని ముందుకు పెట్టి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే కేంద్ర నిఘావర్గాల నుంచి ఢిల్లీ పెద్దలకు సమాచారం అందింది. జరిగిన విషయాలపై నివేదిక తెప్పించుకొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబును వెనకేసుకొని రావటం అంటే తప్పుల కుంపటిలో అడుగు పెట్టడమే అని అంచనాకు వచ్చారు. పూర్తిగా తప్పుచేసి వచ్చి, వేరే తప్పుల్ని ఇతరుల పైకి నెట్టే ప్రయత్నాల్ని గమనించారు. దీంతో ఈ ఎపిసోడ్ కు కేంద్రం దూరంగా జరిగింది. దీంతో కేంద్రాన్ని ఈ ఊబిలోకి లాగాలన్న చంద్రబాబు ఎత్తుగడ విఫలం అయింది.

 విద్వేషాలు రగిల్చే ప్రయత్నాలు
 ఇక చంద్రబాబు మార్కు రాజకీయాలకు తెర లేచింది. వెంటనే పచ్చ సైన్యం రంగంలోకి దిగింది. దీన్ని పూర్తిగా ఆంధ్ర, తెలంగాణ గొడవగా మార్చేందుకు కుట్రలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి చేసింది తప్పా కాదా అన్న మాట మాట్లాడటం లేదు. చంద్రబాబు ఆడియో  టేపుల్లో గొంతు ఆయనది అవునా  కాదా అన్నది చెప్పటం లేదు. తప్పు జరిగిందా లేదా అన్నది స్పష్టం చేయటం లేదు. కానీ ఇదంతా తెలంగాణ కుట్ర అంటూ రెండు రాష్ట్రాల ప్రజల మద్య చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో అన్ని రకాల మార్గాల్ని వాడేస్తున్నారు. పనిలో పనిగా మొత్తం ప్రభుత్వ పెద్దల  సంభాషణల్ని రికార్డు చేశారని చెప్పుకొని వస్తున్నారు. హైదరాబాద్ లో ఉండే ఆంధ్రప్రాంత వాసులకు భద్రత కరవైందని వాపోతున్నారు. రాగల రోజుల్లో ఆంధ్రప్రాంత ప్రజలకు కష్టాలు నష్టాలు తప్పవని చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు చేసిన నేరాన్ని ప్రజల మీదకు నెట్టేసి, ప్రజలు విద్వేషాలతో రగిలిపోవాలని ఎత్తుగడ వేస్తున్నారు.

 ముందస్తు బ్లాక్ మెయిలింగ్
 చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల మీద అనేక సార్లు విమర్శలు రేగుతున్నాయి. అధికారుల్ని బెదిరించి దారికి తెచ్చుకొనే అలవాటున్న చంద్రబాబు.. అదే ధోరణిని గవర్నర్ నరసింహన్ మీద ఉపయోగించారు. చంద్రబాబు భజనలో తరించిపోతున్న ఒక పచ్చ పత్రిక కు ఈ పని పురమాయించారు. దీంతో ఆ పత్రిక గ వర్నర్ నరసింహన్ కు వ్యతిరేకంగా కథనాలు తయారుచేసి ప్రచురించటం మొదలెట్టింది. అన్ని రకాల ఆరోపణలు, విమర్శల్ని  గవర్నర్ మీదకు ఎక్కుపెట్టింది. ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి గవర్నర్ ను ఆ పదవిలోంచి తప్పించాలని ఎత్తుగడ వేసింది. పైగా ఆ పదవిలో తనకు సానుకూలమైన వ్యక్తిని తె ప్పించి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టాలని తలంచారు. అందుకే గవర్నర్ నరసింహన్ మీద రాష్ట్రంలోని ఎల్లో మీడియాలో కథనాలు వచ్చేట్లుగా చూసుకొన్నారు.

 ముంచుకొచ్చిన ముప్పు
 ఈలోగా ఓటుకి నోటు కుంభకోణం బట్టబయలు అయింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్ నరసింహన్ ఢిల్లీ కి బయలు దేరారు. ఓటుకి నోటు కేసులో వాస్తవాలు ఎలా ఉన్నాయి, విద్వేషాలు రెచ్చ గొట్టే రీతిలో ఇస్తున్న ప్రకటనలు ...మొదలైన వివరాలతో ఆయన నివేదిక  ఇచ్చినట్లు తెలుస్తోంది. లోకమంతా చంద్రబాబు దోషి అని కోడై కూస్తుండటంతో గవర్నర్ వాస్తవాలతో కూడిన నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. అటు కేంద్రప్రభుత్వం నిఘావర్గాల నుంచి తెప్పించుకొన్న సమాచారం కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. దీంతో గవర్నర్ నివేదికను కేంద్రం పరిగణనలోకి తీసుకొంది. ప్రస్తుత పరిస్థితులో ఓటుకి నోటు కేసులో  కేంద్రం జోక్యం చేసుకోదని కేంద్ర న్యాయశాఖ మంత్రి స్పష్టం చేశారు.

