3 August 2016

ప్రత్యేక హోదా కోసం ఉధృత పోరాటం

  •  చంద్రబాబు వైఖరిలో ఇప్పటికీ మార్పులేకపోవటం బాధాకరం
  • మరింతగా పోరాడతామన్న జన నేత వైయస్ జగన్

హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ప్రకటించారు. పోరాటం కొనసాగించక పోతే ప్రభుత్వాలు గాలికి వదిలేస్తాయని అభిప్రాయ పడ్డారు. అయిదుకోట్ల మంది గొంతెత్తి అడుగుతున్నప్పటికీ చంద్రబాబులో మార్పు రాకపోవటం బాధాకరమని ఆయన అన్నారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. సంపూర్ణంగా విజయవంతం అయిన బంద్ లో పాల్గొన్నవారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. వైయస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే...


()  రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక హోదా కావాలని, హోదాతో జీవితాలు బాగు పడతాయని ప్రజలు కోరుకొంటున్నారు. లక్షల కోట్ల మేర పెట్టుబడులు తరలి వస్తాయని, లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని, వేల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటవుతాయని ప్రజానీకం విశ్వసిస్తున్నారు. ఈ నమ్మకంతోనే రాష్ట్ర వ్యాప్త బంద్ ను జయప్రదం చేశారు.

() ఈ బంద్ లో పాల్గొన్నవారందరికీ హ్రదయ పూర్వక ధన్యవాదాలు. ఈ బంద్ ను అడ్డుకొనేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ విజయవంతం అయింది. సీపీఐ, సీపీఎం, ఇతర పార్టీలకు ధన్యవాదాలు. మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, విద్యా సంస్థలు, పరిశ్రమలు, వ్యాపార వర్గాలు, ఎన్జీవోలు, వ్యవసాయ వర్గాలు.. ముఖ్యంగా లాఠీ దెబ్బల్ని సైతం లెక్క చేయకుడా బంద్ ను సఫలీక్రతం చేసిన అక్క చెల్లెమ్మలకు ధన్యవాదాలు.


() అయిదు కోట్ల మంది ముందుకు వచ్చి స్వచ్ఛందంగా పాల్గొనటం వల్లనే బంద్ విజయవంతం అయింది. ఇప్పుడు జరిగిన పోరాటం కేంద్ర ప్రభుత్వం మీద మాత్రమే జరిగింది కాదు, దౌర్భాగ్యం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడాల్సి వచ్చింది. బంద్ ను అడ్డుకొనేందుకు చంద్రబాబు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నించింది. ఇది అన్నింటికన్నా దురద్రష్టకరం. బాధాకరం.


() చంద్రబాబే దగ్గర ఉండి పోలీసు బలగాల్ని విపరీతంగా ప్రయోగించారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనియా, లేక ప్రత్యేక హోదా ఉంటే అన్నీ జరిగిపోతాయా అంటూ నీరుగార్చిన వ్యక్తి..మొన్నటి రోజున ప్రత్యేక హోదా అన్నది అవసరం అని అంటుంటే సంతోషించాం. కానీ ఎంతటి డ్రామా సాగించారు. ఎక్కడా చిత్తశుద్ది ప్రదర్శించలేదు. ఇటువంటి వ్యక్తా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని బాధ వేస్తుంది.

()ఎక్కడా తెలుగుదేశం శ్రేణులు బంద్ లో పాల్గొనలేదు కానీ చంద్రబాబు పోలీసుల్ని వాడుకొని విఫలం చేసేందుకు ప్రయత్నించారు. మొన్నటికి మొన్న అరుణ్ జైట్లీ మాటలు వింటుంటే రక్తం మరిగిపోతోంది అని చంద్రబాబు డ్రామాలు ఆడారు. ఇప్పుడు ముందు నిలిచి పోరాడాల్సిన చంద్రబాబు కనిపించకుండా ఉంటే అయిదుకోట్ల ప్రజల రక్తం మరుగుతోంది.
() ఇంతకు ముందు, అక్టోబర్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అమరావతికి శంకుస్థాపనకు వస్తున్నారని, అక్కడ ప్రత్యేక హోదా మీద చంద్రబాబు ఒత్తిడి తెస్తారని భావించాం. అందుకోసం అక్టోబర్ 7 నుంచి దాదాపు 7,8 రోజుల పాటు గుంటూరులోనే నిరవధిక దీక్ష చేయటం జరిగింది. మమ్మల్ని చూపించి అయినా ప్రజల ఆవేదనను తెలియపరిచి ప్రత్యేక హోదా గురించి అడుగుతారని ఎదురు చూశాం. 7,8 రోజుల పాటు దీక్ష చేస్తే వందల మంది పోలీసుల్ని పంపించి భగ్నం చేసేశారు. కానీ నరేంద్రమోదీ ముందు హోదా గురించి ఒక్క మాటయినా మాట్లాడకుండా కాలం గడిపేశారు.
() స్వాతంత్ర్య సమర సమయంలో చంద్రబాబు లేరు కాబట్టి సరిపోయింది కానీ లేదంటే ఈ బంద్ లు ఎందుకు, స్వాతంత్ర్య పోరాటం ఎందుకు అని ఉండేవారు. అసలు ఈ దేశానికి స్వాతంత్ర్యం ఎందుకు అని కూడా అని ఉండేవారేమో. మన అద్రష్టం ఏమిటంటే... ఆ సమయంలో చంద్రబాబు లేకపోవటం, దురద్రష్టం ఏమిటంటే.... ఈ సమయంలో చంద్రబాబు ఉండటం. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా, అది రాకపోతే ఏమైనా అవుతుందా అని అడుగుతున్నారు.
() చంద్రబాబుని సూటిగా ఒకటే అడుగుతున్నా.. ప్రత్యేక హోదా కు మీరు అనుకూలం అయితే ఎందుచేత బంద్ ను అడ్డుకొంటున్నారు. మొక్కుబడిగా టీడీపీ ఎంపీల చేత నినాదాలు ఎందుకు చేయించారు. ఈ విధంగా బాబు డ్రామాలు ఆడటం ఎంతటి అన్యాయం. టీడీపీ కేంద్ర మంత్రులు మాత్రం ఎక్కడా నినాదాలు చేయలేదు. కనీసం గాంధీ విగ్రహం దగ్గర చేసిన ఆందోళనలో కూడా పాలు పంచుకోలేదు.
() ఈ రోజు ప్రజలంతా స్వచ్ఛందంగా చేసిన బంద్ ను ఎక్కడికక్కడ అడ్డుకొనే ప్రయ్నతాలు పెద్ద ఎత్తున చేశారు. విపరీతంగా అరెస్టులు చేయించారు. మహిళలపై కూడా పోలీసులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇటువంటివి చూస్తుంటే చంద్రబాబు మన రాష్ట్రానికే ముఖ్యమంత్రా లేక పక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రా అన్న అనుమానం కలుగుతుంది.  బాబు అనుసరిస్తున్న వైఖరి, మోసం చేస్తున్న పద్దతి మీద రాష్ట్ర ప్రజలు గట్టిగా బుద్ది చెప్పే పరిస్థితి వస్తుంది.
() వైయస్సార్సీపీ సభ్యులు లోక్ సభలో వెల్ లోకి వెళ్లి గట్టిగా నిలదీస్తుంటే, టీడీపీ ఎంపీలు మాత్రం సీట్లోంచి నినాదాలు ఇచ్చారు. ముఖ్యమంత్రితో మాట్లాడాను. ప్యాకేజీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామనగానే టీడీపీ ఎంపీలు ఏమీ మాట్లాడలేదు. అక్కడితో వదిలేశారు.
() ప్రత్యేకహోదా అన్నది మన హక్కు. రాష్ట్రాన్ని విడగొట్టేనాడు హోదా ఇస్తామని చెప్పి విడగొట్టారు. హక్కును వీళ్లు వదిలేస్తున్న పరిస్థితి చూస్తుంటే నిజంగా మనుషులేనా అనిపిస్తోంది. హోదా ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు విపరీతంగా వస్తాయని తెలిసి కూడా చేతులారా హోదాను కాలరాస్తున్న పరిస్థితిని చూస్తే బాధేస్తోంది.
() ఈ పోరాటం ఇకపైనా కొనసాగుతుంది. ధర్నాలు, బంద్ లు, నిరాహార దీక్షలు చేశాం. ఢిల్లీ వెళ్లి ఎంపీలు, ఎమ్మెల్యేలు కలిసికట్టుగా ధర్నాలు చేశాం. రాష్ట్రపతిని, ప్రధానిని, కేంద్రమంత్రులను కలిశాం. హోదా పై యువభేరి కార్యక్రమాల ద్వారా పోరాటం కొనసాగిస్తున్నాం
() హోదాను బాబు మర్చిపోవచ్చేమో గానీ ప్రతిపక్షంగా మేము, ప్రజలు మర్చిపోరు. రాబోయే రోజుల్లో ఇంకా కొనసాగిస్తాం. కచ్చితంగా వచ్చేలా చేస్తాం. మేం పోరాటాలు కొనసాగిస్తున్నాం కాబట్టే బాబు మర్చిపోని పరిస్థితిలో ఉన్నాడు. హోదా వచ్చేదాకా పోరాటం ఆగదు. మళ్లీ రాష్ట్రపతిని, ప్రధానిని కలిసేందుకు అపాయింట్ మెట్ అడిగాం. యువభేరి కార్యక్రమాలు  కొనసాగుతాయి. నెల్లూరులో ఎల్లుండి యువభేరి కార్యక్రమం కొనసాగుతుంది.
అని వైయస్ జగన్ స్పష్టంగా సూటిగా తేల్చి చెప్పారు.

No comments:

Post a Comment