27 April 2015

భూదాహం తీరనిది!


 పేద రైతుల నుంచి బలవంతంగా సమీకరణ
 రాజధాని కోసం ఇప్పటికే 30వేల ఎకరాలు లాక్కున్నారు
 టూరిజం పేరుతో మరో 10వేల ఎకరాల సేకరణకు నిర్ణయం
 ఉద్యోగుల క్వార్టర్ల కోసం ఇంకా పూలింగ్..

 హైదరాబాద్ ః సామదానభేద దండోపాయాలతో రైతులను భయభ్రాంతులకు గురిచేసి రాజధాని పేరుతో 30 వేల ఎకరాలను బలవంతంగా సమీకరించిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వ భూ దాహం ఇంకా తీరినట్లు లేదు. టూరిజం అభివృద్ధి చేసే పేరుతో మరో 10 వేల ఎకరాలను సమీకరించడానికి ప్రభుత్వం సిద్ధమవుతుండడంతో కృష్ణాజిల్లాలోని రైతులు ఆందోళనతో ఉన్నారు. ఇప్పటి వరకు కృష్ణానదికి దక్షిణం వైపున గుంటూరు జిల్లాలోని పలు మండలాల్లో రాజధాని కోసం ప్రభుత్వం భూ సమీకరణ చేసింది. ఇపుడు టూరిజం అభివృద్ధి పేరుతో కృష్ణాజిల్లాలో కూడా భూములు సమీకరించడానికి సిద్ధమవుతోంది. కృష్ణానదికి ఉత్తరం వైపున పదివేల ఎకరాలను సేకరించనున్నామని రాష్ర్ట మున్సిపల్ మంత్రి పి. నారాయణ చేసిన ప్రకటన కృష్ణా రైతుల్లో గుబులు రేపుతోంది. ఈ పది వేల ఎకరాలే కాక కృష్ణా జిల్లాలోని కంచికచర్ల, నందిగామ ప్రాంతాల్లో కూడా మరికొంత భూమిని సమీకరించాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు.
 ఆందోళనలో కంచికచర్ల, నందిగామ రైతులు
 రాజధాని ఉద్యోగులకు క్వార్టర్లు నిర్మించేందుకు కంచికచర్ల, నందిగామ ప్రాంతాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రాజధానికోసం 30 వేల ఎకరాలను సేకరించి మరలా ఇపుడు ఉద్యోగుల క్వార్టర్ల పేరుతో మరో చోట భూ సమీకరణకు పూనుకోవడంపై రైతులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. రాజధానికి దగ్గరి ప్రాంతం కావడంతో కంచికచర్ల, నందిగామ ప్రాంతంలో భూమి మంచి రేటు పలుకుతోందని అక్కడి వారు ఆనందంగా ఉన్నారు. అయితే ఇపుడు రాష్ర్ట ప్రభుత్వం చేసిన ప్రకటన వారికి పిడుగుపాటులా మారింది. రాజధాని నుంచి కృష్ణానది మీదుగా వారధులు నిర్మించనుండడంతో అక్కడి నుంచి కంచికచర్ల, నందిగామ ప్రాంతాలకు వెళ్లిరావడం తేలిగ్గా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ల్యాండ్ పూలింగ్‌కు తమ భూములు కూడా బలి కానున్నాయని తెలియడంతో ఈ రెండు ప్రాంతాల రైతులు ఇపుడు తీవ్ర ఆందోళనతో ఉన్నారు.
 విజయవాడకూ పొంచి ఉన్న ప్రమాదం
      ఇవేకాక విజయవాడ నగరంలోని, చుట్టుపక్కల భూములను కూడా చంద్రబాబు సర్కారు సమీకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. రాజధాని పరిధి ఇప్పటి వరకు 225 చ.కి.మీగా ఉంది. దీనిని 375 కిలోమీటర్లకు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించడాన్ని బట్టి చాలా ప్రాంతాలకు ఇది విస్తరించే అవకాశం ఉంది. కొత్తగా క్యాపిటల్ సిటీ డెవలప్ మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కమిటీ (సీసీడీఎంసీ)ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిని బట్టి విజయవాడ నగరంలోనూ, చుట్టుపక్కల కొన్ని భూములను సమీకరించే లేదా సేకరించే అవకాశం ఉందని పరిశీలకులంటున్నారు. ఇప్పటికే కార్పొరేషన్‌కు చెందిన ఖాళీ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి... ఏ ప్రాంతంలో సమీకరణకు భూములు  అనువుగా ఉన్నాయి... వంటి వివరాలు సేకరించే పనిలో సీఆర్‌డీఏ అధికారులు ఉన్నారని సమాచారం.
 రెండు లక్షల ఎకరాలు లాక్కుంటారు...!
      నిజానికి  భూదాహం ఇక్కడితో కూడా ఆగేలా లేదు. ఇటీవల చైనా పర్యటన సందర్భంగా అక్కడి కార్పొరేట్ కంపెనీలను మన రాష్ట్రానికి ఆహ్వానిస్తూ.... రాష్ర్టంలో రెండు లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉందని, అన్ని అనుమతులూ ఇప్పించే బాధ్యత తాను తీసుకుంటానని చంద్రబాబు ప్రకటించారు. అంటే రాజధానితో ముడిపడి ఉన్న రెండు జిల్లాల్లోనూ బాబుగారు రెండు లక్షల ఎకరాలు సేకరించి ఉంచుతారన్నమాట. వాటిని కార్పొరేట్ కంపెనీలకు, తన మాట ప్రకారం నడుచుకునే బినామీ కంపెనీలకు కట్టబెడతారన్నమాట.






No comments:

Post a Comment