12 April 2016

రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బాబు

  • బాబు మాటలన్నీ నీటమూటలే
  • ఏపీలో ఎన్నడూ లేనంతగా సాగు, తాగునీటి ఎద్దడి
  • ప్రజల కష్టాలు పట్టని టీడీపీ సర్కార్
రాష్ట్రంలో కరువుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్ర‌దేశ్‌లో ఎప్పుడూ లేని విధంగా సాగు, తాగునీటి ఎద్ద‌డి నెల‌కొంద‌ని...ప‌శువుల‌కు తాగ‌డానికి నీళ్లు, తిన‌డానికి ప‌శుగ్రాసం సైతం కరువైందన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా అవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు. 

మొద‌టిసారి జూన్ 20న వ‌ర్షాలు ప‌డ‌డంతో రైతులు ఎక్కువ మేర పంట‌లు పండించేందుకు అస‌క్తి చూపించారని, ఆ త‌ర్వాత  వ‌ర్షాలు సరిగా ప‌డ‌క‌పోవ‌డంతో పంట‌లన్నీ ఎండుముఖం పట్టాయన్నారు. దాంతో సుమారు 50 శాతం పంట మాత్ర‌మే చేతికొచ్చింద‌ని తెలిపారు. అనంత‌రం నవంబ‌ర్‌ నెల‌లో వ‌చ్చిన సైక్లోన్ కు  గోదావ‌రి జిల్లాల్లోని పంట మొత్తం దెబ్బ‌తిందని పేర్కొన్నారు. రాయ‌ల‌సీమ జిల్లాలో వేరుశ‌న‌గ పంట 63శాతం సాగైతే అందులో స‌గానికి పైగా పంట చ‌చ్చిపోయింద‌ని, మిగ‌తా పంట సైతం అంతంత‌ మాత్రంగానే వ‌చ్చిందన్నారు. పంటలన్నీ ఎండిపోవడంతో రాష్ట్రంలో ప‌శుగ్రాసానికి తీవ్ర కొర‌త ఏర్ప‌డింద‌న్నారు. కృష్ణాడెల్టాలో పూర్తిగా భూగ‌ర్భ జ‌లాలు ప‌డిపోయి బోర్లు న‌డ‌వ‌ని దుస్థితి నెల‌కొంద‌ని, కృష్ణాన‌ది చ‌రిత్ర‌లోనే అత్యంత త‌క్కువ నీరు ఈ ఏడాదే వ‌చ్చిందన్నారు. 

అనంత‌పురం జిల్లాను కరువులేని జిల్లాగా చేస్తానన్న చంద్రబాబు మాటలు ఏమయ్యాయ‌ని ప్ర‌శ్నించారు. ఒక్క అనంత‌పురం జిల్లా నుంచే ఐదు ల‌క్ష‌ల మంది బెంగుళూరు, చెన్నై, కేర‌ళ‌కు వ‌ల‌స‌లు వెళ్లారన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి వేలాది మంది వ‌ల‌స వెళ్లిన విష‌యాల‌ను సైతం ప‌లు దిన‌ప‌త్రిక‌లు వెల్లడించాయన్నారు. రాజ‌ధానికి వెళ్లి ప్ర‌పంచ‌స్థాయి రాజ‌ధాని నిర్మిస్తాన‌ని మాట్లాడుతాడు. న‌ర‌స‌రావుపేట‌కు వెళ్లి ప్ర‌పంచ‌ంలోనే టాప్ 10లో  ఉంచుతానంటాడు. నెల్లూరుకు వెళ్లి నగరాన్ని సింగపూర్ చేస్తానంటాడు. తెనాలికి వెళ్తే సింగపూర్‌ను మించిన టౌన్‌గా తెనాలి అవుతుంద‌ని చెబుతాడు. ఆంధ్ర‌ాయూనివర్సిటీకి వెళ్తే ప్ర‌పంచ‌లోనే టాప్ యూనివ‌ర్సిటీని చేస్తాన‌ంటాడు.  ఏఎండకు ఆ గొడుగు పడుతూ ప్ర‌తిసారి ప్ర‌పంచం పేరు చెప్ప‌డ‌ం త‌ప్ప బాబు చేసిందేమీ లేద‌ని ఎద్దేవా చేశారు.  

అనంత‌పురం జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందింద‌ని సీఎం మాట్లాడుతున్నారని...మరి అలా జరిగి ఉంటే లక్షలాది మంది ఎందుకు వ‌ల‌స‌లు వెళ్లార‌ని నిల‌దీశారు. రైతుల‌కు రూ. 1100 కోట్లు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించాల్సి ఉండగా...తనకేం సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ చెల్లిస్తుందని చంద్రబాబు చెప్ప‌డం హాస్య‌ాస్ప‌ద‌మ‌న్నారు. పంటనష్టం తాలుకూ నిధులను రాబట్టేందుకు బాబు ఎందుకు వెనకాడుతున్నారని,  కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల వేతనాలు పెంచేందుకు డబ్బులుంటాయి గానీ, పరిహారం చెల్లించేందుకు మాత్రం డబ్బులుండవా బాబు అని నిలదీశారు. ప‌ట్టిసీమ‌, రాజ‌ధానితో రాయ‌ల‌సీమ‌ను స‌స్య‌శామ‌లం చేస్తామ‌ని చెప్ప‌డ‌మే త‌ప్ప....బాబు చేసిందేమీ లేదన్నారు. 

తెలంగాణ ప్ర‌భుత్వం క‌రువు ప‌రిస్థితుల‌ దృష్ట్యా సాగు, తాగునీటి ప్రాజెక్టుల‌పై ప్ర‌త్యేక దృష్టిసారించి... రూ. 30వేల కోట్ల టెండ‌ర్లు పిలిచింద‌న్నారు. అదే చంద్ర‌బాబు క‌రువుపై ఎటువంటి శ్రద్ధ వ‌హించ‌డం లేద‌ని విమ‌ర్శించారు. పాల‌మూరు రైతు ముద్ర ప‌థ‌కం ద్వారా రాయ‌ల‌సీమ ఘోరంగా దెబ్బ‌తిన‌బోతుంద‌న్నారు.  రైతుల‌కు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ స‌బ్సిడీ చెల్లించడం లేదు. పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర  కల్పించడం లేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. స్వామినాథన్ క‌మిటీ సిఫార్సులు అమ‌లు చేస్తామ‌న్న బాబుమాట‌ల‌న్నీ నీటిముట‌లుగానే మిగిలిపోయాయ‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ సైతం ఉత్ప‌త్తిపై 50శాతం వ్య‌యం అద‌నంగా చెల్లిస్తామ‌న్నార‌ని గుర్తు చేశారు. 

తెలంగాణ రాష్ట్రం చేప‌ట్ట‌బోయే ఇరిగేష‌న్ ప్రాజెక్టుల వ‌ల్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంతో న‌ష్ట‌పోతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. తెలంగాణ‌లో కూర‌గాయల పంట‌కు ల‌క్ష రూపాయ‌లు మంజూరు చేస్తున్నార‌ని... మ‌రి చంద్ర‌బాబు ఏ మేర రైతుల‌కు ల‌బ్ది చేకూరుస్తున్నారో చెప్పాలన్నారు. చంద్ర‌బాబు కేవ‌లం టీడీపీకి మాత్ర‌మే సీఎంగా వ్య‌వ‌హరిస్తున్నార‌ని... అది స‌రైంది కాదన్నారు. ఏపీ మొత్తానికి సీఎం అన్న విష‌యం గుర్తు పెట్టుకోవాల‌ని సూచించారు. 

No comments:

Post a Comment