29 August 2016

సెప్టెంబర్ లో కడపలో వైయస్ జగన్ పర్యటన

  • రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం
  • 1వ తేదీ.. పంటనష్టం వాటిల్లిన ప్రాంతాల పరిశీలన
  • 2వ తేదీ..వైయస్ఆర్ వర్థంతి కార్యక్రమానికి హాజరు
  • 3వ తేదీ..రైతు మహాధర్నాలో పాల్గొని ప్రసంగిస్తారు
వైయస్ఆర్ కడప: రాయలసీమ రైతాంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 29వ తేది నిర్వహించ తలపెట్టిన రైతు మహాధర్నాను సెప్టెంబర్‌ 3వ తేదికి వాయిదా వేసినట్లు వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి తెలిపారు.  పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, అంజద్‌బాషాలతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని కేసీ కెనాల్, తెలుగుగంగ, గండికోట ప్రాజెక్టులకు నీరందించాలని అనేక సార్లు ప్రభుత్వాన్ని కోరినా ఫలితం కనిపించలేదన్నారు.

నీళ్లు ఇస్తామని చెబుతున్నా అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వకుండా దాగుడు మూతలాడుతున్నారని మండిపడ్డారు. ఈ  ప్రభుత్వాన్ని నమ్మి పంటలు వేసిన రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఈ విషయాన్ని కలెక్టర్‌ దష్టికి కూడా తీసుకుపోయామన్నారు. అయినా చలనం లేకపోవడంతో అఖిలపక్ష నేతలతో కలిసి ఈనెల 29వతేది కలెక్టరేట్‌ ఎదుట మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. సెప్టెంబర్‌ 1న ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ జిల్లాకు వస్తుండటంతో ధర్నాను 3వ తేదికి వాయిదా వేశామన్నారు. 1వ తేది జిల్లాలో పంటనష్టం వాటిల్లిన ప్రాంతాలను వైయస్‌ జగన్‌ పరిశీలిస్తారని, 2వ తేది వైయస్‌ఆర్‌ వర్థంతి కార్యక్రమంలో పాల్గొని, 3వ తేది కడప కలెక్టరేట్‌ ఎదుట అఖిల పక్షనేతలతో కలిసి నిర్వహించే రైతు మహా ధర్నాలో పాల్గొని రైతులనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. జిల్లాలోని రైతాంగమంతా ఈ మహాధర్నాలో విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

‘సీమ’ ప్రాజెక్టులు ప్రస్తావనకు రాకపోవడం దారుణం– రఘురామిరెడ్డి
ఇటీవల జరిగిన కష్ణా ట్రిబ్యునల్‌ బోర్డు సమావేశంలో నాగార్జున సాగర్‌ ఆయకట్టు రైతులను దష్టిలో ఉంచుకొని కేటాయింపులు చేశారని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆరోపించారు. రాయలసీమలోని ప్రాజెక్టులు ఈ సమావేశంలో ప్రస్తావనకు కూడా రాకపోవడం అత్యంత దారుణమన్నారు.  రెండేళ్లుగా కేసీ కెనాల్‌కు నీళ్లు రాలేదని, ఈఏడు కూడా రాకపోతే తాగునీటికి కూడా ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. సీమ రైతాంగాన్ని ఆదుకొనే విషయంలో తమ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతుందని, అసెంబ్లీలో కూడా గట్టి పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.

మాట తప్పి మోసం చేస్తున్నారు– రవీంద్రనాథ్‌రెడ్డి
కేసీ కెనాల్‌ పరిధిలో 90 వేల ఎకరాలకు నీరిస్తామని చెప్పిన మంత్రి గంటా మాటతప్పి మోసం చేస్తున్నారని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. గండికోట, బ్రహ్మం సాగర్‌లో 12 టీఎంసీలు నిల్వ ఉంచుతామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వ పెద్దలు కష్టా ట్రిబ్యునల్‌ బోర్డు సమావేశంలో మాత్రం బ్రహ్మంసాగర్‌కు 6టీఎంసీలు, గండికోటకు 5 టీఎంసీలు కేటాయించాలని చెప్పడం దారుణమన్నారు. జనవరి 15 వరకూ కేసీకి నీరివ్వాలని, వర్షాభావ పరిస్థితుల వల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

సీమను అశ్రద్ధ చేయొద్దు– ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి
రాయలసీమను ఏమాత్రం అశ్రద్ధ చేసినా తీవ్ర నష్టం ఎదుర్కోక తప్పదని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి హెచ్చరించారు. 2014లో శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి కోసం 92 టీఎంసీలు కిందికి వదిలినా చుక్కనీరు కూడా రాయలసీమకు రాలేదన్నారు. దీనివల్ల మూడోసారి సీమలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయని తెలిపారు.

ప్రభుత్వాన్ని మొద్దునిద్ర నుంచి లేపడానికే ధర్నా– శ్రీనివాసులు
మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వాన్ని తట్టి లేపడానికే రైతు మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. చంద్రబాబు సీఎం అయిన ప్రతిసారి అయితే అతివష్టి లేకపోతే అనావష్టి సంభవించడం ఆన వాయితీగా మారిందన్నారు. మంత్రివర్గ అనుచరులకు పంచిపెట్టడానికే పుష్కరాలు నిర్వహించారని ఆరోపించారు. రాయలసీమలో కరువు తాండవిస్తుంటే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు.

విభజన చట్టంలోని హామీలపై కూడా ప్రశ్నిస్తారు– అంజద్‌బాషా
సెప్టెంబర్‌ 3న జరిగే రైతు మహాధర్నాలో రైతు సమస్యలతోపాటు విభజన చట్టంలోని హామీలపై కూడా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశ్నిస్తారని కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, స్టీల్‌ప్లాంటు ఏర్పాటులో జరుగుతున్న జాప్యాన్ని ఎండగడతారని చెప్పారు. ఈ సమావేశంలో వైయస్‌ఆర్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి టీకే అఫ్జల్‌ఖాన్, బద్వేల్‌ సమన్వయకర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు పి. ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments:

Post a Comment