17 June 2015

బాబు తప్పుకొంటే మేలు..!

ఓటుకి కోట్లు కుంభకోణంలో సూత్రధారిగా నిలిచిన చంద్రబాబు
 హైదరాబాద్: ఓటుకి కోట్లు కుంభకోణంలో సూత్ర ధారిగా నిలిచిన చంద్రబాబు ఎత్తుగడలు అంతకంతకూ మారుతున్నాయి. కేసుని పక్కదారి పట్టించి ఎలాగైనా ఈ గండం నుంచి బయట పడాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు రగిల్చి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విద్వేషాగ్నిలో ప్రజలు నష్టపోయినా ఫర్వాలేదు కానీ, తాను మాత్రం లబ్ది పొందాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. చివరకు రాజ్యాంగ వ్యవస్థల్ని కూడా తూలనాడుతుండటాన్ని ప్రజాస్వామిక వాదులు తప్పు పడుతున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తప్పు ఒప్పుకొని పదవి నుంచి తప్పుకొంటే మంచిదని, న్యాయ వ్యవస్థ ను గౌరవించాలని సూచిస్తున్నారు. మరి, ఈ మంచి మాటలు చంద్రబాబు చెవికి ఎక్కుతాయా..!
 తప్పు చంద్రబాబుది..!
 ఈ కుట్ర అంతా చంద్రబాబు చుట్టూ తిరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేని విషయం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక, తెలంగాణలో ఒక ఎమ్మెల్యేని తన పార్టీ ఎమ్మెల్యే చేత కొనిపిస్తూ ఆయన దొరికిపోయాడు. కేసు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి చెందినది. అటువంటప్పుడు ఆ కేసును వ్యక్తిగతంగా కానీ, పార్టీ అధ్యక్షుని హోదాలో కానీ ఎదుర్కోవాలి. కానీ దీన్ని పూర్తిగా ఆంద్రప్రదేశ్ ్రపభుత్వ వ్యవహారంగా, ఇంకా చెప్పాలంటే యావత్ ఆంధ్రుల పరువు ప్రతిష్టలకు సంబంధించిన అంశంగా మార్చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు వీలుగా మంత్రులతో రెచ్చగొట్టే ప్రకటనలు చేయించటం, పచ్చ మీడియాలో రాయించటం చేస్తున్నారు.
 రాజ్యాంగ వ్యవస్థల మీద బురద జల్లుడు..!
 రాజ్యాంగం ఏర్పాటు చేసిన వ్యవస్థల మీద అదేపనిగా బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓటుకి నోటు కుంభ కోణంలో పూర్తిగా ఇరుక్కొని పోయిన చంద్రబాబు నాయుడు.. ఈ విషయం లో కేంద్రం తనకు సహకరిస్తుందని, కేంద్రం సాయంతో దీని నుంచి బయట పడవచ్చని భావించారు. కానీ అటు నుంచి ఏ సాయం రాకపోవటంతో గవర్నర్ నరసింహన్ ను భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నించారు. ఆ ఆటలు కూడా సాగక పోవటంతో వెంటనే పచ్చ దండును ఉసికొల్పారు. మంత్రులు, ఇతర నాయకులతో గవర్నర్ ను తిట్టించే వ్యూహం ప్రారంభించారు. ఒక వేళ కేసులు కానీ ముందుకు వచ్చినట్లయితే గవర్నర్ ను, ప్రతిపక్షాల్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకే గాటన కట్టి విద్వేషాలు రగిల్చేందుకు కుట్రకు శ్రీకారం చుట్టారు.
 ఉన్నతాధికారుల్ని చెప్పు చేతల్లోకి తీసుకొనే యత్నం..!
 భయపెట్టడం, బెదిరించటం చంద్రబాబుకు బాగా అలవాటైన విద్య. అదే విద్యను ఇక్కడ ఉపయోగించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల స్థానాల్లో మార్పులు చేస్తామంటూ ముందస్తుగా ఎల్లో మీడియాలో వార్తలు రాయించారు. తర్వాత వారిని పిలిపించుకొని తన వ్యక్తిగత విషయం లేదా పార్టీ కి సంబంధించిన విషయాన్ని ప్రభుత్వ అంశంగా మార్చేసే కుట్రను అమలు చేశారు. ఇది ఎంతవరకు వెళ్లిందంటే సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు సైతం ఈ ఉచ్చు లో పడిపోయారు. దీంతో దీన్ని  రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు సంబంధించిన అంశంగా మార్చేసే కుట్ర ను అమలు చేశారు.
 రాజ్యాంగ వ్యవస్థలపై కుట్రా..!
 ఒక వైపు గవర్నర్‌వ్యవస్థను అప్రతిష్ట పాలు చేయటం, ఇటు ఉన్నతాధికారుల్ని చెప్పు చేతల్లోకి తీసుకొని ఆడించటం వంటి చర్యలు కలకలం రేపుతున్నాయి. ఈ విధంగా ఒక కేసులో ప్రధాన సూత్రధారిగా నిలిచిన వ్యక్తి, పోలీసు ఉన్నతాధికారుల్ని పిలిపించుకొని కేసు నుంచి బయట పడే మార్గాల్ని అన్వేషించటాన్ని ప్రజాస్వామిక వాదులు తప్పు పడుతున్నారు. పనిలో పనిగా ఎదుటి ముఖ్యమంత్రి, లేక ప్రతిపక్ష పార్టీల నేతల మీద కేసుల్ని తిరగదోడిస్తున్నట్లుగా బహిరంగంగా మంత్రులే చెప్పడాన్ని ఉదహరిస్తున్నారు. అంటే కేసుల దర్యాప్తు చట్ట  పరిధిలో జరగదని, వ్యక్తిగత కక్షల నేపథ్యంలో సాగుతుందని చెప్పక నే చెప్పినట్లయింది. నాకు పోలీసు ఉంది, నాకు ఏసీబీ ఉంది అని పదే పదే చంద్రబాబు చెప్పడాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు.
 హితోక్తులు వింటారా..!
 రాజ్యాంగ వ్యవస్థల్ని ఇంత బహిరంగంగా అపహాస్యం చేసిన చంద్రబాబు ఇప్పటికైనా తప్పుల్ని ఒప్పుకోవాలని ప్రజాస్వామ్య వాదులు సూచిస్తున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని గౌరవించి పదవిలోంచి తప్పుకోవటం మేలని చెబుతున్నారు. పదవిని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ వ్యవస్థల్ని చేతుల్లోకి తీసుకొని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య అఘాతం సృష్టించటం తగదని సూచిస్తున్నారు. మరి, ఈ హితోక్తులు చంద్రబాబు చెవికి ఎక్కుతాయా..!

No comments:

Post a Comment