28 September 2016

నగరపాలక సంస్థలో అంతులేని అవినీతి, అక్రమాలు

  • కార్పొరేషన్‌ను ముట్టడించిన వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు  
  • టెండర్లు వేయాలని డిమాండ్ చేస్తూ కార్యాలయం ముట్టడి
  • మంత్రి నారాయణ తీరుపై అనిల్, కోటంరెడ్డిల ఆగ్రహం
 
నెల్లూరు : రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి.నారాయణ, నెల్లూరు మేయర్‌ అబ్దుల్‌ అజీజ్‌ డౌన్‌ డౌన్‌ అనే నినాదాలతో నగరపాలక సంస్థ కార్యాలయ ప్రాంతం మార్మోగింది. కార్పొరేషన్‌లో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు రూ.42 కోట్లకు  సంబంధించి... 10 నెలలుగా టెండర్లు వేయకుండా కాలయాపన చేస్తున్న వైనాన్ని నిరసిస్తూ వైయస్సార్‌సీపీ సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలు  పి.అనిల్‌కుమార్‌ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలతో కలిసి ముట్టడించారు.

ఈ సందర్భంగా అనిల్‌ మాట్లాడుతూ... సబ్‌ప్లాన్‌ నిధులకు టెండర్లు పిలవకుండా మేయర్, అధికారులు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి నారాయణ సొంత కార్పొరేషన్‌లో ఈ పరిస్థితి ఉండటం బాధాకరమన్నారు. రూ.42 కోట్లను ప్యాకేజీలుగా చేసి దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నగరపాలక సంస్థలో అవినీతి, అక్రమాలకు అంతులేకుండా పోయిందన్నారు. మంత్రి ప్రజలకు అందుబాటులో ఉండటంలేదని ఫైర్ అయ్యారు. 

శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని కార్పొరేషన్‌లలో సబ్‌ప్లాన్‌ నిధులతో పనులు పూర్తిచేయడం కూడా జరుగుతుందన్నారు. కానీ, నెల్లూరులో ఇంతవరకు అతీగతీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనే కమిషనర్‌ను కలిసి టెండర్లు వెంటనే పిలవాలని కోరామని, ఆయన వారంరోజుల్లో పిలుస్తామని చెప్పారన్నారు. 25 రోజులు గడుస్తున్నా టెండర్లు పిలవకపోవడం దారుణమన్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 28, 29 తేదీల్లో అనిల్‌ దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. టెండర్లు పిలకపోతే కార్పొరేషన్‌ కార్యాలయంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కోటంరెడ్డి హెచ్చరించారు. 
 
నాయకులు, పోలీసుల మధ్య తోపులాట
కార్యాలయంలో కమిషనర్‌ను కలిసేందుకు వైయస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో కమిషనర్‌ వెంకటేశ్వర్లు కార్యాలయం బయటకు వచ్చి ఎమ్మెల్యేలతో మాట్లాడారు. వారం రోజుల్లో టెండర్లు తప్పనిసరిగా పిలుస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలు కమిషనర్‌తో మాట్లాడుతూ వారంలో టెండర్లు పిలవకపోతే మీరు బాధ్యత వహిస్తారా? అని ప్రశ్నించారు. దీనికి కమిషనర్‌ స్పందిస్తూ వారంలో టెండర్లు పిలవకపోతే మీరు చేపట్టే దీక్షలో తాను కూడా కూర్చుంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ పోలుబోయిన రూప్‌కుమార్‌యాదవ్, విప్‌ బొబ్బల శ్రీనివాసులుయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment