12 April 2016

చంద్రబాబు మాటలకు చేతలకు పొంతన లేదు



  • బీసీలకు వినియోగిస్తున్న నిధులే తార్కాణం
  • చంద్రబాబు మాటల గారడీని తప్పు పట్టిన మాజీమంత్రి ధర్మాన

హైదరాబాద్: బడుగు బలహీన వర్గాల మీద చంద్రబాబు చూపిస్తున్నది కపట ప్రేమ అని మాజీమంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాద్ రావు అభివర్ణించారు. చంద్రబాబు ప్రభుత్వం వినియోగిస్తున్న సంక్షేమ నిధుల్ని చూస్తే ఈ విషయం అర్థం అవుతుందని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం మాజీమంత్రి ధర్మాన మీడియాతో మాట్లాడారు. భారత సమాజంలో మొట్టమొదట వెనుకబడిన వర్గాల గురించి పోరాడినది ఫూలే అని ఆయన గుర్తు చేశారు. అట్టడుగు వర్గాల స్థితిగతుల్ని గొంతెత్తి చాటినది ఫూలే అని వివరించారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాలకు చదువు చెప్పించేందుకు అవిశ్రాంత క్రిషి చేశారని శ్లాఘించారు.
       అయితే ఫూలే జయంతి సందర్బంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రసంగం మాటల గారడీ అని ధర్మాన విశ్లేషించారు. ఎన్నో తీపి కబుర్లు చెప్పిన చంద్రబాబు, చేస్తున్న పనులకు పొంతన కుదరటం లేదని తేల్చి చెప్పారు. 2015..16లో బలహీన వర్గాల నిధుల వినియోగాన్ని ఈ సందర్భంగా వివరించారు. 6, 460 కోట్లు రూపాయిలు కేటాయిస్తున్నట్లు ఘనంగా ప్రకటించుకొన్నారని, ఇందులో విడుదల చేసింది మాత్రం 4,121 కోట్లు మాత్రమే అని ఆయన చెప్పారు. రివైజ్డ్ విడుదల కు వచ్చేసరికి రూ. 3,975 కోట్లు అని, వాస్తవంగా వినియోగించింది మాత్రం 2,800 కోట్లు లేదంటే మహా అయితే 3 వేల కోట్లు మాత్రమే అని స్పష్టం చేశారు. దీన్ని బట్టి చంద్రబాబుకి బలహీన వర్గాల మీద ఉన్న ప్రేమ అర్థం అవుతోందని చెప్పారు.
       ప్రతీ కులానికి చాలా చేస్తున్నట్లు తెలుగుదేశం మ్యానిఫెస్టోలో పెట్టారని ధర్మాన గుర్తు చేశారు. ఒక్క చేనేత కులం కోసమే వెయ్యి కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని పేర్కొన్నారు. వాస్తవంగా చూస్తే మాత్రం ఇవేమీ ఆచరణ లోకి రాలేదని చెప్పారు. మత్స్యకారుల కుటుంబాలకు చాలా చేస్తామని మ్యానిఫెస్టోలో చెప్పారని, అవేమీ చేయకపోగా ఫార్మ్ కల్చర్, ఫిష్ కల్చర్ చేపట్టే కార్పొరేట్ సంస్థల్ని ప్రోత్సహిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీన్ని బట్టి చూస్తే బడుగు బలహీన వర్గాల మీద చంద్రబాబుది కపట ప్రేమ అన్న సంగతి అర్థం అవుతోందని ధర్మాన తేల్చి చెప్పారు.  

No comments:

Post a Comment