1 July 2016

రుణ మాఫీ లో కొత్త గేమ్

హైదరాబాద్ : రైతుల్ని మోసం చేసేందుకు చంద్రబాబు కొత్త కొత్త విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. రైతుల్ని ముంచేందుకు మరో జిమ్మిక్కును ఉఫయోగిస్తున్నారు. ఈ నెల 22న ఒంగోలు లో చంద్రబాబు రెండో విడత రుణమాఫీ ధ్రువీకరణ పత్రాల్ని పంచిపెట్టారు. దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ రూ. 2,360 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఉత్తర్వులు విడుదల చేసింది. దీంతో పచ్చ మీడియాతో ప్రచారం పోటెత్తిపోయింది. రుణమాఫీ జరిగిపోయింది, రైతులంతా ఆనంద డోలికల్లో మునిగిపోతున్నారన్న కలరింగ్ ఇచ్చేశారు.  అసలు మెలిక ఇక్కడే పడింది.
పద్దతి ఏమిటంటే..
ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయానికి అనుగుణంగా ఆర్థిక శాఖ పచ్చ జెండా ఊపాలి. అప్పుడే పని మొదలవుతుంది.  ఆర్థిక శాఖ అనుమతి లేకుండా బడ్జెట్‌ నిధులను విడుదల చేసే అధికారం ఏ ప్రభుత్వ శాఖకూ లేదు. బడ్జెట్‌లో ప్రతిపాదించిన నిధులను విడుదల చేస్తూ ఆర్థికశాఖ తొలుత బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇస్తుంది. తదుపరి ఆయా ప్రభుత్వ శాఖలు పరిపాలనా ఆమోదం ఇస్తాయి. అందుకు తదనుగుణంగా నిధులు విడుదల చేస్తారు. అప్పుడు ఆయా లబ్దిదారులకు ప్రయోజనాలు దక్కుతాయి.
తిరగబడిన వ్యవహారం
ఆర్థిక శాఖ బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ (బిఆర్‌వొ) ఇవ్వకపోయినా, వ్యవసాయశాఖ రూ.2,360  కోట్లను మంజూరు చేస్తూ   పరిపాలనా ఆమోదం ఇచ్చేసింది. ఈ మేరకు జీవో వెలువరించింది. అడ్మినిస్ట్రేషన్‌ బిజినెస్‌ రూల్స్‌కు విరుద్ధంగా, కేవలం కంటి తుడుపు కోసమే ఈ జీవో ఇచ్చింది. దీంతో నిధులు అందుబాటులో లేవంటూ మాఫీ నిధులకు ఆర్థిక శాఖ బ్రేక్‌ వేసింది. బిఆర్‌వొ ఫైలు సిద్ధమైనప్పటికీ జివో ఇవ్వలేదు. మాఫీ చేసేశామని రైతులను మభ్యపెట్టేందుకే సాధారణ బిజినెస్‌ రూల్స్‌కు విరుద్ధంగా ఈ నాటకాలు ఆడుతున్నట్లు అర్థం అవుతోంది.
మరోసారి మోసపోయిన రైతులు
రుణమాఫీమీద మొదట నుంచి చంద్రబాబు చేతిలో రైతులు మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఈ జీవోల మతలబు తెలియక పోవటంతో రైతులు కొన్ని చోట్ల ప్రభుత్వాన్ని నమ్మారు. ఈ ధ్రువీకరణ పత్రాలు పట్టుకొని బ్యాంకులకు పరుగులు తీశారు. అవేమీ చెల్లవని, ప్రభుత్వ ఆదేశాలు లేనిదే ఏమీ చేయలేమని బ్యాంకర్లు చేతులు దులుపుకొన్నారు. దీంతో కార్యాలయాల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా రుణమాఫీ రెండో కిస్తీ కోసం 2015-16 బడ్జెట్‌లో రూ.4,300 కోట్లు ప్రతిపాదించగా ఒక్క రూపాయి ఇవ్వలేదు. 2016-17 బడ్జెట్‌లో రూ.3,512 కోట్లు ప్రతిపాదించగా ఆ నిధులు మంజూరు చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 25న వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం ప్రారంభం రోజున సిఎం తొలి సంతకం చేశారు. అనంతరం మే 6న ఆర్థిక శాఖ రూ.వెయ్యి కోట్లకు బిఆర్‌వొ ఇస్తూ జీవో జారీ చేసింది. బిఆర్‌వొ ఇచ్చిన తర్వాత కూడా కొరత పేరుతో నిధులు విడుదల చేయలేదు. ఎప్పటికో రైతు సాధికార సంస్థకు నిధులు బదలాయించారు. ఇంకా పంపిణీ చేయలేదు.  ఇప్పుడు మరో రకంగా మోసాలు కొనసాగిస్తూ వస్తోంది.

No comments:

Post a Comment