16 June 2015

ఆంధ్రలో మీడియాకు సంకెళ్లు

 హైదరాబాద్ : కొంతకాలం క్రితం టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించినపుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వీధుల్లో వీరంగం వేశారు. మీడియా స్వేచ్ఛకు తానే పెద్ద ఛాంపియన్ అన్నట్లు పోజు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రానికి కంప్లయింట్ చేసివచ్చారు. అలాంటి చంద్రబాబు ఎన్‌టీవీపై నిషేధం విధించి ఇపుడు తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారు.
  ఎన్‌టీవీ న్యూస్ ఛానల్‌పై ఆంధ్రప్రదేశ్‌లో నిషేధం విధించిన చంద్రబాబు నాయుడు మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేశారు. ఓటుకు నోటు కేసులో తమకు వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తున్నదన్న దుగ్ధతో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీవీ ప్రసారాలను నిలిపేశారు. రాష్ర్టంలోని 13 జిల్లాలలో కేబుల్ ఆపరేటర్లు ఎన్‌టీవీ ప్రసారాలను ఆపేశారు. శనివారం ఉదయం నుంచే చాలా జిల్లాల్లో ప్రసారాలు నిలిచిపోయాయి. ముందుగా పట్టణ ప్రాంతాలలో ప్రసారాలు ఆగిపోయాయి. ఆ తర్వాత గ్రామాల్లోనూ ఎన్‌టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి.  కేవలం డిష్ టీవీలలో మాత్రమే ఈ చానల్ ప్రసారాలు కనిపిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలలో 30శాతం డిష్‌టీవీలుంటాయని అంచనా. మిగిలిన వన్నీ కేబుల్ ప్రసారాలపైనే ఆధారపడి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(ఎపీజెఎఫ్), జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జెఏఏపీ)లు మీడియాకు సంకెళ్లు వేయాలన్న చంద్రబాబు వైఖరిని తీవ్రంగా ఖండించాయి. ఏదో సాంకేతిక సమస్య రావడం వల్లనే ఎన్‌టీవీ ప్రసారాలు నిలిచిపోయాయి తప్ప తమపై ప్రభుత్వం నుంచి వత్తిళ్లు రావడం వల్ల తాము ప్రసారాలు నిలిపివేశామన్న ఆరోపణలలో నిజం లేదని మల్టీ సిస్టమ్ ఆపరేటర్స్ (ఎంఎస్‌ఓలు) అసోసియేషన్ అధ్యక్షుడు పొట్లూరి సాయిబాబు అన్నారు. అయితే అది నిజం కాదని ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఎంఎస్‌ఓలపై వత్తిడి తీసుకువచ్చారని, అందుకే ఎన్‌టీవీ ప్రసారాలు ఆగిపోయాయని అంటున్నారు. ఎన్‌టీవీ ప్రసారాలను నిలిపేయకుంటే తీవ్రపరిణామాలెదురౌతాయని, భారీగా పన్నులు వేస్తామని ఎంఎస్‌ఓలను ప్రభుత్వంలోని కొందరు పెద్దలు హెచ్చరించారని వినిపిస్తోంది.
  {పముఖ పారిశ్రామికవేత్త, మైహోమ్స్ అధిపతి జూపల్లి రామేశ్వరరావు ఇటీవలే ఎన్‌టీవీలో 11శాతం వాటా కొన్నారని, ఆయన కేసీఆర్‌కు సన్నిహితుడు కాబట్టి చంద్రబాబుకు ఎన్‌టీవీపై కోపం వచ్చిందని అంటున్నారు.
  నిజానికి చంద్రబాబు తనకు వ్యతిరేకంగా ఉండే పత్రికలు, చానళ్లను అస్సలు సహించరు. సాక్షి చానల్, సాక్షి దినపత్రికలపై చాలా కాలంగా కొనసాగుతున్న నిషేధమే ఇందుకు నిదర్శనం. తెలుగుదేశం పార్టీ పత్రికా విలేకరుల సమావేశాలకు సాక్షి చానల్, సాక్షి పత్రికల ప్రతినిధులను ఇప్పటికీ అనుమతించడం లేదు. ప్రెస్ కౌన్సిల్, ఎడిటర్స్ గిల్డ్ వంటివి అభిశంసించినా చంద్రబాబుకు చీమైనా కుట్టడం లేదు. రాష్ర్ట ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు కూడా సాక్షిని తొలుత అనుమతించేవారు కాదు. అయితే కోర్టు జోక్యం తర్వాత అధికారిక కార్యక్రమాలకు, మీడియా సమావేశాలకు సాక్షిని అనుమతిస్తున్నారు. ఇపుడు ఆంధ్రప్రదేశ్‌లో సాక్షి చానల్ ప్రసారాలను కూడా నిషేధించేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారని సమాచారం. 

15 June 2015

చంద్రబాబు మాటలకు అర్థాలే వేరు..!

గొడవలు రేపే విధంగా ప్రకటనలు, ప్రచారాలు

 హైదరాబాద్: చంద్రబాబు దివాళాగోరు రాజకీయాల్లో ఆరితేరిన వ్యక్తి అని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. ఇప్పుడు ఓటుకి నోటు కుంభకోణం బయట పడ్డ దగ్గర నుంచి ఆయన ప్రవర్తన ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. ముఖ్యంగా లోతులోకి కూరుకొని పోయానన్న విషయం అర్థం అయ్యాక, ఆయన తన అసలు స్వరూపాన్ని బాగా ప్రదర్శిస్తున్నారు.

 ఆడియో సంభాషణలే అసలు మూలం
 ఈ కుంభకోణం టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టుతో బయటకు పొక్కింది. దీన్ని తాత్కాలిక అంశంగా మరుగున పరిచేందుకు తెలుగుదేశం వర్గాలు ప్రయత్నించాయి. దీంతో పాటుగా టీఆర్ ఎస్ పార్టీ మీద విమర్శలు గుప్పించి, అప్పుడు ఎదురయ్యే దాడిని ప్రచారం చేసి మ్యాటర్ ను మరుగున పరిచేందుకు ప్రయత్నించారు. ఈ దిశగా వేస్తున్న అడుగులు క్రమంగా బెడిసికొట్టాయి. సరిగ్గా వారం ఆగి చంద్రబాబు మాట్లాడిన టేపులు బయటకు రావటంతో ఒక్కసారిగా పరిస్థితి వేడెక్కింది. నోటుకి ఓటు కుంభకోణం అసలు సూత్రధారి చంద్రబాబే అని, అసలు రేవంత్‌రెడ్డిని అక్కడకు పంపించింది బాబే అని తేలిపోయింది. రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన బాస్ చంద్రబాబే అనేందుకు కావాల్సిన ఆధారం ఒక్కసారిగా బయట పడింది. దీంతోచంద్రబాబు అసహనం పరాకాష్టకు చేరింది. దీనిపై బుకాయించటానికి ప్రయత్నించి బోర్లా పడ్డారు. ఈ సంభాషణలు తనవి కావా..అవునా.. అన్న విషయం కూడా స్పష్టంగా చెప్పటం లేదు. ఈ ఆడియో టేపు ల విషయంలో ఎలా బయట పడాలా అన్న దానిపై కోటరీ పూర్తిగా ఆలోచనలో  పడిపోయింది.

 కేంద్రాన్ని ఊబిలోకి లాగే ప్రయత్నం
 కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ ఊబిలోకి లాగితే ఈ గండం నుంచి బయట పడవచ్చని చంద్రబాబు తలంచారు. వెంటనే ఢిల్లీ ప్రయాణం అయ్యారు. అక్కడ ఎక్కే గుమ్మం, దిగే గుమ్మం మాదిరిగా పెద్దల్ని కలిసి వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మొదలుకొని, సీనియర్ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాజకీయంగా ఎదురయ్యే సమీకరణాల్ని ముందుకు పెట్టి, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే కేంద్ర నిఘావర్గాల నుంచి ఢిల్లీ పెద్దలకు సమాచారం అందింది. జరిగిన విషయాలపై నివేదిక తెప్పించుకొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబును వెనకేసుకొని రావటం అంటే తప్పుల కుంపటిలో అడుగు పెట్టడమే అని అంచనాకు వచ్చారు. పూర్తిగా తప్పుచేసి వచ్చి, వేరే తప్పుల్ని ఇతరుల పైకి నెట్టే ప్రయత్నాల్ని గమనించారు. దీంతో ఈ ఎపిసోడ్ కు కేంద్రం దూరంగా జరిగింది. దీంతో కేంద్రాన్ని ఈ ఊబిలోకి లాగాలన్న చంద్రబాబు ఎత్తుగడ విఫలం అయింది.

 విద్వేషాలు రగిల్చే ప్రయత్నాలు
 ఇక చంద్రబాబు మార్కు రాజకీయాలకు తెర లేచింది. వెంటనే పచ్చ సైన్యం రంగంలోకి దిగింది. దీన్ని పూర్తిగా ఆంధ్ర, తెలంగాణ గొడవగా మార్చేందుకు కుట్రలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి చేసింది తప్పా కాదా అన్న మాట మాట్లాడటం లేదు. చంద్రబాబు ఆడియో  టేపుల్లో గొంతు ఆయనది అవునా  కాదా అన్నది చెప్పటం లేదు. తప్పు జరిగిందా లేదా అన్నది స్పష్టం చేయటం లేదు. కానీ ఇదంతా తెలంగాణ కుట్ర అంటూ రెండు రాష్ట్రాల ప్రజల మద్య చిచ్చు రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో అన్ని రకాల మార్గాల్ని వాడేస్తున్నారు. పనిలో పనిగా మొత్తం ప్రభుత్వ పెద్దల  సంభాషణల్ని రికార్డు చేశారని చెప్పుకొని వస్తున్నారు. హైదరాబాద్ లో ఉండే ఆంధ్రప్రాంత వాసులకు భద్రత కరవైందని వాపోతున్నారు. రాగల రోజుల్లో ఆంధ్రప్రాంత ప్రజలకు కష్టాలు నష్టాలు తప్పవని చెప్పుకొస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు చేసిన నేరాన్ని ప్రజల మీదకు నెట్టేసి, ప్రజలు విద్వేషాలతో రగిలిపోవాలని ఎత్తుగడ వేస్తున్నారు.

 ముందస్తు బ్లాక్ మెయిలింగ్
 చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాల మీద అనేక సార్లు విమర్శలు రేగుతున్నాయి. అధికారుల్ని బెదిరించి దారికి తెచ్చుకొనే అలవాటున్న చంద్రబాబు.. అదే ధోరణిని గవర్నర్ నరసింహన్ మీద ఉపయోగించారు. చంద్రబాబు భజనలో తరించిపోతున్న ఒక పచ్చ పత్రిక కు ఈ పని పురమాయించారు. దీంతో ఆ పత్రిక గ వర్నర్ నరసింహన్ కు వ్యతిరేకంగా కథనాలు తయారుచేసి ప్రచురించటం మొదలెట్టింది. అన్ని రకాల ఆరోపణలు, విమర్శల్ని  గవర్నర్ మీదకు ఎక్కుపెట్టింది. ఈ విధంగా బ్లాక్ మెయిల్ చేసి గవర్నర్ ను ఆ పదవిలోంచి తప్పించాలని ఎత్తుగడ వేసింది. పైగా ఆ పదవిలో తనకు సానుకూలమైన వ్యక్తిని తె ప్పించి టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ముప్పు తిప్పలు పెట్టాలని తలంచారు. అందుకే గవర్నర్ నరసింహన్ మీద రాష్ట్రంలోని ఎల్లో మీడియాలో కథనాలు వచ్చేట్లుగా చూసుకొన్నారు.

 ముంచుకొచ్చిన ముప్పు
 ఈలోగా ఓటుకి నోటు కుంభకోణం బట్టబయలు అయింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్ నరసింహన్ ఢిల్లీ కి బయలు దేరారు. ఓటుకి నోటు కేసులో వాస్తవాలు ఎలా ఉన్నాయి, విద్వేషాలు రెచ్చ గొట్టే రీతిలో ఇస్తున్న ప్రకటనలు ...మొదలైన వివరాలతో ఆయన నివేదిక  ఇచ్చినట్లు తెలుస్తోంది. లోకమంతా చంద్రబాబు దోషి అని కోడై కూస్తుండటంతో గవర్నర్ వాస్తవాలతో కూడిన నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. అటు కేంద్రప్రభుత్వం నిఘావర్గాల నుంచి తెప్పించుకొన్న సమాచారం కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించింది. దీంతో గవర్నర్ నివేదికను కేంద్రం పరిగణనలోకి తీసుకొంది. ప్రస్తుత పరిస్థితులో ఓటుకి నోటు కేసులో  కేంద్రం జోక్యం చేసుకోదని కేంద్ర న్యాయశాఖ మంత్రి స్పష్టం చేశారు.

 అత్తమీద కోపం..
 తెలుగు సామెత చెప్పినట్లు కేంద్రం మీద కోపాన్ని చంద్రబాబు..గవర్నర్‌మీద చూపుతున్నారు. రాగల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఎవరికీ సానుభూతి దక్కనీయకుండా ప్రయత్నిస్తున్నారు. టీఆర్ ఎస్ ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ఎత్తి చూపటం, దాని మీద పోరాడటాన్ని అంతా సమర్థిస్తారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని నిబంధనలకు వ్యతిరేకంగా ప్రారంభిస్తే వెంటనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ అభ్యంతరం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని మంత్రి ఉమాభారతి కి లేఖ రాశారు. కుంభకోణం నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించటం, రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగల్చటం మీద దృష్టి పెట్టిన చంద్రబాబు మాత్రం ఈ విషయాన్ని గాలికి వదిలేశారు. ప్రజల తరపున, ప్రజలకు కావాల్సిన అంశాల్ని పట్టించుకోవటం మానేసి తన స్వార్థం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టడం, పనిలో పనిగా గవర్నర్‌ను విమర్శల పాలు చేయటం చేస్తున్నారు. కొంతకాలం పాటు ఉమ్మడి గవర్నర్ పాలన తప్పనిసరి అయినప్పుడు వ్యక్తి గత స్వార్థం కోసం గవర్నర్ ను ఆంధ్రులు వ్యతిరేకిగా చిత్రించే పనులు మొదలు పెట్టారు.

 నాకూ పోలీస్ ఉంది..!
 ఇక్కడ చంద్రబాబు ఉపయోగించే భాష ను అందరూ గుర్తు పడుతున్నారు. పత్రికా విలేకరులు ప్రశ్నలు అడిగినప్పుడు ‘నాకూ ఏసీబీ ఉంది..నాకూ పోలీస్ ఉంది’ అంటూ కస్సుమన్నారు. ఇక్కడ చంద్రబాబు మార్కు పాలన ఎలా ఉంటుందో ఆయన నోటి వెంటే బయట పడింది. అవసరం అయితే ఏసీబీని కానీ, పోలీసుల్ని కానీ మరో వ్యవస్థ ను కానీ ... తన స్వార్థం కోసం వాడుకొంటానని బహిరంగంగా చెప్పుకొన్నారు. ఇప్పటికే రాష్ట్ర పోలీసులు.. తెలుగుదేశం కార్యకర్తల్ని తలపిస్తున్నారు. అనేక చోట్ల ప్రతిపక్షాల మీద దౌర్జన్యాలకు దిగటం, పచ్చ చొక్కా శ్రేణుల్ని వెనకేసుకొని రావటం జరుగుతోంది. అనంతపురం వంటి జిల్లాల్లో పచ్చ చొక్కాలతో కలిసిపోయి వైఎస్సార్‌సీపీ కార్యకర్తల్ని హతమార్చే పనిలో పోలీసుల ప్రమేయంపై వార్తలు వస్తున్నాయి. వీటిని నిర్ధారణ చేస్తున్నట్లుగా చంద్రబాబు మాట్లాడటాన్ని అంతా గుర్తు చేసుకొంటున్నారు.

 గొడవలు రేపటమే లక్ష్యమా..!
  ఈ ప్రకటనల్ని బట్టి రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని చంద్రబాబు తన గుప్పిట్లోకి తీసుకొన్నారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ప్రతీ రోజూ చంద్రబాబు .. పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సహజంగా ఒక శాఖకు చెందిన అధికారులతో సమావేశం అంటే ఆ శాఖ మంత్రిని పిలవటం ఆనవాయితీ. ఇక్కడ మాత్రం రాష్ట్రం హోమ్ మంత్రి నిమ్మకాయల చిన రాజప్ప ను ఆయన జిల్లాకు పరిమితం చేసి, చంద్రబాబు పోలీసు అధికారులతో తరచు మీటింగ్ లు పెడుతున్నారు. దీన్ని బట్టి రెండు రాష్ట్రాల్లోనూ విద్వేషాలు రగులుకొనే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. 

ఇదేమి అనుభవం బాబూ..


 ఖరీఫ్‌కి ఏర్పాట్లేవి?.... విత్తనాల కోసం అన్నదాతల అవస్థలు
 చంద్రబాబు రావాలి.. కష్టాలు తీరాలి... ఆయనొస్తున్నాడు... మన బాధలన్నీ మాయం చేస్తాడు.. బీదాబిక్కీతో ఇలాంటి మాటలు చెప్పిస్తూ ఎన్నికల ముందు తెలుగుదేశం అధినాయకుడు టీవీల్లో ఎన్నో ప్రకటనలు ప్రచారం చేయించాడు.. ‘‘నాకు అనుభవం ఉంది.. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ...’’ స్వయంగా చంద్రబాబు కూడా ప్రచారంలో ఊదరగొట్టాడు... ఎలాగైతేనేం ‘అనుభవజ్ఞుడైన చంద్రబాబు’ పీఠమెక్కాడు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల కష్టాలు తీరలేదు సరికదా... రెట్టింపయ్యాయి. అన్ని వర్గాల ప్రజలదీ అదేమాట.
  ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభం కావడంతోనే అన్నదాతల కష్టాలు కూడా రెట్టింపయ్యాయి. విత్తనాల కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఏటా ఖరీఫ్ సీజన్‌కు ముందు అధికారులతో సమావేశాలు జరిపి అన్ని రకాల ఏర్పాట్లు చేయాల్సిన ముఖ్యమంత్రి అవినీతి ఆరోపణలలో కూరుకుపోయి  బైటపడే మార్గాల కోసం ప్రతిరోజూ పోలీసు, నిఘా విభాగ అధికారులతో సమావేశాలలో తలమునకలుగా ఉన్నాడు.
  వేరుశనగ విత్తనాల కోసం అనంతపురం జిల్లా అట్టుడికిపోతోంది. విత్తనకాయలు అందక అమడగూరులో ఎంపీడీవో కార్యాలయంపై రైతులు రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించారు. ఉరవకొండలోనూ మధ్యాహ్నం 12 గంటలకే కౌంటర్లు మూసివేయడంతో ఎండలో క్యూలో నిలబడ్డ రైతులు ఆగ్రహోదగ్రులయ్యారు. అధికారులపై తిరగబడ్డారు. గంటల తరబడి క్యూలలో నిలబడినా విత్తనాలు లేవంటూ అధికారులు చేతులెత్తేయడంతో కళ్యాణదుర్గం, నల్లచెరువు, బెళుగుప్ప మండలాల్లో రైతులు ఆందోళన చేశారు. కుందుర్పి, శెట్టూరు, కంబదూరు, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రాప్తాడు, కూడేరు, ఓడీ చెరువు, కొత్తచెరువు, గాండ్లపెంట, అనంతపురం, గుంతకల్లు, శింగనమల తదితర మండలాల్లో విత్తనకాయలు అయిపోవడంతో రైతులు నిరసన వ్యక్తం చేశారు.
  ఒక్క అనంతపురమే కాదు రాయలసీమ జిల్లాలన్నిటిలోనూ ఇదే పరిస్థితి.  విత్తనాల కోసం అన్నదాతలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఏటా ఎన్ని విత్తనాలు అవసరమౌతాయో నిర్ణయించి వాటిని సేకరించి రైతులకు అందుబాటులో ఉంచాల్సిన రాష్ర్ట ప్రభుత్వ చేతకానితనం ఇది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించబట్టే ఈరోజు రైతులు ఎండల్లో చాంతాడంత క్యూలలో నిలబడి ఉసూరుమంటూ తిరిగి వెళుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో ఈ ఖరీఫ్ సీజన్‌లో 4.55 లక్షల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలు అవసరమౌతాయని అంచనా. కానీ ఇప్పటి వరకు రాష్ర్ట ప్రభుత్వం సరఫరా చేసింది 1.98 లక్షల క్వింటాళ్లు. మహా అయితే మరో 45 వేల క్వింటాళ్లు మాత్రమే సేకరించి అందించగలమని అధికారులంటున్నారు. అంటే మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి? సగం మంది కైనా విత్తనాలు అందించలేని చంద్రబాబు అనుభవాన్ని ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. తమ జీవితాలను గాలికొదిలేసిన ఈ ప్రభుత్వం మట్టిగొట్టుకుని పోతుందంటూరైతులు శాపనార్థాలు పెడుతున్నారు.

13 June 2015

బాలాయపల్లి భూములు ఎవరివి బాబూ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవినీతి కుంభకోణాలకు అంతేలేదు. ఇపుడు ‘ఓటుకు కోట్లు’ కుంభకోణంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇదే కాదు చంద్రబాబు సర్కారు ఏడాది కాలంలో అనేక కుంభకోణాలకు పాల్పడినట్లుగా ఆరోపణలున్నాయి. అయితే బాబుగారి కుంభకోణాల ఘనకీర్తిని 2001లోనే తెహల్కా బైటపెట్టింది. దేశంలోకెల్లా చంద్రబాబు అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి అని కితాబులిచ్చింది. అపుడు తెహల్కా బైటపెట్టిన బాబు ఆస్తుల్లో నెల్లూరు జిల్లా బాలాయపల్లి భూములు కూడా ఉన్నాయి. బాలాయపల్లిలో దాదాపు 300 ఎకరాల తోటలు చంద్రబాబుకు ఉన్నాయని తెహల్కా పేర్కొంది. వాటిపై ఆ మధ్య ససాక్ష్యంగా సాక్షి దినపత్రికలో ప్రత్యేక కథనాలు వస్తే ‘‘అయ్యో.. అలాంటిదేమీ లేదు... ఆ భూములకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు....’’ అని చంద్రబాబు బుకాయించారు. వాస్తవానికి ఆ భూములు చంద్రబాబు బంధువుల పేరిట ఉన్నాయి. అంటే బినామీ భూములన్నమాట. చుట్టూ కాంపౌండ్ కూడా ఏర్పాటు చేసిన ఆ భూముల్లో దళితులకు చెందిన అసైన్డ్ భూమి కూడా ఉంది. కానీ దళితులను చంద్రబాబు బంధువులు లోనికి అడుగుపెట్టనివ్వరు. చాలా ఏళ్లుగా ఈ దౌర్జన్యం కొనసాగుతోంది. సాక్షిలో కథనాల తర్వాత స్థానిక అధికారులు దళితులను లోపలికి వెళ్లేందుకు, వారి భూములు సాగు చేసుకునేందుకు అనుమతించారు. కానీ చంద్రబాబు మరలా ముఖ్యమంత్రి కావడంతో పరిస్థితి తారుమారయ్యింది. చంద్రబాబు బంధువులు దళితులను లోనికి రానివ్వడం లేదు. తోటలు సాగుచేసుకునేందుకు, పంటను కోసుకునేందుకు వెళ్లనివ్వడం లేదు. సీఎం బంధువుల మని చెబుతూ దౌర్జన్యం చేస్తున్నారంటూ దళితులు వాపోతున్నారు. బాలాయపల్లి మండలం నిండలి గ్రామంలో నారా చంద్రబాబు నాయుడుకు సర్వే నెంబర్ 139-8బి 16లో సీలింగ్ భూమి ఉంది. 2004లో ఈ భూమిని ఆ గ్రామ ఎస్సీ ఎస్టీలకు చెందిన 18 మందికి ఆర్‌సీ నెంబరు 131-2002 ప్రకారం ఒక్కొక్కరికి 0.77 సెంట్ల చొప్పున 13.86 ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. అప్పటి నుంచి ఆ భూములలో మామిడి తోటలు సాగుచేసుకుంటూ వారు అనుభవిస్తున్నారు. అయితే ఇపుడు మురళీనాయుడు, దొరస్వామినాయుడు, చిన్నప్పనాయుడు పేర్లుగల వ్యక్తులు దళితులను తోటల్లోకి రానీయకుండా అడ్డుకుంటున్నారు. మామిడి పండ్లు కోయకపోవడంతో రాలిపోతున్నాయంటూ దళితులు ఆందోళన చేస్తున్నారు.

రాజధాని రైతుల్లో గందరగోళం

రాష్ట్రమంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవితవ్యం మీద చర్చించుకొంటున్నారు. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి రైతుల నుంచి చంద్రబాబు ప్రభుత్వం భూములు లాక్కొంది. పరిహారం మాత్రం ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు అరెస్టు అయితే పరిహారం సంగతి ఏమిటి, ఎటు తిరిగి ఏమవుతుంది, హామీలు అమలవుతాయా..అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
   రాజధాని ప్రాంత రైతులు ...చంద్రబాబు అరెస్టు వ్యవహరంలో  ఏం జరుగుతుందోనని  ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఓటుకు నోటు వ్యవహారంలో  ఎటు వచ్చి ఎటు పోయినా,  తమ జీవితాలు తారుమారవుతాయనే ఆందోళన వారిలో  కనబడుతోంది. టీడీపీ నాయకులు  ఎవరు ఎదురైనా  దీనిపై ప్రశ్నలు సంధిస్తున్నారు. తెలంగాణ ఏసీబీ చంద్రబాబుకు  నోటీసులు ఇచ్చే అవకాశం ఉందా? సీఎం అరెస్టు అవుతారా?తరువాత ముఖ్యమంత్రి ఎవరు అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. కొత్త ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నిలుపుకొంటుందా..అని అడుగుతున్నారు.

 ఉత్తుత్తి హామీలు
 ఇచ్చిన హామీల్ని ఎప్పటికప్పుడు మరిచి పోవటం చంద్రబాబు నాయుడికి అలవాటు. అందుకే  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తర్వాత కాలంలో తుంగలో తొక్కారు. రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం... లేదంటే నిరుద్యోగ భృతి వంటి హామీలను గాలికి వదిలేశారు. బడుగు బలహీన వర్గాలకు కొత్త ఇళ్లు కట్టించటం మాట దేవుడెరుగు, నిర్మాణంలో ఉన్న ఇళ్లకు సైతం బిల్లులు ఎగ్గొడుతున్నారు. ప్రత్యేక హోదా ఇప్పిస్తామని చెప్పి, ఇప్పుడు ఆ ఊసెత్తటం లేదు. ఇన్ని రకాలుగా వంచించిన చంద్రబాబు, ఎన్నికల తర్వాత రాజధాని పనులు ఆగ మేఘాల మీద మొదలెట్టేశారు. సింగపూర్ సంస్థలకు దోచిపెట్టేందుకు వేలాది ఎకరాల్ని బలవంతంగా లాక్కొన్నారు. భూముల్ని లాక్కొనేటప్పుడు చాలా హామీలు గుప్పించారు.
  ఇప్పుడు ఆ హామీల పరిస్థితి ఏమిటనే దానిపై ఆందోళన నెలకొంది. తీసుకొన్న భూమిని బట్టి అంటే మెట్ట లేదా జరీబు భూముల్ని బట్టి పరిహారం ప్రకటించారు. అంటే  కౌలు డీడులు ఇచ్చి  కౌలు చెల్లిస్తామన్నారు. అంతే గాకుండా ఆగ మేఘాల మీద రుణ మాఫీలు చేస్తామన్నారు. వ్యవసాయ భూమికి తగినట్లుగా పట్టణ ప్రాంతాల్లో సైట్ లను ఎలాట్ చేస్తామన్నారు. అరచేతిలో స్వర్గం సృష్టించి అమాంతం చూపించారు.

 చంద్రబాబు డొంకతిరుగుడు
  ఏ సందర్భంలోనూ స్పష్టంగా మాట్లాడని చంద్రబాబు, ఇప్పుడూ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు ... ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన హామీలు అంటూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. వాటి మీద ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్ లో తనకు ఉన్న అనుభవం రీత్యా ఈ హామీలను నె రవేర్చ గలనని స్పష్టం చేశారు. అయినప్పటికీ, ఇప్పుడు ఆ హామీల ఊసెత్తకుండా కాలక్షేపం చేసేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది రైతులు నెత్తి నోరు కొట్టుకొంటున్నా చంద్రబాబు పట్టించుకోవటం లేదు. డ్వాక్రా మహిళలు తమ రుణమాఫీ సంగతి ఏమిటని కళ్ల నీళ్లు పెట్టుకొంటున్నా ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. అటువంటిది తమ 29 గ్రామాల్ని చంద్ర బాబు పట్టించుకొంటారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  ఇప్పుడు చంద్రబాబు అరెస్టు అయితే తర్వాత అధికార పగ్గాలు చేపట్టిన వారసులు చేతులు ఎత్తేస్తే తమ భవిష్యత్ ఏమిటని ఆందోళన చెందుతున్నారు. ఒక వేళ పనిలో పనిగా చంద్రబాబు కూడా అదే పని చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భయపడుతున్నారు. చంద్రబాబు గత వైఖరి ఇందుకు నిదర్శనం అంటున్నారు.

 తక్షణ కర్తవ్యం
  భూములు స్వాధీనం చేయని చోట్ల మాత్రం కొందరు రైతులు  ఖరీఫ్‌కు సమాయాత్తం అవుతున్నారు. ముఖ్యంగా విత్తనాలు సేకరణ, మెట్టదుక్కులు దున్నుకోవడం వంటి  పనుల్లో నిమగ్నం  అయ్యారు. ఇప్పటికే 33,347 ఎకరాల భూ సమీకరణ  చేసిన ప్రభుత్వం 22వేల  ఎకరాలకు సంబంధించిన రైతులకు  కౌలు డీడీలు పంపిణీ చేసింది.  ఆరువేల ఎకరాలకు  సంబంధించి కౌలు డీడీలు  ఇవ్వడానికి కొన్ని సమస్యలు  ఎదురవడంతో  వాటిని  పెండింగ్‌లో పెట్టారు. మిగిలిన 5వేల  ఎకరాలకు  సంబంధించి  మారిన  రాజకీయ నేపథ్యంలో  రైతులు కౌలుడీడీలు  తీసుకునేందుకు  విముఖత చూపుతున్నారు. ఓటుకు నోటులో   సీఎం పాత్ర ఉందని   రుజువైతే , రాజధాని నిర్మాణం  ఆగిపోయినట్టేనని రైతులు అంటున్నారు. దీంతో తమ భూములను తిరిగి తామే సాగుచేసు కోవాలనుకుంటున్నారు.

 ఇప్పటికే క ష్టాల కొలిమి
 భూముల్ని పూర్తిగా అప్పగించిన రైతులు మాత్రం ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి. రాగల రోజుల్లో ఎలా బతకాలి అనే దానిపై ఆందోళన చెందుతున్నారు. అటు కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారనే వార్తలు రావటంతో మిగిలిన రైతులు సైతం ఇబ్బంది పడుతున్నారు. కౌలు డీడ్‌లు తీసుకోని రైతులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అటు కూలీల పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. వ్యవసాయ కూలీల కు శిక్షణ ఇచ్చి ఇతర వృత్తుల్లోకి మళ్లిస్తామని చెప్పినప్పటికీ ఆచరణలో కనిపించటం లేదు. ఈలోగా వ్యవసాయ పనులు ప్రశ్నార్థకంగా మారాయి. దీంతో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ప్రాంతం నుంచి కూలీల వలసలు మొదలయ్యాయి. మూడు పంటలు పండుతూ కళ కళ లాడుతూ ఉండే పల్లెలు ఇప్పుడు వలస బాట పట్టాల్సి వ చ్చిందంటే దీనికి కారణం చ ంద్రబాబే అని మండిపడుతున్నారు. కొందరు మహిళలైతే తమ ఉసురు తగిలిందని, అందుకే గతంలో ఎన్ని నేరాలు, ఘోరాలు చేసినా దొరకని చంద్రబాబు, ఇప్పుడు రెడ్ హేండెడ్ గా దొరికిపోయాడని అంటున్నారు. 

మాఫీ జరగదు..... అప్పు పుట్టదు..

 అన్నదాతకు శాపంలా మారిన మాఫీ
 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన దొంగ హామీ... రుణమాఫీ అన్నదాతల పాలిట శాపంగా మారింది. ఒకవైపు ఇప్పటికే ఉన్న రుణాలు పూర్తిగా మాఫీ కాక రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పులిమీద పుట్రలా బ్యాంకులు కొత్త అప్పులకు నిరాకరిస్తున్నాయి. ఒక పాస్‌బుక్‌పై వ్యవసాయ రుణం లేదా బంగారం తాకట్టు రుణం ఇలా ఏదో ఒకటే ఇస్తారు. పైగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే రుణం మంజూరు చేయాలని ఆర్‌బీఐ నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలుండడంతో ఎక్కువ రుణం వచ్చే పరిస్థితి లేదు. ఏ కొంచెం ఎక్కువైనా ఇపుడున్న ఏడుశాతానికి బదులు 12శాతం వడ్డీ భరించాల్సిందే. గతంలో భూమి దస్తావేజులు, పాస్‌బుక్, టైటిల్ డీడ్‌లను తనఖా పెట్టుకుని రైతులకు పంట రుణాలిచ్చేవారు. పంట రుణమే కాదు ఈ పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలిస్తే బంగారు ఆభరణాలపై 7శాతం వడ్డీకే వ్యవసాయ రుణాలు కూడా మంజూరు చేసేవారు. వ్యవసాయ యంత్రాలు, పాడి, ఆక్వా తదితర వ్యవసాయానుబంధ రంగాలకు అవసరాలకు తగినట్లుగా రుణాలిచ్చేవారు. వ్యవసాయ రుణాలకు మాత్రం తొలి లక్ష రుణానికి జీరో పర్సంట్ వడ్డీ రాయితీ కింద.. ఆ తర్వాత రెండు లక్షలకు పావలా వడ్డీ రాయితీని పరిగణనలోకి తీసుకునేవారు. మిగిలిన రుణాన్ని మాత్రం ఏడుశాతం వడ్డీతోనే రైతు చెల్లించేవాడు. ఇపుడు మాత్రం రైతుకు భూమి విస్తీర్ణాన్ని బట్టి ఆ భూమిలో వేసే పంటకు సంబంధించి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు తగ్గట్టుగా రుణాలివ్వాలని ఆర్‌బీఐ స్పష్టంగా ఆదేశించింది. వరికైతే ఎకరాకు 24వేలు, చెరుకుకు 35వేల వరకు మాత్రమే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కింద రుణమిస్తారు. పైగా ఒక దస్తావేజు లేదా పట్టాదారు పాస్‌పుస్తకంపై ఒక రుణాన్ని మాత్రమే పంట రుణంగా పరిగణిస్తారు. ఆ తర్వాత బంగారు ఆభరణాలను కుదువపెట్టి భూమి డాక్యుమెంట్లపై తీసుకునే రుణాలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల కోసం ఎంత రుణం కావాలన్నా ఇస్తారు. కానీ ఆ రుణంపై మాత్రం 12శాతం వడ్డీ భరించాల్సి ఉంటుంది. దీంతో గతంలో మాదిరిగా ఎవరికి బడితే వారికి పంటరుణాలు, వ్యవసాయ రుణాలు ఇచ్చే అవకాశం లేదు. అధికారులు సిఫార్సు చేసినంత మాత్రాన కౌలు రైతులకు రుణాలిచ్చే అవకాశం కూడా లేదు. భూమి యజమాని అంగీకార పత్రం కచ్చితంగా ఉండాలి.
  ఇదంతా రుణమాఫీ సరిగా జరగని ఫలితమే. రుణమాఫీ హామీని ఎగ్గొట్టడానికి చంద్రబాబు నాయుడు ఎన్నో ఎత్తులు వేసిన ఫలితమిది. రుణమాఫీని పరిమితం చేయడానికి, లబ్దిదారులను తగ్గించడానికి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో ఎత్తుగడలు వేసింది. అందులో భాగంగానే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌ను రంగంలోకి తీసుకువచ్చారు. ఆ నిబంధన గతంలోనే ఉన్నా బ్యాంకులు రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొంచెం అటుఇటుగా రుణాలు మంజూరు చేసేవి. అయితే ఈ స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ నిబంధనను అడ్డుపెట్టుకుని ఆ మేరకే రుణాలను మాఫీ చేయడం ద్వారా భారాన్ని తగ్గించుకోవాలని చంద్రబాబు సర్కారు చూసింది. దాంతో రైతులకు కొద్దిమేరకే రుణం మాఫీ అవుతుంది. మిగిలిన భాగం బ్యాంకులకు రైతులు చెల్లించాల్సి ఉంటుంది. అలా మిగిలిపోయే మొత్తాలకు వడ్డీ కూడా జత కలుస్తుంది. ఇవన్నీ రైతుకు పెనుభారంగా పరిణమించనున్నాయి. ప్రభుత్వం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ మేరకే రుణాలను మాఫీ చేస్తుండడంతో రిజర్వు బ్యాంకు కూడా ఆ నిబంధనను కఠినంగా అమలు చేయాలని బ్యాంకులకు సూచించింది. ఎందుకంటే రైతులు కట్టలేని మిగిలిన మొత్తాలన్నీ రానిబాకీలుగా మారిపోయి బ్యాంకుల పరిస్థితి ఇబ్బందిగా మారే ప్రమాదముంటుంది. అందుకని రైతులను అడకత్తెరలో పోకచెక్కలా మార్చేశారు. అటు చంద్రబాబు ప్రభుత్వం, ఇటు బ్యాంకులు కలసి రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయి.

