23 January 2016

చంద్రబాబు పోలీసు రాజ్యం..!


ఏలూరు: చంద్రబాబు మార్కు పోలీసు రాజ్యం అన్ని చోట్ల ఆవిష్క్రతం అవుతోంది. న్యాయం అడిగితే చాలు లాఠీల చేత కొట్టించటం చంద్రబాబుకే సాధ్యం. గత తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు ఈ సూత్రాన్ని బాగా రుజువు చేశారు. ఈ సారి కూడా అదే ఫార్ములా అమలు చేస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో తెలుగుదేశం నాయకులు ఆక్వా మెగా పార్క్ కట్టాలని సంకల్పించారు. కోట్ల రూపాయిల వ్యాపారం కావటంతో చంద్రబాబు ఆగమేఘాల మీద అనుమతులు మంజూరు చేశారు. ఇది పూర్తయితే దాదాపు పదుల సంఖ్యలో గ్రామాల్లో పొలాలు చౌడు బారిపోతాయి. అంటే చుట్టుపక్కల ఎక్కడా పొలాల్లో పంట పండే పరిస్థితి ఉండదని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటు తాగు నీరు రసాయనికంగా మారిపోయే అవకాశం ఉంది. దీనిపై ప్రజా సంఘాల చైతన్యంతో ప్రజలు మేల్కొన్నారు. ఈ పార్క్ వద్దంటే వద్దని వినతి పత్రాలు సమర్పించారు. అయినా కోట్ల రూపాయిల మీద మనస్సు పారేసుకొన్న తెలుగుదేశం ప్రభుత్వం.. దీన్ని కట్టి తీరాలని నిర్ణయించుకొంది.

దఫదఫాలుగా వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు తాజాగా ఆక్వా మెగా పార్క్ దగ్గరకు చేరుకొన్నారు. ముందుగానే మేలుకొన్న తెలుగుదేశం నాయకుడు అక్కడకు పోలీసుల్ని ఉసి కొల్పారు. పెద్ద సంఖ్యలో పోలీసు బలగాల్ని రంగంలోకి దింపారు. ఇదే జిల్లాలో కోడి పందాలు పెద్ద ఎత్తున జరిగితే పోలీసులు కనిపించనే లేదు. ఇదే జిల్లాకు ఆనుకొని మహిళా తహశీల్దార్ వనజాక్షిని ఇసుకలో దొర్లించి కొట్టిస్తే అడ్డుకొనే ప్రయత్నం కూడా అక్కడ ఉన్న పోలీసులు చేయలేదు. ఇదే జిల్లాలో ఇసుకను విపరీతంగా తవ్వేస్తున్నారని స్థానిక ఎంపీ సహా అనేకమంది చెబుతున్నా అటుకేసి చూడలేదు.

కానీ, గ్రామస్తులు ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలపడానికి వస్తే మాత్రం పోలీసులు రెచ్చిపోయారు. లాఠీ చార్జీకి దిగి... గ్రామస్తులపై విచక్షణ రహితంగా కొట్టారు. బండ బూతులకు తిడుతూ.. గ్రామస్తుల్ని తరిమి తరిమి కొట్టారు. ఈ ఘటనలో గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. బ్రిటీష్ పాలకుల్ని తలపిస్తున్నట్లుగా దాడి చేశారని గ్రామస్తులు వాపోయారు. నమ్మి ఓట్లేసి గెలిపిస్తే తమకు జరిగిన ఫలితం ఇదని ఆవేదన చెందుతున్నారు.

No comments:

Post a Comment