 అత్తమీద కోపం..
 తెలుగు సామెత చెప్పినట్లు కేంద్రం మీద కోపాన్ని చంద్రబాబు..గవర్నర్‌మీద చూపుతున్నారు. రాగల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎవరికీ సానుభూతి దక్కనీయకుండా ప్రయత్నిస్తున్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ఎత్తి చూపటం, దాని మీద పోరాడటాన్ని అంతా సమర్థిస్తారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిబంధనలకు వ్యతిరేకంగా ప్రారంభిస్తే వెంటనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అభ్యంతరం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని మంత్రి ఉమాభారతి కి లేఖ రాశారు. కుంభకోణం నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించటం, రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగల్చటం మీద దృష్టి పెట్టిన చంద్రబాబు మాత్రం ఈ విషయాన్ని గాలికి వదిలేశారు. ప్రజల తరపున, ప్రజలకు కావాల్సిన అంశాల్ని పట్టించుకోవటం మానేసి తన స్వార్థం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, పనిలో పనిగా గవర్నర్‌ను విమర్శల పాలు చేయటం చేస్తున్నారు. కొంతకాలం పాటు ఉమ్మడి గవర్నర్ పాలన తప్పనిసరి అయినప్పుడు వ్యక్తి గత స్వార్థం కోసం గవర్నర్ ను ఆంధ్రులు వ్యతిరేకిగా చిత్రించే పనులు మొదలు పెట్టారు.

 నాకూ పోలీస్ ఉంది..!
 ఇక్కడ చంద్రబాబు ఉపయోగించే భాష ను అందరూ గుర్తు పడుతున్నారు. పత్రికా విలేకరులు ప్రశ్నలు అడిగినప్పుడు ‘నాకూ ఏసీబీ ఉంది..నాకూ పోలీస్ ఉంది’ అంటూ కస్సుమన్నారు. ఇక్కడ చంద్రబాబు మార్కు పాలన ఎలా ఉంటుందో ఆయన నోటి వెంటే బయట పడింది. అవసరం అయితే ఏసీబీని కానీ, పోలీసుల్ని కానీ మరో వ్యవస్థ ను కానీ ... తన స్వార్థం కోసం వాడుకొంటానని బహిరంగంగా చెప్పుకొన్నారు. ఇప్పటికే రాష్ట్ర పోలీసులు.. తెలుగుదేశం కార్యకర్తల్ని తలపిస్తున్నారు. అనేక చోట్ల ప్రతిపక్షాల మీద దౌర్జన్యాలకు దిగటం, పచ్చ చొక్కా శ్రేణుల్ని వెనకేసుకొని రావటం జరుగుతోంది. అనంతపురం వంటి జిల్లాల్లో పచ్చ చొక్కాలతో కలిసిపోయి వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని హతమార్చే పనిలో పోలీసుల ప్రమేయంపై వార్తలు వస్తున్నాయి. వీటిని నిర్ధారణ చేస్తున్నట్లుగా చంద్రబాబు మాట్లాడటాన్ని అంతా గుర్తు చేసుకొంటున్నారు.

 గొడవలు రేపటమే లక్ష్యమా..!
  ఈ ప్రకటనల్ని బట్టి రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని చంద్రబాబు తన గుప్పిట్లోకి తీసుకొన్నారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ప్రతీ రోజూ చంద్రబాబు .. పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సహజంగా ఒక శాఖకు చెందిన అధికారులతో సమావేశం అంటే ఆ శాఖ మంత్రిని పిలవటం ఆనవాయితీ. ఇక్కడ మాత్రం రాష్ట్రం హోమ్ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ను ఆయన జిల్లాకు పరిమితం చేసి, చంద్రబాబు పోలీసు అధికారులతో తరచు మీటింగ్ లు పెడుతున్నారు. దీన్ని బట్టి రెండు రాష్ట్రాల్లోనూ విద్వేషాలు రగులుకొనే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. 

No comments:

Post a Comment