22 December 2017

సీమ నీటికోసం వైఎస్సార్ కాంగ్రెస్ పోరాటం

రాయలసీమ రైతుల కన్నీటి చుక్కలు బీడు నేలల్లో ఇంకి పోతున్నాయి. కరువు సీమగా పేరు పడ్డ రాయల సీమకు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అన్యాయం రైతులు ఎప్పటికీ మర్చిపోలేరు. పట్టిసీమతో రాయలసీమ రైతులకు నీరిచ్చామని, రెయిన్ గన్ లతో పంటలు పండించామని పచ్చి అబద్ధాలు చెబుతున్న దగాకోరు బాబు బండారాన్ని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ప్రజా క్షేత్రంలోనే ఎండగడుతున్నారు. 
గొంతు తడుపుకోను చుక్కనీరు లేక రాయలసీమ నేల కన్నీరు పెట్టుకుంటోంది. చివరకు పశువులు కూడా మేత కరువవడంతో కబేళాకు తరలిపోతున్నాయి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన చిత్తూరు జిల్లాలో కరువు కోరలు చాచింది. మదన పల్లె, తంబళ్ళ పల్లి, బి.కొత్తకోట, వి.కోట, ములకల చెరువు వంటి చోట్లైతే పొలాలు ఎండి పోయి బీళ్లువారాయి. నీటి కోసం వందల అడుగులకు పైగా బోర్లు వేసినా పాతాళ గంగ పలకరించలేదు. తీవ్ర వర్షాభావంతో బావులు, బోర్లు ఎండిపోయాయి. పంట కుంటలు, రెయిన్ గన్ లు అంటూ ప్రచారాలు చేసి, హడావిడి చేసిన సిఎమ్ చంద్రబాబు ప్రభుత్వం ఒక్క ఎకరా పంటని కూడా నీటితో తడపలేకపోయింది. అరకొరగా పండిన పంటలకు గిట్టు బాటు ధర రాక రైతులు చంద్రబాబును మార్కెట్ యార్డుల్లోనే శాపనార్థాలు పెట్టారు. కేంద్రం నుంచి కరువు బృందాలు వచ్చి పర్యటించి వెళ్లడమే కానీ ప్రయోజనమే ఉండటం లేదని అన్నదాతలు ఆక్రోశిస్తున్నారు. పదే పదే హంద్రీనీవా, గాలేరు నగరి పేర్లు ప్రస్తావించడమే కానీ, ఆ ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయడమే లేదు. ఇవి పూర్తయ్యి రాయలసీమ పంటలతో కళకళ లాడుతుందని ఆశపడుతున్న రైతులకు నిరాశే ఎదురౌతోంది. తీవ్ర దుర్భిక్షంతో అల్లాడుతున్న సీమకు నీళ్లు కావాలంటూ ప్రజల తరఫునా, రైతుల తరఫునా నిరంతరంగా పోరాడుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. 
పెండిగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలని, సీమ నాలుగు జిల్లాల్లోనూ పశుగ్రాసం ప్రభుత్వమే అందించాలనీ, దానితోపాటే ఉపాధిహామీ బకాయిలను వెంటనే మంజూరు చేయాలనీ డిమాండ్ చేస్తూ రాయలసీమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉద్యమాలు చేస్తున్నారు. సీమను దగా చేసిన చంద్రబాబు తన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిరంతరం ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, ఎమ్ పి అవినాష్ రెడ్డి రాయలసీమ నీటి కేటాయింపుల కోసం ఆందోళనలు చేసారు. నగరి ఎమ్మెల్యేరోజా సీమకు నీరు ఇవ్వాలని కోరుతూ తిరుపతి వరకూ పాదయాత్ర చేసారు. 
ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు రాయలసీమ వెనుకబడిన ప్రాంతమని, ఆ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని నమ్మబలికాడు చంద్రబాబు. కాని గత నాలుగేళ్లుగా రాయలసీమ ప్రాంతానికి పెట్టాల్సిన ఖర్చును తగ్గించి, ఒకే ప్రాంత అభివృద్ధికి ఆ నిధులను మళ్లిస్తున్నాడు. రాయలసీమకు 300టిఎమ్ సిల నీళ్లు అవసరం అవుతాయని గతంలో నీటిపారుదల శాఖ నిపుణులు చెప్పారు. నేటికీ సీమలో 15% భూమికి మాత్రమే నీటిలభ్యత ఉంది. రాయల సీమ మొత్తంలో ఉన్న సాగు భూమి కోటీ 68లక్షల 50వేల ఎకరాలు. ఇందులో కేవలం 70లక్షల ఎకరాలు మాత్రమే సాగౌతోంది. సీమకు 122టి.ఎమ్.సిల నికర జలాలతో 10లక్షల ఎకరాల ఆయకట్టుకు నదుల నుంచి నీటి కేటాయింపులు ఉన్నాయి. సహజ వనరులైన చెరువులు, కాల్వలు, వాగులు, బావుల నుంచి 20% సాగు అవుతుంది. నాలుగు కరువు జిల్లాల్లోనూ చెరువులు కుంటల ద్వారా సాగు అవుతున్న భూములే అధికం. సాగు నీరు అందక లక్షల ఎకరాలు సాగుకు నోచుకోవడం లేదు. అందుకే రాయలసీమను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టులను త్వరితంగా పూర్తి చేయాల్సి ఉంది. 
వరస కరువుతో రాయలసీమ రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారౌతోంది. చెరువులు, బోరు బావులూ ఎండిపోయాయి. కానీ చంద్రబాబు మాత్రం నన్ను చూసి కరువు భయపడుతుందంటూ ఉపన్యాసాలు దంచుతున్నాడు. కరువు కోరల్లో చిక్కి, ఉపాధి పనులు లేక వలస పోతున్న వారిని చూసి అధిక ఆదాయం కోసం వెళ్తున్నారంటూ విమర్శించే చంద్రబాబు లాంటి మానతవత్వం లేని నాయకుణ్ణి ఎక్కడా చూడం. ఉపాధి కూలీలకు అధిక పనిదినాలు కల్పించి, వేతనాలు సకాలంలో ఇచ్చి వలసలను ఆపాలని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి పెద్ద ఎత్తున బంద్ లు, ధర్నాలు నిర్శహించింది. చంద్రబాబు యథాప్రకారం అరెస్టులు, లాఠీ ఛార్జీలతో ఉద్యమంపై విరుచుకుపడిందే కానీ, కరువు నివారణకు ఏ చర్యలూ తీసుకున్నదే లేదు. రాయలసీమకు నీటిని, యువతకు భవితను లేకుండా చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి సీమ ప్రజలు సమాధానం చెప్పేందుకు సిద్ధమౌతున్నారు.

No comments:

Post a Comment