24 October 2017

విద్యారంగంలో ప్రైవేటు పెత్తనం

చంద్రబాబు పాలన అంతా వ్యాపార మయం. ప్రతిదీ ప్రైవేటైజ్ చేయడమే చంద్రబాబు పాలనా పద్దతి. ఇప్పుడే కాదు మునుపు తొమ్మిదేళ్ల పాలన కూడా ఇలాగే అడ్డగోలుగా సాగించాడు చంద్రబాబు. అయితే ఈ ప్రైవేటుపై ప్రేమ చంద్రబాబుకు ఎందుకు అంటే కోరుకున్న ముడుపులు పుచ్చుకునేందుకు లేదా, సొంత మనుషులకు ప్రయోజనాలు కల్పించేందుకు అని ఇట్టే అర్థం అవుతుంది. ఒక పక్క టీచర్లు, లెక్చరర్ల నియామకాలు తొక్కిపెట్టి, కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగులను నియమించడం అందులో భాగమే. ప్రభుత్వ రంగ సంస్థల్లోని వేలాది పోస్టులను కూడా కాంట్రాక్టు పద్ధతిలోకి బదలాయించడం, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లడమే. ఇది చాలక ప్రాధమిక రంగమైన విద్యారంగాన్ని కూడా వీలైనంతగా నిర్వీర్యం చేసే పనిలో ఉంది చంద్రబాబు ప్రభుత్వం. 

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు సంస్థల పాఠాలు ప్రవేశపెట్టి విద్యార్థులను, ఉపాధ్యాయులను కూడా గందరగోళానికి గురి చేస్తోంది. నాణ్యత లేని ప్రత్యేక పాఠాలకు ఆయా ప్రైవేటు కంపెనీలకు కోట్ల రూపాయిలు ధారపోస్తోంది. అవే నిధులను ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. బోధనా సామాగ్రి కొరత, ఉపాధ్యాలు కొరతతో మూతబడుతున్న స్కూళ్లకు ఈ నిధులను వినియోగిస్తే ప్రభుత్వ పాఠశాల్లలో  హాజరీ పెరుగుతుంది. కనీస సౌకర్యాలు లేని బళ్లు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. వాటిని బాగు చేయడం, లోటుపాట్లు సరిచేయడం మాని, కోట్లాది రూపాయిల ప్రజాధనాన్ని, విద్యా సంక్షేమానికి ఉపయోగించాల్సిన నిధులను ప్రైవేటు సంస్థలకు మళ్లిస్తోంది టిడిపి సర్కార్. ఇది విద్యార్థుల భవిష్యత్తును చేజేతులా నాశనం చేయడమే అంటున్నారు అధ్యాపకులు. ప్రభుత్వం చేసే ఇలాంటి దుర్మార్గాలను, తుగ్లక్ చర్యలను విద్యాశాఖ కనీసం ప్రశ్నించపోవడం దురదృష్టకరం అంటున్నారు. 

ఈషా ఫౌండేషన్స్ క్లాసులు, రివర్ ఫౌండేషన్ ఆనందలహరి,నారాయణ విద్యాసంస్థల ఫౌండేషన్ కోర్సుల పేరుతో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు గుత్తాధిపత్యంలోకి నెమ్మదిగా తోస్తున్న ఈ తంతును చూసి విద్యారంగ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వ సంస్థలనుటీడీపీ సర్కార్ ఇలా ప్రైవేటు పరం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. . 

No comments:

Post a Comment