10 August 2015

జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టు

 పార్లమెంటు స్ట్రీట్ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
 మార్చ్‌ఫాస్ట్‌ను అడ్డుకున్న పోలీసులు.. లాఠీచార్జ్
 పార్లమెంటువైపు మార్చ్‌ఫాస్ట్‌గా కదలివెళుతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ శ్రేణులను ఢిల్లీ పోలీసులు అడ్డుకుని లాఠీచార్జ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురు నాయకులను అరెస్టు చేశారు. అనంతరం వారిని పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరును నిరసిస్తూ స్టేషన్ బయట రోడ్డుపైనే జగన్ బైఠాయించారు. విచక్షణారహితంగా కొట్టడంతో కడప జిల్లాకు చెందిన రైతువిభాగం నాయకుడు ప్రసాదరెడ్డి తలకు గాయమైంది. తాము శాంతియుతంగానే ముందుకు కదులుతున్నా పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారని ప్రసాదరెడ్డి చెప్పారు. పక్కకు ఈడ్చేశారని, ఇష్టానుసారం లాఠీలతో కొట్టారని ఆయన మీడియాకు వివరించారు. అంతకుముందు జంతర్‌మంతర్ వద్ద పెద్ద ఎత్తున బలగాలను మోహరించిన పోలీసులు కార్యక్రమాన్ని విరమించాలని జగన్‌ను కోరారు. పార్లమెంటువైపు మార్చ్‌ఫాస్ట్ వద్దని జగన్‌కు సూచించారు. ఎలాగైనా పార్లమెంటువైపు మార్చ్‌ఫాస్ట్ జరపాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు ఎలాగైనా వారిని అడ్డుకోవాలని ఢిల్లీ పోలీసుల యత్నం.. వెరసి పార్టీ కార్యకర్తలకు, ఢిల్లీ పోలీసులకు మద్య తోపులాటకు దారితీసింది. వైఎస్ జగన్‌ను ముందుకు కదలనీయకుండా పోలీసులు ఆయన చుట్టూ మోహరించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ శ్రేణులు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఎక్కడికక్కడ ఢిల్లీ పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాలు కట్టడి చేశాయి. భారీ బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసిన భద్రతా దళాలు... వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులను నిలువరించాయి. దీంతో జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది.

No comments:

Post a Comment