12 July 2016

గడపగడపలో ఒకే నినాదం,.వైయస్సార్ కాంగ్రెస్

ప్రజల నుంచి విశేష స్పందన..టీడీపీ వంచనపై మండిపాటు
బాబు మోసాలను ఇంటింటా వివరిస్తున్న వైయస్సార్సీపీ
హామీల అమలుపై వందప్రశ్నలతో కరపత్రాల పంపిణీ
ప్రతీ గడపలో బాబు పాలనకు జీరో మార్కులు

ఆంధ్రప్రదేశ్ః రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ శ్రేణులు గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని ప్రజల వద్దకు దిగ్విజయంగా తీసుకెళ్తున్నారు. వైయస్సార్ జయంతిని పురస్కరించుకొని వైయస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈకార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. రెండేళ్లలో బాబు చేసిన అవినీతి, మోసాలను వైయస్సార్సీపీ ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరిస్తున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి వంద ప్రశ్నలతో కూడిన ప్రజాబ్యాలెట్ ను వారికి అందించి సమాధానాలు రాబడుతున్నారు.  ప్రతీ గడపకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వంద ప్రశ్నల్లో బాబుకు ఒక్క మార్కు కూడా పడడం లేదు.  

పచ్చమీడియాలో గొప్పలు చెప్పుకుంటున్నారు
వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
చిత్తూరుః వైయస్సార్సీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా నియోజకవర్గంలో గడపగడపలో పర్యటిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి బాబు వైఫల్యాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఈరెండేళ్లలో ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా అన్నీ చేశానంటూ చంద్రబాబు పచ్చమీడియాలో తప్పుడు ప్రచారం చేసుకుంటున్నాడని రోజా ధ్వజమెత్తారు. టీడీపీ పాలనలో  ఏ ఒక్క కుటుంబం కూడా తృప్తిగా లేదని రోజా చెప్పారు. అధికారం కోసం నీచంగా ఫ్రీ ఫ్రీ అని నోటికి అడ్డూ అదుపులేకుండా వాగ్ధానాలిచ్చి ...అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేమని చేతులెత్తేయడం సిగ్గుచేటని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.  డ్రైనేజీలు , రోడ్లు, కనీసం కరెంట్ పోల్స్ కు బల్బు కూడా వేయలేని పరిస్థితిలో  ప్రభుత్వం ఉండడం దురదృష్టకరమన్నారు. డ్వాక్రా మహిళలు రుణమాఫీ జరుగుతుందని ఆశపడి ప్రభుత్వాన్ని తీసుకొస్తే ....బాబు వారిని అప్పుల ఊబిలోకి నెట్టాడని రోజా ఫైర్ అయ్యారు. మహిళలు, రైతులు, పిల్లలు ఇలా అందరినీ మోసం చేసిన బాబుకు తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. దాని ఊసేలేదని  రోజా దుయ్యబట్టారు.  ఒక్క ఇళ్లు కట్టించకపోగా కనీసం గతంలో పునాది వేసి ఆగిపోయిన ఇళ్లకు పైసా కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఇళ్లు లేక అనేక కాలనీల ప్రజలు చెట్లకింద కాపురం చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  

టీడీపీ ప్రజావ్యతిరేక ప్రభుత్వం
వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు
శ్రీకాకుళం జిల్లా బలగ ప్రాంతంలో వైయస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు, జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, ఇతర నాయకులు గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ నినాదంతో ఇంటింటికీ వెళ్తున్నారు. కరపత్రాలను ప్రజలకు పంచుతున్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం చేసిన వాగ్ధానాలను వివరించి వాటిని  ఏమేరకు అమలు చేశారో ప్రజల నుంచి సమాధానాలు రాబడుతున్నారు. ఈసందర్భంగా ధర్మాన మాట్లాడుతూ... బాబు పాలన పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పారు. రాజధాని ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఇళ్లు కట్టిస్తామని చెప్పారు.  ఇంతవరకు దాన్ని అమలు చేసిన దిక్కులేదు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ ఎక్కడా అమలు కావడం లేదు. నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రజల సంక్షేమాన్ని టీడీపీ పూర్తిగా విస్మరించిందని ధర్మాన ఫైర్ అయ్యారు. బాబు మోసాలను, అవినీతిని గడపగడపలో ఎండగడుతున్నామన్నారు. రెడ్డి శాంతి మాట్లాడుతూ...ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి  మంచి స్పందన వస్తోందని తెలిపారు. ప్రజలు బాబు పాలనపై  రెండేళ్లుగా విసిగిపోయి ఉన్నారని తెలిపారు.  ప్రతి గడపలో ఒకే మాట ఒకే నినాదం వినిపిస్తోందన్నారు.  టీడీపీ ప్రజల ప్రభుత్వం కాదని చెబుతున్నారని పేర్కొన్నారు. వైయస్సార్ పాలన రావాలి. మళ్లీ ఆయన సంక్షేమ పథకాలు అందాలని  ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ప్రజల మనోభావాలు తెలుసుకొని వారి తరపున వైయస్సార్సీపీ పోరాడుతుందని శాంతి తేల్చిచెప్పారు. 

ప్రజలను వంచిస్తోన్న చంద్రబాబు
వైయస్సార్సీపీ తూ.గో. జిల్లా అధ్యక్షుడు
తూర్పుగోదావరి జిల్లా నేమాం గ్రామంలో జిల్లా అధ్యక్షుడు కన్నబాబు గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ నినాదంతో ప్రతి గడపలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఇంటింటికీ తీసుకెల్లి వివరిస్తున్నారు. అధికారం కోసం అనేక హామీలిచ్చి...గద్దెనెక్కాక ప్రజలతో పనిలేదన్నట్లు బాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, కార్మికులు ఇలా అందరికనీ బాబు మోసం చేశాడన్నారు.  ప్రతి గడపకు వెళ్లి ప్రజలకు భరోసా కల్పిస్తున్నామని కన్నబాబు తెలిపారు.  టీడీపీ అన్ని విధాలుగా ప్రజలను వంచిస్తోందన్నారు.  సామాన్యుడు బతకడమే కష్టమైపోయిందన్నారు. ఇసుక, మట్టి, బూడిద ఏదీ వదలకుండా టీడీపీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని ప్రజలు తమ దృష్టికి తీసుకొస్తున్నారన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తామన్నారు. వాటిని టీడీపీ నెరవేర్చలేకపోతే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని పరిష్కరిస్తుందన్న భరోసాని ప్రజలకు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కన్నబాబు పిలుపునిచ్చారు.  

No comments:

Post a Comment