13 September 2016

స్విస్‌ చాలెంజ్‌ విధానం లోపభూయిష్టం

  • విదేశీ ప్రతిపాదనలను ఎందుకు రహస్యంగా ఉంచారు
  • రాజధానికి మనదేశ అనుభవం అవసరం లేదా?
  • రాష్ట్ర సంపదను దోచుకోవడమే బాబు ప్రధాన లక్ష్యం
  • కోర్టు, ప్రతిపక్ష అంశాలపై సర్కార్‌ సమాధానం చెప్పాలి
  • వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి డిమాండ్

హైదరాబాద్‌: స్విస్‌ చాలెంజ్‌ విధానంపై ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చినా.. చంద్రబాబు ఆ తీర్పును గౌరవించకుండా నియంతల వ్యవహరిస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. బాబు స్విస్‌ చాలెంజ్‌ విధానమంతా లోపభూయిష్టమేనని మండిపడ్డారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్విస్‌ చాలెంజ్‌ విధానమే తప్పు అని కేల్కర్‌ కమిటీ చెప్పిన తరువాత కూడా... ప్రాధమిక నియమావళికి వ్యతిరేకంగా వ్యవహరిస్తూ కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సింగపూర్‌ కంపెనీ ప్రతిపాదనలను ఎందుకు రహస్యంగా పెట్టాల్సివచ్చిందని బాబును ప్రశ్నించారు. స్విస్‌ విధానంలో ఎవరైనా ఉత్తమమైన ఐడియాలతో వస్తే ఆ ఐడియాలకు అనుగునంగా రెవెన్యూ మాడ్యులేషన్‌ ఉందని తేలితే దానికి కాంట్రాక్టులు పిలుస్తారని చెప్పారు. కానీ రాజధాని నిర్మాణానికి కావాల్సిన అర్హతలను దేశీయ కంపెనీలకు తెలియకుండా ఎందుకు దాచిపెట్టారన్నారు. భారతదేశంలో రాజధాని కట్టుకుంటూ దేశంలో కాకుండా విదేశాలలో అనుభవం పొందిన కంపెనీలను బాబు ఆహ్వానించడం సిగ్గుచేటన్నారు. భారతదేశంలో కట్టాల్సిన రాజధానికి దేశ అనుభవం అవసరం లేదా అని ప్రశ్నించారు. విదేశాల్లో భవనాలు కట్టిన అనుభవం ఉండాలన్నారంటే  సింగపూర్‌ కంపెనీలను రంగంలోకి తీసుకోవాలనే కుట్రే కనిపిస్తుందని దుయ్యబట్టారు. స్విస్‌ చాలెంజ్‌లో అమలు చేయాల్సిన విధానాలను కూడా అనుసరించకుండా విచ్చల విడిగా ప్రజల సొమ్మును దోచుకోవాలనుకోవడం దుర్మార్గమన్నారు. 

బరితెగించి దోచుకుంటున్నారు
రాజధాని నిర్మాణంలో కేవలం రూ. 320 కోట్లు ఖర్చు చేసే సింగపూర్‌ కంపెనీలకు 58 శాతం, రూ. 12 వందల కోట్లు ఖర్చు పెట్టే ప్రభుత్వ కంపెనీకి 42 శాతం వాటా కేటాయించడం దుర్మార్గమని కాకాణి మండిపడ్డారు. ఈ రెండు కంపెనీలను కలిపి అమరావతి డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు అని పేరు పెట్టి దీనికి పెత్తనం మొత్తం బాబు విదేశీ కంపెనీలకు అప్పగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటితో సంబంధం లేకుండా అమరావతికి మార్కెటింగ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేశారన్నారు. 1980 కోట్లు ఇన్‌ప్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ అయితే దాంట్లో రూ.1156 కోట్లు అడ్వర్టైజ్‌మెంట్, మార్కెటింగ్‌కు ఖర్చు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని కుంభకోణమని మండిపడ్డారు. చంద్రబాబుకు ఎక్కడా పబ్లిక్‌ ఇంట్రెస్టు లేదని, ఉన్నదంతా ప్రైవేటు ఇంట్రెస్టేనని ఎద్దేవా చేశారు. ఇది స్విస్‌ చాలెంజా, చంద్రబాబు గారి సూట్‌కేసు చాలెంజో చెప్పాలన్నారు. 

రాజధాని ప్రాంతంలో ఎకరం రూ. 14 కోట్లకు అమ్మితేనే పెట్టుబడి తిరిగి వస్తుందని చెప్పారు. కానీ, కేవలం 4 కోట్ల అప్‌సెట్‌ ప్రైస్‌కు ఇచ్చేయడం వెనక ఆంతర్యం ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు. స్విస్‌ చాలెంజ్‌ విధానాన్ని కోర్టు తప్పుబట్టినా ప్రజలకు సమాధానం చెప్పకుండా బరితెగించి దోచుకుంటున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత స్వార్ధం తప్ప ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశ్యం బాబులో ఏ కోశానలేదన్నారు. కోర్టు స్విస్‌ చాలెంజ్‌ పక్రియను నిలిపివేయాలని స్టే ఇస్తే చంద్రబాబు, మంత్రులు అప్పీల్‌కు వెళ్తామనడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి చెందిన సంపదను దోచుకోవడమే బాబు ప్రధాన లక్ష్యమని ఫైరయ్యారు. న్యాయస్థానం, ప్రతిపక్షం లేవనెత్తిన స్విస్‌ అంశాలపై ప్రభుత్వం ప్రజలకు పూర్తి వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.  లేనిపక్షంలో ప్రజలముందు  దోషులుగా నిలబడతారని హెచ్చరించారు. 

No comments:

Post a Comment