14 September 2016

కమీషన్లు కొట్టేందుకు ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించిన ఏపీ సీఎం

  • విభజన సమయంలో పదిహేనేళ్లు ప్రత్యేక హోదా కావాలన్న బాబు
  • టీడీపీ మేనిఫెస్టోలో ఇదే అంశం
  • అధికారంలోకి వచ్చాక హోదా సంజీవిని కాదంటూ సన్నాయి నొక్కులు
  • హోదా సాధనే లక్ష్యంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం
హైదరాబాద్‌: ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కేంద్రం రాష్ట్ర విభజన చేసింది. కనీసం రాజధాని కూడా లేకుండా 13 జిల్లాలతో నూతన ఆంధ్రప్రదేశ్‌ నిర్హేతుక ఆవిర్భావం జరిగింది. ఫలితంగా పారిశ్రామికంగా దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీ బాగా వెనుకబడిపోయింది. పరిశ్రమలు వస్తేనే ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అభివృద్ధికి బాటలు పడతాయి. విభజన బిల్లు మీద రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు.. పెద్దల సభ సాక్షిగా అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌.. రాష్ట్రానికి ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో చేర్చాల్సిన అవసరం లేదని, ప్రధానమంత్రిగా హామీ ఇస్తున్నాననీ స్పష్టం చేశారు. ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాలని బీజేపీ నేత, ఇప్పటి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సభలో గట్టిగా పట్టుబట్టారు. ఆ తర్వాత జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తూ తీర్మానించింది. అ తర్వా త ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలు ఇదే మేనిఫెస్టోలో పెట్టారు. ప్రత్యేక హోదా పదేళ్లు కావాలన్న బీజేపీ కేంద్రంలో అధికార పీఠాన్ని అధిష్టించింది. పదిహేనేళ్లు కావాలని డిమాండ్‌ చేసిన చంద్రబాబు రాష్ట్రంలో పగ్గాలు చేపట్టారు. కానీ ప్రత్యేక హోదా హామీ వాస్తవరూపం దాల్చలేదు. గట్టిగా కేంద్రాన్ని నిలదీయాల్సిన ఏపీ సీఎం చంద్రబాబు తన ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా.. ప్యాకేజీ ఇచ్చినా సరిపోతుందం టూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సన్నాయి నొక్కులు నొక్కారు. బాబు మెతక వైఖరిని అలుసుగా తీసుకున్న కేంద్రం ఎట్టకేలకు మొక్కుబడిగా ప్యాకేజీ ప్రకటించి చేతులు దులుపుకోంది.   

హోదాతోనే అభివృద్ధి సాధ్యం
ప్యాకేజీలతో నామమాత్రంగా విదిలించే నిధులను నమ్ముకోవడం కంటే భారీ ప్రోత్సాహకాలు, గ్రాంట్లు లభించే ప్రత్యేక హోదా సాధించుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. హోదాకు ప్యాకేజీ అదనంగా ఉండాలే తప్ప.. ప్రత్యామ్నాయంగా ఉండకూడదని స్పష్టం చేస్తున్నారు. ఇందు కోసం రెండున్నరేళ్లుగా వైయస్‌ జగన్‌ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం చేపట్టారు. గుంటూరు కేంద్రంగా ఆమరణ నిరాహారదీక్ష చేపడితే చంద్రబాబు ప్రభుత్వం దీక్షను భగ్నం చేసి హోదా అంశాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు.  రాష్ట్రానికి ప్రత్యేక హోదా వల్ల ఒనగూడే ప్రయోజనాలను ప్రతిపక్ష నేత వైయస్‌.జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభ లోపల, వెలుపల పలుమార్లు గట్టిగానే వివరించారు. హోదా కోసం అలుపెరగకుండా పోరాడుతున్నారు.  

బాబుకు దక్కిన తొలి ‘ప్యాకేజీ’
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు కేంద్రం తీసుకుంటే కమీషన్లు కొట్టేసే అవకాశం ఉండదని, చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ వైపు మొగ్గు చూపించారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను అప్పగించి 24 గంటలు కూడా గడవక ముందే.. ఆ ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌(ప్రధాన పనులు) కాంట్రాక్టర్‌ అయిన టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు బాబు రూ.1,481 కోట్ల భారీ లబ్ధి చేకూర్చారు.  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ సెప్టెంబర్ (7న) రాత్రి ప్యాకేజీ ప్రకటించగానే.. గురువారం(8న) పోలవరం హెడ్‌వర్క్స్‌ అంచనా వ్యయాన్ని రూ.5,535.41 కోట్లకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు(జీవో 96) జారీ చేసింది. రెండేళ్లుగా మొగ్గుచూపని ప్రభుత్వం.. ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి మాత్రం మొదటి నుంచీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. 

సర్వం దోపిడీయే
పోలవరం హెడ్‌వర్క్స్‌ చేసే సత్తా ట్రాన్స్‌ట్రాయ్‌కు లేదని.. ఆ సంస్థపై అనర్హత వేటు వేయాలని, పనులు అప్పగించొద్దంటూ అప్పట్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీ(స్టేట్‌ లెవల్‌ స్టాండింగ్‌ కమిటీ) నివేదిక ఇచ్చింది. అప్పట్లో రాయపాటి కాంగ్రెస్ లో ఉన్నారు. పోలవరం హెడ్ వర్క్స్ పనులు రాయపాటికి ఎలా అప్పగిస్తారంటూ అప్పటి విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు తీవ్రస్థాయిలో అభ్యంతరం తెలిపారు. ఆతర్వాత రాయపాటి సైకిల్ ఎక్కడం బాబుకు సన్నిహితంగా మెలగడంతో దోపిడీకి స్కెచ్ వేశారు. నాడు రాయపాటి ఎలా అప్పగిస్తారని అనన వ్యక్తి ఇప్పుడు అదే రాయపాటికి లబ్ది చేకూరుస్తూ దోపిడీకి స్కెచ్ వేశారు. రాయపాటికి ఆ పనులు కట్టబెట్టిన చంద్రబాబు భారీ ఎత్తున దోచిపెట్టేందుకు పావులు కదిపారు. పీపీఏని నామమాత్రంగా మార్చి, రాయపాటితో కలసి నిధులు కొల్లగొడుతున్నారు. అధికారం, అక్రమ సంపాదన కోసం ఏపీ సీఎం చంద్రబాబు ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ ఏపీ ప్రజల ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారు. 

No comments:

Post a Comment