25 August 2016

రైతాంగాన్ని ఆదుకొని ఏపీ సర్కార్‌

  • బీడుగా మారుతున్న కృష్ణాడెల్టా      
  • పట్టిసీమ పేరిట ఆయకట్టు నాశనం 
  • ఆందోళనలో అన్నదాతలు

‘‘ కరువును చూసి భయపడటం కాదు..మనల్ని చూసి కరువు భయపడే రోజు రావాలి’’   రాష్ట్రంలో 450 లిఫ్టు ఇరిగేషన్లను అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి ఇంటికి సురక్షిత మంచినీటి సరఫరాకు కృషి చేస్తున్నాం. నదులు అనుసంధానం చేసిన ఘనత మనదే అని ముఖ్యమంత్రి చంద్రబాబు గొప్పులు చెప్పుకుంటున్నారు. ఆయన అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతున్నా రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. ప్రభుత్వానికి ముందు చూపు కొరవడటంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయి.  

విజయవాడ: పచ్చని పంట పొలాలు.. జలజల పారే కాలువలు.. సిరులు కురిపించే బంగారు వన్నెలోని ధాన్యపు రాశులు కృష్ణా డెల్టా సొంతం. చంద్రబాబు పుణ్యమా అని డెల్టా మలమల మాడుతున్న పరిస్థితి. వరుణుడు మొహం చాటేయడంతో  కష్ణా డెల్టాలో కరవు రక్కసి కరాళ నృత్యం చేస్తోంది.  రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పుష్కరాల పేరుతో కాలయాపన చేస్తోంది. లక్షల్లో పెట్టుబడి పెట్టిన పంటలు కళ్లముందే ఎండిపోతుండడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు.  ఏరువాక పేరుతో పండుగలు చేసిన ప్రభుత్వం, జులై 10వ తేదీ నుంచి నారుమళ్లు పోసుకోవచ్చని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు ...కృష్ణాడెల్టా రైతాంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. కరువుతో కర్షకుడు కంటతడి పెడుతుంటే బాబు పుష్కరాల పేరుతో కాలక్షేపం చేస్తున్నారు. 

అంతా ప్రచార ఆర్భాటమే
రెండు చెంబులతో నీళ్లు పోసి గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామని చెప్పుకోవడం బాబుకే చెల్లింది.  పట్టిసీమతో రాయలసీమ ప్రజలకు నీరందిస్తానని ముచ్చటగా మూడుసార్లు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి... కనీసం కృష్ణాడెల్టాలో నారుమళ్లకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు. రైతు ప్రయోజనాల కంటే టీడీపీ సర్కార్‌కు వ్యక్తిగత ప్రచారమే ముఖ్యమైంది.  పుష్కరాల ప్రాంతంలో ఉన్న ముఖ్యమంత్రి, పక్కనే పంటలు ఎండిపోతున్నా పట్టించుకోలేదు. సుభిక్షమైన కష్ణాడెల్టాను బీడుగా మార్చారు. పంటకాలువల నుంచి ఇంజిన్లతో బ్రాంచి కాలువలకు, అక్కడ్నుంచి మళ్లీ ఇంజిన్లతో పొలాలు తడువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. 

కరువు సహాయక చర్యలేవీ!
మూడేళ్లుగా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. అయితే సర్కార్‌ సాయం ఏమీ లేదు. గత రెండేళ్లలో ప్రకటించిన కరువు మండలాల రైతులకు ఇంతవరకు ఇన్‌పుట్‌ సబ్సిడీ అందించలేదు. 2003లో కరువు సమయంలో ఎకరాకు రూ.10 వేల నష్టపరిహారం డిమాండ్‌ చేసిన చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎందుకు అమలు చేయటం లేదు. ప్రభుత్వం లక్ష్యసాధన కోసం అవసరమైన పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పలుసార్లు స్పష్టంచేశారు. ఈ క్రమంలో డెల్టా ఆధునికీకరణ, సకాలంలో సాగునీటి విడుదల, భూగర్భ జలాల పెంపు, పంట కాల్వలు వంటి అంశాలపై ఎందుకు దృష్టి సారించడం లేదు.

వైయస్‌ఆర్‌ జీవించి ఉంటే..
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది. ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల ఆకాంక్షల మేరకు వారి అంచనాలను మించి గ్రామగ్రామాన, ఇంటింటికీ సంక్షేమం అందించారు. జలయజ్ఞం అయినా, పారిశ్రామిక అభివృద్ధి అయినా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ప్రాజెక్టులు, పరిశ్రమలు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 86 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. వైయస్‌ఆర్‌ జీవించి ఉంటే ఇప్పటికి జలయజ్ఞం ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేవి. అన్ని ప్రాంతాల్లోనూ ఆయా పరిశ్రమలు అభివృద్ధి చెంది ఉండేవి. మహానేతే బతికుంటే తమకు ఈబాధలు ఉండేవి కావని అన్నదాతలు గుర్తు చేసుకుంటున్నారు. 

No comments:

Post a Comment