27 December 2017

రాష్ట్రపతి గారు..టీడీపీ ప్రభుత్వ అరాచకాలు మీ దృష్టికి వచ్చాయా


– టీడీపీ పాలనలో దళితులను కొడుతున్నారు.
– దళితులను అడుగడుగునా కించపరుస్తున్నారు

విజయవాడ: రాష్ట్రపతి గారూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం దళితులపై చేస్తున్న అరాచకాలు, అక్రమాలు మీ దృష్టికి వచ్చాయా అని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు కొలుసు పార్థసారధి అన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మన రాష్ట్రానికి రావడం సంతోషంగా ఉందని, ఓ దళిత వ్యక్తి రాష్ట్రపతిలాంటి మహోన్నత పదవిలోకి రావడం మాకు చాలా గర్వకారణంగా ఉందని ఆయన తెలిపారు. బుధవారం పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు మేరుగ నాగార్జునతో కలిసి పార్థసారధి మీడియాతో మాట్లాడారు. ఏపీలో  ఫిరాయింపులను టీడీపీ ప్రోత్సహిస్తుందని రాష్ట్రపతి గారు గమనించారా అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ముఖ్యమంత్రే వేరే పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ కండువాలు కప్పి తన పార్టీలోకి చేర్చుకుంటున్నారు..ఈ తీరును గమనించారా రాష్ట్రపతి గారు అని ప్రశ్నిస్తున్నామన్నారు. అధికారులపై దౌర్జన్యం, లా అండ్‌ ఆర్డర్‌ను కాపాడాల్సిన ప్రభుత్వం ఏవిధంగా ప్రజల ఆస్తులను దోచుకుంటుంది. ఏవిధంగా అధికారులపై దౌర్జన్యం చేస్తున్నది మీరు ఒక్కసారి గమనించాలని రాష్ట్రపతిని వేడుకుంటున్నామన్నారు.  టీడీపీ ఎమ్మెల్యే దోపిడీని అడ్డుకున్న మహిళా తహశీల్దార్‌ను నడిరోడ్డుపై జుట్టుపట్టుకుని ఈడ్చిన విషయం మీ దృష్టికి వచ్చిందా అని అడుగుతున్నామన్నారు. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిపై టీడీపీ నేతలు దౌర్జన్యం చేసింది మీరు తెలుసుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఏవిధంగా కాలరాస్తుందో తెలుస్తుందన్నారు. ముఖ్యమంత్రి నుంచి కిందిస్థాయి నాయకుల వరకు ఏవిధంగా అవినీతికి పాల్పడుతున్నారో తెలుసుకోవాలని విన్నవిస్తున్నామన్నారు. దళితులపై ఏవి«ధంగా దాడులు చేస్తున్నారో తెలుసుకోవాలని కోరుతున్నామన్నారు. ఎవరైనా దళితులుగా పుట్టాలనుకుంటారా అని సీఎం అన్న విషయాన్ని తెలుసుకోవాలని వేడుకున్నారు. దళితులకు ఇచ్చిన భూములు ఎలా లాక్కుంటున్నారో తెలుసుకోవాలని వేడుకుంటున్నామన్నారు. దళితులు కూడా సమాజంలో గౌరవ స్థానంలోకి రావాలని గత ప్రభుత్వాలు భూములు ఇస్తే..ఆ భూములను లాక్కొన్ని వాటిని పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు కట్టబెడుతోందో గమనించాలన్నారు. దళితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం అడుగడుగునా కించపరుస్తుందన్నారు. దిగజారిన ఈ ప్రభుత్వ విధానాలను గమనించాలని రాష్ట్రపతిని వేడుకున్నారు. స్థానిక సంస్థలను ఏవిధంగా అణగద్రోక్కుతుందో మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఈ రోజు సర్పంచ్, ఎమ్మెల్యే, కలెక్టర్, ఎంఆర్‌వోలు ప్రజలకు సంక్షేమ పథకాలను చేర్చలేని నిస్సాహయ స్థితిలో ఉన్నారని, ఈ విధానాలను గమనించాలని కోరారు. ప్రజలకు ఏ ఒక్క సంక్షేమ పథకం కావాలన్నా టీడీపీ కార్యకర్తల వద్దకు వెళ్లి అడుక్కోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ రాష్ట్ర అసెంబ్లీలో పాస్‌ చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులను ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నారో గమనించాలన్నారు. ఈ నిధులను అక్రమ మార్గంలో ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నారో తెలుసుకోవాలన్నారు. కూలీలు వలసలు వెళ్లకూడదన్న గొప్ప ఆలోచనతో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకాన్ని తీసుకొని వస్తే..ఆ ఫలాలు కూలీలకు అందకుండా తూట్లు పొడుస్తున్నారని తెలిపారు. నెలల తరబడి కూలీలకు డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉందన్నారు. బంగారు తల్లి అనే పథకాన్ని ప్రవేశపెట్టిన ఈ ప్రభుత్వం ఒక్క మహిళకు కూడా సాయం చేయలేదన్నారు. ఎలక్షన్‌ కమిషన్‌కు రాతపూర్వకంగా హామీ ఇచ్చిన ఒక్క వాగ్ధానం కూడా నెరవేర్చలేదన్నారు.

1 comment: