20 January 2016

వీసీ, మంత్రుల మీద చర్యలు తీసుకోవాల్సిందే..!

హైదరాబాద్: దళిత పరిశోధక విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటన కు కారణభూతులుగా నిలుస్తున్న వీసీ, కేంద్రమంత్రులపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలతో మానవత్వం మాయం అవుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని ఆయన అన్నారు. విద్యార్థులకు మద్దతుగా వైఎస్సార్సీపీ నిలుస్తుందని, పార్లమెంటులో సైతం తాము పోరాడతామని ఆయన అన్నారు.




హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ లో దీక్షలు చేస్తున్న విద్యార్థులను వైఎస్ జగన్ కలిశారు. ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేస్తున్న విద్యార్థుల పోరాటానికి ఆయన సంఘీభావం తెలిపారు. ఆత్మహత్య చేసుకొన్న రోహిత్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఒక అత్యున్నత ప్రమాణాలు కలిగిన విద్యా సంస్థ అని వైఎస్ జగన్ అభివర్ణించారు. 3,4 వేల మంది ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల్ని అందించిన యూనివర్శిటీ ఇది అని ఆయన అన్నారు. అత్యున్నత చదువులు చదువుకోవాలని ఆకాంక్షించే వారికి ఇది స్ఫూర్తి దాయక విద్యాకేంద్రం అని వైఎస్ జగన్ అన్నారు. ఇటువంటి చోట తమ కుమారుడ్ని చదివించుకొనేందుకు రోహిత్ తల్లి ఎంతోకష్టపడిందని ఆయన గుర్తు చేసుకొన్నారు. ముందు రోజు ఆ కుటుంబాన్ని కలిసినప్పుడు రోజుకి రూ. 100 లేదా రూ. 150 కష్టం చేసుకొని కుటుంబాన్ని పోషించుకొంటున్న పరిస్థితిని గమనించినట్లు వైఎస్ జగన్ వివరించారు. ఏదో ఒక రోజు తమ కుమారుడు ఐఎఎస్ లేదా ఐపీఎస్ అధికారి అవుతాడని అభిలషించారని, అది పూర్తిగా చెదిరిపోయిందని వైఎస్ జగన్ అన్నారు.
         హెచ్‑సీయూ పీహెచ్‑డీ విద్యార్థి రోహిత్‑‑‑పై చర్యలు తీసుకోవాలని లేఖలు రాసిన కేంద్ర మంత్రులతో పాటు వీసీపై చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులపై చర్య తీసుకోవాలని ఓ కేంద్ర మంత్రి మరో కేంద్ర మంత్రికి లేఖ రాశారని, కేంద్ర మంత్రి లేఖ రాయడం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం లాంటిదని విమర్శించారు.


        కేంద్రం నుంచి లేఖలు వస్తుండటంతో వైఎస్ ఛాన్సలర్ విద్యార్థుల మీదకు అస్త్రాల్ని ప్రయోగించారని వైఎస్ జగన్ అన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి విద్యార్థుల మీద చర్యలు కోరుతూ 4-5 లేఖలు వచ్చాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. ఆయనేమీ జాతి వ్యతిరేక శక్తో, సంఘ వ్యతిరేక శక్తో కానే కాదు కదా అని ఆయన అన్నారు. ఇక్కడ ఉన్న విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉంటుందని, ఐఎఎస్ లేదా ఐపీఎస్ అధికారులు కావాల్సిన పరిస్థితి అని వైఎస్ జగన్ అన్నారు. కానీ, ఇటువంటి చోట రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.  

  ఈ సందర్భంగా ఘటన మీద విచారణ జరిపించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ గురించి వైఎస్ జగన్ ప్రస్తావించారు. ప్రొఫెసర్ శ్రీ వాత్సవ, ప్రొఫెసర్ మహంతి మరియు వైస్ ఛాన్సలర్ లతో కూడిన కమిటీ పనిచేస్తోందని, కానీ ఈ కమిటీ గురించి విద్యార్థుల చెబుతుంటే ఘోరమైన వాస్తవాలు బయట పడ్డాయని ఆయన అన్నారు. ఈ అధికారులు అందరికీ విద్యార్థుల్ని వేధించిన ఘన చరిత్ర ఉందని వైఎస్ జగన్ అన్నారు.

        చనిపోయిన విద్యార్థి గురించి కొన్ని పత్రికల్లో, కొన్ని మాద్యమాల్లో ప్రచారం జరుగుతోందని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇప్పటికే రోహిత్ చనిపోయారని, అటువంటప్పుడు ఆయన ఎస్సీ అని, ఎస్సీ కాదని, బీసీ అని రక రకాలుగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారు అందించే మీ సేవ నుంచి తీసుకొన్న కుల ధ్రువీకరణ పత్రం తమ దగ్గర ఉందని, ఇందులో ఎస్సీ అని స్పష్టంగా ఉందని వైఎస్ జగన్ అన్నారు. తర్వాత కాలంలో ఈ రికార్డుల్ని మార్చి బీసీ విద్యార్థి అని ప్రచారం చేస్తారా అని అనుమానం వ్యక్తం చేశారు.

        ఈ సందర్బంగా విద్యార్థి రోహిత్ రాసిన ఆత్మహత్య వాంగ్మూలాన్ని ప్రస్తావించారు. మనిషిని కులంతోనే అంచనా వేస్తున్నారని, మనస్సు ఉంటుందని గుర్తించటం లేదని వాపోయారు. ఎటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం అని ఆయన ఆవేదన చెందరు. సామాజిక బహిష్కరణ అన్నది ఏ కోణంలో చూసినా సరి కాదని వైఎస్ జగన్ అన్నారు.

మొత్తం ఘటన్ని మార్చే ప్రయత్నం చేయకుండా చూడాలని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావ్రతం కాకుండా స్పష్టమైన చర్యలు చేపట్టాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ఇందులో పాత్ర పోషించిన వారందరి మీద చర్యలు తీసుకోవాలని కోరారు. వైస్ చాన్సలర్ పేరు గట్టిగా వినిపిస్తున్నందున ఆయన మీద చర్యలు తీసుకోవాలని వైఎస్ జగన్ గట్టిగా డిమాండ్ చేశారు. లైబ్రరీ, క్యాంటీన్ వంటివి వాడుకోకుండా సామాజిక బహిష్కరణ చేశారని, ఏ రకంగా చూసినా సామాజిక బహిష్కరణ సరి కాదని వైఎస్ జగన్ అబిప్రాయ పడ్డారు. ఇప్పటికైనా సస్సెండ్ చేసిన విద్యార్థుల మీద సస్పెన్షన్ ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోజుకి రూ. 100 లేక 150 తో బతుకు సాగిస్తున్న రోహిత్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు జరుపుతున్న పోరాటానికి తమ మద్దతు ఉంటుందని వైఎస్ జగన్ అన్నారు. పార్లమెంటు లో తమకు ఏడుగురు ఎంపీలు ఉన్నారని, విద్యార్థుల తరపున ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించి పోరాడతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన, గడికోట శ్రీకాంత్ రెడ్డి, నాయకులు మెరుగు నాగార్జున, నల్లా సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment