12 April 2016

కేశవరెడ్డి, చైతన్య మధ్య లోపాయికారి ఒప్పందం బయటపెట్టండి



  • సేకరించిన రూ.740 కోట్లు డిపాజిట్లు ఎక్కడికి వెళ్లాయి
  • విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేయడం కాదా..?
  • పార్టీ ఫిరాయింపులు అవమానకరం
  • రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించడం దేశనేరమేః ధర్మాన
హైదరాబాద్ః  కేశవరెడ్డి విద్యాసంస్థలను చైతన్య సంస్థలకు అప్పజెప్పామన్న ప్రభుత్వ నిర్ణయం సమంజసంగా లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు.  కేశవరెడ్డి విద్యాసంస్థలు గడిచిన కొన్ని సంవ్సరాలుగా ఏపీలో సుమారు 740 కోట్ల రూపాయల డిపాజిట్స్ ను విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద సేకరించాయన్నారు. 740 కోట్ల రూపాయల ప్రజల ఆస్తికి సంబంధించిన విషయాన్ని.... ప్రైవేటు వ్యక్తుల డీల్ మాదిరిగా లోపాయికారి ఒప్పందం  చేయడంలో మీ ప్రయోజనమెంత అని అధికారపార్టీని నిలదీశారు. డిపాజిట్లు ఇంకా ఎన్ని సేకరించారు. అవి ఏ ఆస్తుల కొనుగోళ్లకు వెళ్లాయో తేలాలంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

డిపాజిట్స్ ఇవ్వడంలో వైఫల్యం చెందడంతో కేశవరెడ్డి సంస్థలపై కేసులు కూడా రిజిస్టర్ అయి దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయన్నారు. తల్లిదండ్రులు ఆందోళనతో ఉన్న విషయాన్ని వివరించారు.  ప్రభుత్వం విద్యాసంస్థల అప్పగింత బాధ్యత తీసుకున్నప్పుడు రూ. 740 కోట్ల బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు. సత్యం సంస్థలు దెబ్బతిన్నప్పుడు కూడా హైకోర్టు జోక్యం చేసుకొని కొన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఇలా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 

కేశవరెడ్డి, చైతన్య సంస్థలకు ముందే సంబంధాలున్నాయని అంటున్నారు.  ప్రజల వద్ద సేకరించిన డిపాజిట్స్ తో అనేక ఆస్తులు కొన్నారన్న ఆరోపణలు ఉన్నాయి.  ఆ బాధ్యత మీరు తీసుకోరా...? రూ.740 కోట్లు చెల్లించిన విద్యార్థులు, తల్లిదండ్రులను మోసం చేయడం కాదా...? అని ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. స్వార్థపూరిత ఆలోచనలతో కబ్జా చేసే కార్యక్రమం చేస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అగ్రిగోల్డ్ కి సంబంధించిన విషయంలోనూ ఇలాగే వ్యవహరించారని...కేసును సీబీఐకి అప్పగించమంటే అప్పగించకుండా దోపిడీకి బాటలు తెరిచారని నిప్పులు చెరిగారు.  ప్రభుత్వానికి సంబంధించిన విషయాన్ని ప్రైవేటు కార్యక్రమంలా చేయడం దారుణమన్నారు.  కేబినెట్ లో ఉన్న తాబేదారులకు సంబంధించిన విషయం అయినందున ..దానిపై దర్యాప్తు జరిపించాల్సిన పూర్తి బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.  

టీడీపీ నాయకులు చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతూ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే ఎత్తుగడలు చేయడం దుర్మార్గమని  ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. ఏపీలో పరిణామాలు చాలా అన్యాయంగా ఉన్నాయన్నారు. అనర్హత వేటుకు సంబంధించి 2003లో వచ్చిన రాజ్యాంగ సవరణ గురించి తెలియని వాళ్లు తప్పుడు సంకేతాలిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం సమాజానికే సిగ్గుచేటన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయాలన్నారు. 

రాజకీయ పార్టీకి ఉన్న సంఖ్యలో 1/3 గ్రూప్ కింద ఫామ్ అయి... పార్టీ మారవచ్చని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ద్వారా టీడీపీ నేతలు చెప్పారు. ఇది పూర్తిగా అసత్యం. చట్టవ్యతిరేకమైన ఫిరాయింపుల్ని ప్రోత్సహించడానికి ఎత్తుగడ అని ధర్మాన దుయ్యబట్టారు.  ఏపీలో పార్టీ ఫిరాయించిన వారంతా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులవుతారన్నారు.  శాసనసభలో ఉండే సభ్యులు మొత్తం పార్టీ ఫిరాయించినా ...వారిపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వర్తిస్తుందన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం దురదృష్టకర పరిణామమని ధర్మాన మండిపడ్డారు.  

రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ రాజకీయ పార్టీ ప్రవర్తించినా అది దేశనేరంగా పరిగణించాలన్నారు. శాసనసభ్యుల ఫిరాయింపులను ప్రోత్సహించే వ్యక్తులు నేరం చేస్తే , దాన్ని అమలు చేసే వ్యక్తులు తాత్సారం చేసి.... అధికారపార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నారన్న అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయన్నారు. 2003లో ఓ లక్ష్యం కోసం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణను కొంతమంది అడ్డుకునే వ్యవస్థ మిగిలి ఉందన్నారు. దాన్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం రాజకీయ పార్టీలకు ఉందన్నారు. ఇది సమాజానికే సిగ్గుచేటు అని ధర్మాన ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన చర్యలను ప్రోత్సహించడం అవమానకరమన్నారు.  

No comments:

Post a Comment