5 June 2015

సమర దీక్ష విజయవంతం


తరలి వచ్చిన జనం.. ఉప్పొంగిన అభిమానం..
 హైదరాబాద్ :  ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు చేసిన సమర దీక్ష విజయవంతం అయింది.  ఏడాదిపాటు పరిపాలించిన చంద్రబాబు పాలనలోని వైఫల్యాల్ని ఎండగడుతూ ఈ దీక్ష నిర్వహించటం జరిగింది. విజయవాడ - గుంటూరు మధ్యలో, ప్రతిపాదిత రాజ ధాని ప్రాంతానికి కాస్త దూరంలో మంగళగిరి వై జంక్షన్ లో ఈ దీక్ష జరిగింది.

 సమరమే నినాదం
  బుధవారం ఉదయం వైఎస్ జగన్ దీక్ష స్థలికి చేరుకొని దివంగత ముఖ్యమంత్రి,మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం సభ ను ఉద్దేశించి క్లుప్తంగా ప్రసంగించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏడాది పాలనలో ప్రజలకు ఎలాంటి మంచి జరగలేద నీ, పైగా ప్రజల్ని అన్యాయమైన పరిస్థితుల్లోకి నె ట్టివేశారని ఆయన ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు మోసాల్ని చాటి చెప్పటానికే ఈ దీక్షకు సమర దీక్ష అని నామకరణం చేశామని, ఆయనపై పోరాటానికి ఈ దీక్షను ఒక వేదికగా చేసుకొన్నామని వివరించారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమిటి.. ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏమిటి..అని సూటిగా ప్రశ్నించారు. రైతన్నలకు రుణమాఫీ, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు రుణమాఫీ, ఇంటింటికీ ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని పేరుతో బలవంతపు భూ సమీకరణ అంశాల మీద తాను దీక్ష చేస్తున్నానని ఆయన వివరించారు. ఈ దీక్ష ఎందుకు చేస్తున్నదీ ప్రజలు అందరికీ తెలుసని, తెలియని ఏకైక వ్యక్తి మాత్రం చంద్రబాబే అని ఆయన అన్నారు.

 వె ల్లువెత్తిన జన వాహిని
  మొదటి రోజు దీక్ష కు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. డ్వాక్రా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. క్లుప్తంగా చేసిన జగన్ ప్రసంగానికి హర్షాతిరేకాలు తెలిపారు. ముఖ్యంగా చంద్రబాబు మోసాల్ని జగన్ ఉదహరించినప్పుడు భారీగా స్పందన కనిపించింది. మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా యువకులు, మహిళలు, వృద్ధులు తరలి వచ్చారు. వైఎస్ జగన్ తో పాటు ఇతర నాయకుల ప్రసంగాల్ని ఆద్యంతం ఆలకించారు. చంద్రబాబు గురించి ఉదహరించి విమర్శలు చేసినప్పుడల్లా పెద్ద ఎత్తున చప్పట్లు చరిచి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు.

ప్రభుత్వ నిర్వాకం
  ప్రతిపక్ష నాయకుడు దీక్ష చేస్తున్నప్పటికీ, పోలీసులు భద్రత కల్పించనే లేదు. దీనిపై పార్టీ నాయకులు మండిపడ్డారు. ఇది సరైన విధానం కాదని గర్హించారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్న వాహనాలతో ైవె  జంక్షన్,సర్వీసు రోడ్లు నిండిపోయాయి. పార్టీ కార్యకర్తలే స్వచ్చందంగా ట్రాఫిక్ నియంత్రణ చేసుకొన్నారు. అటు సభ స్థలిలో కూడా కార్యకర్తలే వాలంటీర్లుగా ఏర్పడి సమన్వయం చేసుకొన్నారు. మొత్తం సభ ప్రాంగణంలో కార్యకర్తలు, అభిమానుల సందడి బాగా కనిపించింది. ముఖ్యంగా యువత వైఎస్ జగన్ పట్ల తమ అభిమానాన్ని చాటుకొన్నారు.  సాయంత్రం కొందరు అభిమానులు, కార్యకర్తలు వైఎస్ జగన్ ను కలిశారు. వారందరితో ఓపికగా వైఎస్ జగన్ మాట్లాడారు. వివిధ వయస్సుల వారు పెద్ద సంఖ్యలో ఆయన్ని కలిసి మనస్సులోని మాటను చెప్పుకొన్నారు.

 రెండో రోజు అదే జన ప్రభంజనం
  రెండో రోజున వైఎస్ జగన్ సమర దీక్ష ప్రాంగణం దగ్గరకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. కొందరు పోలీసులు వచ్చి ట్రాఫిక్, బందోబస్తు సమన్వయం చేశారు. అంతకంతకూ జనం రాక పెరిగిపోవటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వ చ్చింది. చుట్టు పక్కల స్థలాల్ని ఖాళీ చేయించి పార్కింగ్ సౌకర్యం కల్పించారు. విరివిగా జనం తరలి రావటంతో ప్రాంగణం అంతా కిక్కిరిసి పోయింది. ముఖ్యంగా రెండో రోజున జగన్ ను చూసేందుకు జనం పోటీ పడ్డారు. దీంతో వేదిక ముందు ప్రాంతాన్ని పదే పదే క్లియర్ చేయాల్సి వ చ్చింది.

 రాష్ట్రానికే మోసగాడు
 ప్రజల్ని రక రకాలుగా వే ధిస్తున్న చంద్రబాబు పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. ‘రాష్ట్రానికే మోసగాడు’ పేరుతో 80 పేజీల పుస్తకాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆవిష్కరించారు. మొత్తంగా 9 అంశాలుగా విభజించి పరిపాలనను విశ్లేషించారు. ఈ పుస్తకాన్ని తీసుకొనేందుకు జనం పోటీపడ్డారు. స్టాల్ ఏర్పాటు చేసిన కొద్ది గంటల్లోనే ఈ పుస్తకాలన్నీ తీసుకొని వెళ్లిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా చాలా మంది అక్కడికక్కడే పుస్తకంలోని అంశాల్ని చదువుకొని చర్చించుకోవటం కనిపించింది.

 ప్రజా బ్యాలెట్ కు విశేష స్పందన
 చంద్రబాబు నాయుడు పరిపాలన మీద వైఎస్సార్ సీపీ ఒక బ్యాలెట్ పత్రాన్ని రూపొందించింది. 100 ప్రశ్నలు ఇచ్చి జవాబులు రాయమని కోరారు. వీటిని అక్కడికక్కడ అందించేందుకు ్రపజా బ్యాలెట్ బ్యాక్సులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు పోస్టల్ ద్వారా కూడా ఈ బ్యాలెట్ పత్రాల్ని అందించేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈ బ్యాలెట్ లోని ప్రశ్నల్ని నాయకులు చదివి వినిపించినప్పుడు అక్కడికక్కడే పెద్ద ఎత్తున స్పందన వినిపించింది. ఈ బ్యాలెట్‌ద్వారా ప్రజల స్పందన ను తెలియచేయాలని నాయకులు కోరటం జరిగింది.

 ఆకర్షణీయంగా నిలిచిన డిజిటల్ మీడియా స్టాల్
 పార్టీ శ్రేణులకు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు ఇంటర్ నెట్ ద్వారా సేవలు అందిస్తున్న డిజిటల్ మీడియా ఒక స్టాల్ ఏర్పాటు చేసింది. దీని ద్వారా డిజిటల్ మీడియా సేవల్ని అందరికీ తెలియ చేశారు. వెబ్ సైట్, ఫేస్ బుక్, ట్విటర్, యూ ట్యూబ్, ఈ పేపర్, నెట్‌టీవీ అనే విభిన్న మాధ్యమాల్లోని పార్టీ పేజీల్ని తెలియ పరిచే ఫ్లెక్సీలను ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. వీటిపై ఆయా పేజీల అడ్రస్ లను పొందిపరిచారు. దీంతో పాటుగా ఆయా వివరాలు తెలిపే కార్డులను పంపిణీ చేశారు.

 గర్జించిన ప్రజా నేత
 రెండో రోజు దీక్ష ముగింపు సందర్భంగా వైఎస్ జగన్ .. రాష్ట్రంలోని చ ంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగారు. ఈ సారి ఎన్నికలోస్తే చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవని మండి పడ్డారు. ప్రజల గుండెల్లోంచి వచ్చే కోపాగ్ని కెరటం ఉవ్వెత్తున ఎగసి, ఆయనను బంగాళాఖాతంలో కలుపుతుందని విరుచుకు పడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గద్దెనెక్కిన తర్వాత ఏ రకంగా తుంగలో తొక్కారో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని , వారే చంద్రబాబుకి గట్టిగా బుద్ది చెబుతారని హెచచరించారు. ప్రజల చెవుల్లో కాలీఫ్లవర్ పువ్వులు పెట్టి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారని వైఎస్ జగన్ అన్నారు. కేంద్ర ్రపభుత్వంపై ఇప్పటికీ చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 అదే ప్రజా స్పందన
 ఈ దీక్షలో పార్టీకి చెందిన సీనియర్‌నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, కన్వీనర్లు, కోర్డినేటర్లు పాల్గొన్నారు. నాయకులు తమ ప్రసంగాల్లో చంద్రబాబు మోసాల్ని ఎండగట్టారు. అటు, చంద్రబాబు ఎన్నికల బహిరంగ సభల్లో చేసిన ప్రసంగాల్ని డి జిటల్ స్క్రీన్ మీద ప్రదర్శించారు. చివరగా మంగళగిరి శాసనసభ్యుడు రామకృష్ణా రెడ్డి, స్థానిక రైతు నాయకులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు.