23 March 2016

నెల్లూరు సభలో వైఎస్ జగన్ ఉద్వేగభరిత ప్రసంగం


  • ప్రజల్ని, దేవుడ్ని నమ్ముకొన్నా: వైఎస్ జగన్
  • ప్రజల గొంతు నొక్కాలన్నది చంద్రబాబు ప్రయత్నం
  • అందుకే ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో లాక్కొంటున్నారు
  • త్వరలోనే దేవుడు, ప్రజలు తగిన బుద్ది చెబుతారు

నెల్లూరు: ఎప్పుడూ నాయకుల్ని నమ్ముకోలేదని, ప్రజలు..దేవుడ్ని మాత్రమే నమ్ముకొన్నానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. ప్రజల చల్లటి దీవెనల సాయంతో చంద్రబాబు తో మరింత బలంగా పోరాడుతానని ఆయన అన్నారు. నెల్లూరు నగరంలోని కస్తూరి దేవి గార్డెన్స్ లో సీనియర్ నేత ఆనం విజయకుమార్ రెడ్డి, అనుచరులతో సహా వైఎస్సార్సీపీ లో చేరిన సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే..

       నెల్లూరు రూరల్ నియోజక వర్గం నుంచి ఆనం విజయన్న చేరికతో ..మొన్ననే ప్రలోభాలు, అవినీతి సొమ్ములకు ఆశపడి పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు బుద్ధి వస్తుంది. ప్రతిపక్షం అంటే ప్రజల గొంతు. చంద్రబాబు పాలనలో అవస్థలు పడుతున్న ప్రజల గొంతు. అటువంటి గొంతును నొక్కేయాలని చంద్రబాబు సర్కారు ఆరాట పడుతోంది. ప్రజల తరపున కష్టపడుతున్న వారి  గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు.  ఇతర పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను బాబు ప్రలోభ పెట్టి లాక్కొంటున్నారు. అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబుకి అర్థం కావాలి, ప్రలోభాలకు లొంగిపోయిన ఎమ్మెల్యేలకు అర్థం కావాలి.

రాజకీయాల్లో గుణం ముఖ్యం

       రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలు మన వైపు చూస్తుంటారు. అందుకే మనం రోల్ మోడల్స్ గా ఉండాలి. రాజకీయాల్లో ఉన్నవారికి రెండు గుణాలు ఉండాలి. ఒకటి క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం, రెండు క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత. రాజకీయ నాయకులకు ఈ రెండు గుణాలు ఉండాలి. ఇవి రెండూ లేకపోతే జనమే కాదు, ఆఖరికి ఇంట్లో ఉండే భార్య కూడా వెంట నిలిచే అవకాశం ఉండదు.  చంద్రబాబు నాయుడు వ్యక్తిత్వం ఎలాంటిది అంటే.. అధికారం, కుర్చీ కోసం సొంత మామ ఎన్టీయార్ నే వెన్నుపోటు పొడవటం అన్నది ఆయన వ్యక్తిత్వం. ఇక ఆయన విశ్వసనీయత ఏమిటంటే.. ఎన్నికలకు ముందు అబద్దాలు చెప్పటం, తర్వాత ప్రజల్ని మోసగించటం అన్న మాట. ఇక చంద్రబాబుకే వ్యక్తిత్వం, విశ్వసనీయత లేకపోతే ఆయన వెంట కొనుగోళ్లకు ఆశపడి వెళ్లిపోయిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడటమే అనవసరం.

భయపడేది లేదు

       ఎన్నికలకు ముందు పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకొంటే.. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చాం. అప్పుడు చూస్తే 175 స్థానాలు ఖాళీగా కనిపించాయి. నాయకులు కనిపించలేదు. అయినా భయపడలేదు. అధికారం లో ఉన్న సోనియాగాంధీని చూసి భయపడలేదు. సోనియాగాంధీతో కలిసి కుమ్మక్కై చంద్రబాబు.. నన్ను కేసుల్లో ఇరికించినప్పుడు    భయపడలేదు. ఎందుకంటే పైన ఉన్న దేవుడ్ని, ఇక్కడ ఉన్న ప్రజల్ని నమ్ముకొన్నాను కాబట్టే భయ పడలేదు. అప్పుడు ఇద్దరితో మొదలైన పార్టీ.. ఇప్పుడు 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీల స్థాయికి చేరుకొంది. దేశం మొత్తం మన వైపు చూసేట్లుగా చేయగలిగాం. ఎప్పుడూ నాయకుల్ని నమ్ముకోలేదు. ప్రజలు, దేవుడ్ని నమ్ముకొన్నాం. వాళ్లే ఆశీర్వదిస్తారు.

చంద్రబాబు చెప్పేదంతా మోసం

       వాస్తవానికి ఇటువంటప్పుడు చంద్రబాబు చేయాల్సింది తన హామీలను నిజం చేయటం మీద ద్రష్టి పెట్టాలి. ఎన్నికలకు ముందు రక రకాల అబద్దాలు చెప్పి రైతులు, డ్వాక్రా అక్క చెల్లెమ్మలు, ఆఖరికి నిరుద్యోగ యువతను మోసం చేశారు. చదువుకొనే పిల్లల్ని మోసం చేశారు. ఎన్నికలకు ముందు ఆ కులం, ఈ కులం అని చెప్పి రక రకాల కులస్తుల్ని మోసం చేసిన ఘనత చంద్రబాబుది. ఆ రోజు ఎన్నికలకు ముందు ప్రజలకు మాయ మాటలు చెప్పి మోసం చేశారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. ప్రజల్ని గాలికి వదిలేశారు. ప్రజల గొంతు వినిపించకుండా ఉండేందుకు అవినీతి డబ్బులతో, ప్రలోభాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారు.        పెద్ద పెద్ద సామ్రాజ్యాలే కుప్ప కూలాయి. హిట్లర్ వంటి నియంత  వ్యవస్థలే కూలిపోయాయి. ప్రజల కోపానికి తట్టుకోలేక చంద్రబాబు ప్రభుత్వం బంగాళాఖాతంలో పడిపోయే రోజు దగ్గరలోనే ఉంది. దేవుడు చూస్తున్నాడు, ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే చంద్రబాబుకి మొట్టికాయలు వేస్తారు. చంద్రబాబు ఆఖరికి డిపాజిట్లు కూడా దక్కించుకోకుండా పోతారు.

ప్రజల ఆశీస్సులతోనే..!

       మీ అందరి దీవెనలు, ఆశీస్సులు కావాలి.  మీ అందరి చల్లని దీవెనలు, ఆశీస్సులతో చంద్రబాబు తో మరింత పోరాటానికి సిద్ధంగా ఉన్నాను. కష్టం అనిపించినా, తొమ్మిది గంటల నుంచి వేచి ఉన్నా మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నా.      ఈ రోజునుంచి విజయ్ అన్న మా కుటుంబంలో ఒకరుగా ఉంటారు. ఆయన్ని మా కుటుంబలోని వ్యక్తిగా చూసుకొంటాం.

 అని వైఎస్ జగన్ ఆత్మీయపూర్వకంగా ప్రసంగించారు.

22 March 2016

శనగ రైతుల్ని ఆదుకోండి: వైఎస్ జగన్

  • బీమా సొమ్ము కోసం రైతుల ఎదురు చూపులు
  • కుంటిసాకులతో వేల మందికి అన్యాయం
  • శనగ రైతుల సమస్యల్ని ప్రస్తావించిన జన నేత వైఎస్ జగన్

హైదరాబాద్: సమస్యల్లో ఉన్న శనగ రైతుల్ని ఆదుకోవాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ విన్నవించారు. వైఎస్సార్ జిల్లాలో బీమా సొమ్ములు అందక అవస్థలు పడుతున్నారని వివరించారు. అసెంబ్లీ లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం సందర్భంగా వైఎస్ జగన్  ఈ సమస్యను ప్రస్తావించారు.
      2012 వ సంవత్సరానికి గాను రబీ సీజన్ లో రైతులు పంటను నష్టపోయారని వివరించారు. ఈ సొమ్ము 2013 లో అందాల్సి ఉందని, కానీ ఇప్పటికీ బీమా సొమ్ములకోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. మొత్తం 56 వేల మంది రైతులకు బీమా సొమ్ము అందాల్సి ఉందని వివరించారు. దీని గురించి అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మీద ఒత్తిడి చేస్తే చివరకు ఇటీవల కొంత మేర నిధులు విడుదల చేశారని చెప్పారు. 29వేల మంది రైతులకు మాత్రమే విడుదల చేశారని వివరించారు. మిగిలిన రైతులకు సంబంధించి దరఖాస్తుల్లో లోపాలు ఉన్నాయని అంటున్నారని, అటువంటి సమస్యలు ఉంటే అప్పుడే చెప్పి ఉంటే బాగుండేదని పేర్కొన్నారు. ఇప్పుడు దరఖాస్తుల్లో లోపాలు అంటే రైతులు అల్లాడిపోతున్నారని చెప్పారు.
      తీరా చేస్తే 29వేల మంది రైతులకు గాను రూ.132 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, రూ. 95 కోట్లు మాత్రమే  విడుదల చేశారని చెప్పారు. అటువంటప్పుడు ఈ నిధులు ఏ మూలకు సరిపోతాయని నిలదీశారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి వైఎస్ జగన్ సూచించారు. 

21 March 2016

ప్రతిపక్షంపై టీడీపీ కక్షసాధింపు

హైదరాబాద్ః  లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ సీఎల్పీ సమావేశం జరిగింది.  వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఈసమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. సమావేశానికి ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ...టీడీపీ సర్కార్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అధికారమదంతో అహంకారపూరితంగా వ్యవహరిస్తూ, ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మేకా ప్రతాప్ అప్పారావు( నూజివీడు ఎమ్మెల్యే)
ఒక మ‌హిళ ప‌ట్ల ప్రభుత్వం ఇలాంటి చ‌ర్య‌ల‌కు పూనుకోవ‌డం దుర‌దృష్ట‌క‌రమ‌ని ఎమ్మెల్యే మేక‌ప్ర‌తాప్ అప్ప‌ారావు అన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ తీరు దారుణంగా ఉందని ఫైరయ్యారు. కోర్టు ఉత్త‌ర్వులు ప‌ట్టుకొని అసెంబ్లీకి వ‌చ్చినా...రోజాను సభలోకి అనుమతించకపోవడం దుర్మార్గమన్నారు. మహానేత వైఎస్సార్ ప్రతిదాన్ని ఎంతో స్పోర్టివ్ గా తీసుకునే వారని...కానీ, ఈప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ విష‌యంపై తమ అధినేత వైఎస్ జగన్ తో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు.   అధికారపార్టీ నేతలు ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిని పట్టుకొని కొవ్వెక్కిందని, అసెంబ్లీలోనే పాతేస్తామ‌ని ...ఎన్నిసార్లు రెచ్చ‌గొట్టే వ్యాఖ్యలు చేసినా వైఎస్ జగన్  ఎంతో ఓర్పుతో స‌భ సంప్ర‌దాయాల‌ను పాటించి మౌనంగా ఉన్నారని అప్పారావు తెలిపారు. ప్రజాసమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్షాన్ని  టీడీపీ  అణ‌గ‌దొక్కాల‌ని చూస్తోందని,  ఇది స‌రైన పద్ధతి కాదని హితవు పలికారు. ఇప్ప‌టికైనా టీడీపీ తన వైఖరి మార్చుకోవాలని హితవు పలికారు. 

రక్షణనిధి (తిరువూరు ఎమ్మెల్యే)
ప్రభుత్వ అవినీతి, అక్రమాలను నిలదీస్తున్న ప్రతిపక్ష సభ్యులపై ప్రభుత్వం కక్షసాధింపుకు పాల్పడుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రక్షణనిధి మండిపడ్డారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ పై ప్రభుత్వ అరాచకాలను నిలదీసినందుకే రోజాను అకారణంగా సస్పెండ్ చేశారన్నారు.  ప్రభుత్వం తమ వైఫల్యాలను  ప్రజల్లోకి వెళ్లకుండా చేయాలన్న ఉద్దేశ్యంతోనే... ప్రతిపక్ష సభ్యులను అసెంబ్లీలో లేకుండా చేయాలని కక్షపూరిత చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, రోజా ధైర్యంగా కోర్టుకెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నారని చెప్పారు. కోర్టుల కన్నా తామే సుప్రీం అంటూ ప్రభుత్వం రోజాను సభలోకి అనుమతించకపోవడం దారుణమన్నారు. కోర్టులో రోజాకు న్యాయం జరుగుతుందని, ఆమెకు అండగా తాము పోరాటం కొనసాగిస్తామని రక్షణనిధి స్పష్టం చేశారు. 

విశ్వేశ్వర్ రెడ్డి( ఉరవకొండ ఎమ్మెల్యే)
టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి ప్రతిపక్షం గొంతు నొక్కాలన్న ధోరణితోనే ముందుకు పోతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించిన ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. ప్రభుత్వం తాను చేసిన  తప్పులను సరిదిద్దుకోకుండా శాసనసభ వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు మధ్య తగాదా పెట్టేవిధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రూల్ 340(2) ప్రకారం రోజాను సస్పెండ్ చేసే అధికారం సభకు లేదని తమ అధ్యక్షులు వైఎస్ జగన్ చెప్పినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని, మాకు మాత్రమే రూల్స్ తెలుసంటూ అధికారాన్ని అడ్డంపెట్టుకొని అంహకూరపూరితంగా వ్యవహరించిందని విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. హైకోర్టు స్టేను సైతం ఏమాత్రం గౌరవించకుండా ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

గిడ్డి ఈశ్వరి( పాడేరు ఎమ్మెల్యే)
రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసే అధికారం స్పీకర్ కు లేదని, సభలో జరిగిన సంఘటనలపై స్పీకర్ కు ఓ సెషన్ మాత్రమే సస్పెండ్ చేసే అధికారం ఉంటుందని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. రోజా తన హక్కులకు భంగం కలిగిందనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లి న్యాయం పోరాటం చేశారన్నారు. హైకోర్టు విచారణ చేపట్టి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా కూడా..రోజాను సభలోకి అనుమతించకపోవడం మహిళలను కించపర్చడమేనన్నారు. ప్రభుత్వం, స్పీకర్ వ్యవహరించిన తీరు సిగ్గుచేటన్నారు. టీడీపీ, బీజేపీ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలంతా గమనిస్తున్నారని ఈశ్వరి పేర్కొన్నారు.  ఇక ప్రివిలేజ్ కమిటీ తీసుకున్న నిర్ణయం దారుణంగా ఉందని ఈశ్వరి మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే అనిత చెప్పిన దాన్నే యాక్సెప్ట్ చేస్తున్నారని ఫైరయ్యారు. గతంలో తాము మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని, గోరంట్ల, ఎమ్మెల్యే బోండా ఉమ తదితరులపై  ప్రివిలేజ్ కమిటీలో ఫిర్యాదు చేస్తే దానిపై ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. టీడీపీ వాళ్ల దగ్గరకు వచ్చేసరికి క్షమాపణ, మాదగ్గరికొచ్చే సరికి శిక్షనా..?  ఇదెక్కడి న్యాయమని ఈశ్వరి  ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారపార్టీ అహంకారపూరిత చర్యల్ని ఖండిస్తున్నామన్నారు.  ప్రజావ్యవస్థను, న్యాయవ్యవస్థను గౌరవిస్తూ న్యాయపోరాంట కొసాగిస్తామని ఈశ్వరి తేల్చిచెప్పారు.  

19 March 2016

ప్రజలారా టీడీపీ దుర్మార్గపు పాలనను గ్రహించండి

  • టీడీపీ ఆంధ్రప్రదేశ్ ను ఆఫ్ఘనిస్తాన్ లా ..
  • ప్రజాస్వామ్య దేశాన్ని పాకిస్తాన్ లా మారుస్తోంది
  • కోర్టు తీర్పు అనుకూలంగా ఉంటే గౌరవిస్తాం..
  • వ్యతిరేకంగా వస్తే లెక్కచేయమనట్లు వ్యవహరిస్తోంది
  • న్యాయస్థానం తీర్పును అమలు చేయకపోవడం చట్టవ్యతిరేకం
  • ప్రజలు బాబు రెండు చెంపలు వాయించడం ఖాయంఃచెవిరెడ్డి

హైదరాబాద్ః న్యాయస్థానాల కన్నా మా తీర్పే అంతిమమంటూ ప్రభుత్వం తల బిరుసుతనం ప్రదర్శిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. న్యాయ‌స్థానాల తీర్పు మా తీర్పు ముందు నిల‌బ‌డ‌వని మాట్లాడతున్న అధికారపక్షం...కోర్టుకు ఎందుకు వెళ్లిందని చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి నిల‌దీశారు. కోర్టు తీర్పుపై గౌర‌వం లేన‌ప్పుడు కౌంట‌ర్‌ దాఖ‌లు చేయ‌కుండా ఉండాల‌ని, డివిజ‌న్ బెంచ్ కి ఎందుకు వెళ్తున్నార‌ని ప్ర‌శ్నించారు. కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే గౌరవిస్తాం, లేకుంటే లెక్కచేయమన్న రీతిలో టీడీపీ తీరు ఉందని దుయ్యబట్టారు.  

జైలు కెళ్ల‌క త‌ప్ప‌దు..
కోర్టు తీర్పుకు వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తిస్తున్న చీఫ్ మార్ష‌ల్‌, అసెంబ్లీ సెక్ర‌ట‌రీలిద్ద‌రు జైలుకు వెళ్ల‌డం త‌ప్ప‌ద‌న్నారు. కోర్టు తీర్పును ధిక్క‌రిస్తే త‌దుప‌రి ప‌రిణామాలు ఎలా ఉంటాయో చీఫ్ మార్ష‌ల్‌, అసెంబ్లీ సెక్ర‌ట‌రీలు చూడ‌బోతున్నార‌న్నారు. దీనిపై అసెంబ్లీలో మాట్లాడుకోవచ్చు కదా అంటూ టీడీపీ ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యానించడంపై  చెవిరెడ్డి చురక అంటించారు. తమకు మైక్ ఇవ్వకుండా కట్ చేస్తుంటే ఎలా మాట్లాడుతారని, మైక్ ఇంటికి తీసుకెళ్లి మాట్లాడాలా అంటూ విరుచుకుపడ్డారు.  

ప్రజాపోరాటం కొనసాగిస్తాం..
టీడీపీ ఏవిధంగా న్యాయ‌స్థానం తీర్పును గౌర‌వించ‌డం లేదో... ఎలా ప్రజావ్య‌తిరేక పాల‌న చేస్తున్నారో... ఇచ్చిన హామీల‌ను ఎలా తుంగ‌లో తొక్కుతున్నారో... ఏర‌కంగా ప్ర‌జాభిమానానికి విలువనివ్వ‌డం లేదో... ఏవిధంగా అసెంబ్లీలో రూల్ 71ను ర‌ద్దు చేశారో దానిపై ప్ర‌జాపోరాటం కొన‌సాగుతుంద‌ని చెవిరెడ్డి బాస్క‌ర‌రెడ్డి తేల్చిచెప్పారు.  ఏ రూల్ అయినా రాజ్యాంగానికి లోబ‌డే అమ‌లవుతాయే త‌ప్ప‌, రాజ్యాంగానికి వ్య‌తిరేకంగా అమ‌లు కావ‌ని తెలిపారు. ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌తి దుశ్చ‌ర్య‌ను కోర్టు ద్వారా మేము ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్తున్నామ‌ని వివ‌రించారు. ప్ర‌జ‌ల‌కు మీడియా ద్వారా తామొక్క‌టే విజ్ఞ‌ప్తి చేస్తున్నామ‌ని ...టీడీపీ దుర్మార్గ‌పు పాల‌న‌, దుశ్చ‌ర్య పాల‌న‌, దుశ్సాసన పాల‌న‌ను గ‌మ‌నించాల‌ని కోరారు. 

ఆఫ్ఘనిస్తాన్ లా ఆంధ్రప్రదేశ్..
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను ఆఫ్ఘానిస్తాన్‌గా, ప్ర‌జాస్వామ్య దేశాన్ని పాకిస్తాన్ దేశంలాగా మారుస్తున్నార‌ని మండిప‌డ్డారు. కోర్టు ఇచ్చిన ప్ర‌తి తీర్పును దేశంలోని ప్ర‌తి శాస‌న‌స‌భ అమ‌లు చేసింద‌ని ...అనంత‌రం ఆ తీర్పుపై పైకోర్టుల‌కు వెళ్లాయని చెప్పారు. చ‌ట్టాల‌ను త‌యారు చేసే వారే చ‌ట్టాల‌ను గౌర‌వించ‌క‌పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. మావైపు ప్ర‌జ‌లున్నార‌ని, ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వం అన్యాయాలను ఎండ‌గ‌డ‌తామ‌న్నారు. 

ముఖ్య‌మంత్రి రేయ్ అంటారా..?
అసెంబ్లీలో స్వ‌యంగా ముఖ్య‌మంత్రి ఒక శాస‌న‌స‌భ్యుడిని రేయ్, నీ అంతుచూస్తాన‌ని మాట్లాడడం. ఒకాయన కొవ్వు ఎక్కువైంద‌ని,  ఇంకొక‌రు ఖ‌బ‌డ్దార్ అని, ఇంకొకాయన బుర‌ద‌లో పందులని, మ‌రొక‌రు సైకోల‌ని, ఒక‌రైతే ఏకంగా అసెంబ్లీలోనే పాతేస్తాన‌ని వ్యాఖ్య‌నించ‌డం చెవుల‌కు విన్న‌సోంపుగా ఉందా అని స్పీకర్ ను ప్ర‌శ్నించారు. న్యాయం అన్న‌ది అంద‌రికీ స‌మానంగా ఉండాల్నారు. రాష్ట్రంలో కొన్ని వంద‌ల స‌ర్పంచ్‌లు, ఎంపీటీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయ‌ని ..వాటికి ఎందుకు ఎన్నిక‌లు నిర్వ‌హించ‌ర‌ని నిల‌దీశారు. చంద్ర‌బాబు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తే ప్ర‌జ‌లు ఓటు అనే ఆయుధంతో ఈ చెంప‌, ఆ చెంప వాయిస్తార‌ని తెలిపారు. తాము ఏ త‌ప్పు చేయ‌లేద‌ని, చేశామని  చూపిస్తే దానిపై స‌మాధానం చెప్ప‌డానికి వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉంద‌న్నారు. 

ప్రాథ‌మిక హ‌క్కులు, మౌళిక సూత్రాల‌కు భంగం కలగకుండా స‌భ‌లో స‌భ‌వ్య‌వ‌హారాలు జ‌రిగిన‌ప్పుడే 212 అధికర‌ణ ప‌ని చేస్తుందని చెవిరెడ్డి తెలిపారు. రాజ్యాంగానికి విఘాతం ఏర్ప‌డిన‌ప్పుడు, ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌మాదం ఏర్ప‌డిన‌ప్పుడు, ప్రాథ‌మిక హ‌క్కుల‌కు భంగం క‌లిగిన‌ప్పుడు మౌళిక సూత్రాల‌ను తుంగ‌లో తొక్కిన‌ప్పుడు కోర్టు జోక్యం చేసుకోవ‌చ్చ‌ని సుప్రీం కోర్టు చెబుతుంద‌ని వివ‌రించారు.  ఏ రాష్ట్రంలో చూసిన కోర్టు తీర్పే వేద‌మ‌ని అన్నారు. 

1964లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఒక శాస‌న‌స‌భ్యుడిని ఏడు రోజుల పాటు అరెస్ట్ చేయాల‌ని సభ తీర్మానిస్తే... ల‌క్నో కోర్టు దానికి వ్య‌తిరేకంగా తీర్పునిచ్చిందని చెప్పారు.  దానిపై తిరిగి స్పీక‌ర్ డివిజ‌న్ బెంచ్ కు వెళ్లార‌ని, డివిజ‌న్ బెంచ్ సైతం సింగిల్‌ బెంచ్ ఇచ్చిన తీర్పునే వెలువ‌రించింద‌ని చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి వివ‌రించారు. కాగా అధికార ప్ర‌భుత్వం తిరిగి రాష్ట్ర‌ప‌తి స‌ల‌హా కోసం ఆశ్ర‌యిస్తే రాష్ట్ర‌ప‌తి ఆ కేసును సుప్రీంకోర్టుకు పంపించార‌ని తిరిగి సుప్రీం కోర్టు సైతం ఒక శాస‌న‌స‌భ్యుడిని ఇష్టానుసారం స‌స్పెండ్ చేసే హ‌క్కు స్పీక‌ర్‌కు లేద‌ని స్ప‌ష్టం చేసింద‌ని చెప్పారు. 

త‌మిళ‌నాడులో ఆరుగురు శాస‌న‌స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేస్తే వారు హైకోర్టును ఆశ్ర‌యించార‌ని, దీంతో వారి సస్పెన్ష‌న్ చెల్ల‌ద‌ని కోర్టు తీర్పునివ్వ‌డంతో  ప్ర‌భుత్వం తిరిగి వారిని శాస‌న‌స‌భలో కొన‌సాగించార‌ని గుర్తు చేశారు. ఎక్కడైనా కోర్టు తీర్పునిచ్చిన త‌ర్వాత దానిని అమ‌లు చేయాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వాల‌పై ఉంద‌న్నారు. తీర్పు ప్ర‌భుత్వానికి న‌చ్చ‌క‌పోతే ముందు తీర్పును అమ‌లు చేసిన అనంత‌రం డివిజ‌న్ బెంచ్ కి వెళ్లాలని, అంతేకానీ తీర్పును అమ‌లు చేయ‌కుండా వ్య‌వ‌హారించ‌డం చ‌ట్ట‌వ్య‌తిరేక‌మ‌న్నారు.

న్యాయ వ్యవస్థకు బాసట గా నిలిచిన వైఎస్ జగన్


  • శాసనసభకు దూరంగా ఉంటాం..!
  • మహిళా ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవటం దారుణం
  • న్యాయ వ్యవస్థను అవహేళన చేస్తూ చర్చ జరుపుతామన్న చట్ట సభల్ని బహిష్కరిస్తున్నా

హైదరాబాద్: న్యాయ వ్యవస్థను అవహేళన చేస్తూ , చట్ట సభల్లో చర్చలు చేపట్టాలన్ని తెలుగుదేశం ప్రభుత్వ వైఖరిని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తప్పు పట్టారు. న్యాయ వ్యవస్థకు సంఘీభావంగా చట్ట సభల్ని సోమ వారం దాకా బహిష్కరిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అసెంబ్లీ లో మహిళా ఎమ్మెల్యే రోజాను అనుమతించకుండా, సభలో నిరసన తెలిపే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నందుకు నిరసన తెలిపారు. ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పాలభిషేకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 
వైఎస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..!
      చట్ట సభలు ఏ స్థాయికి దిగజారిపోయాయో అందరూ చూస్తూనే ఉన్నాం. అసెంబ్లీలోకి మహిళా ఎమ్మెల్యే రోజాను అనుమతించక పోవటానికి నిరసనగా, అన్యాయం మీద వాకౌట్ చేయదలచుకొన్నాం... అంటూ మైక్ ఇవ్వమని అడిగితే మైక్ ఇవ్వలేదు. రెండు నిముషాలు మైక్ ఇవ్వమని అడిగినా కూడా మైక్ ఇవ్వటం లేదు. ఇది ఎంతటి అన్యాయం.
చట్ట సభలో ఏం జరిగిందీ అనేది నిన్న చూశాం. స్పీకర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ నుంచి రోజమ్మను సస్పెండ్ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామని చెప్పారు. ఇది ఎంతటి అబద్దం. 67 మంది శాసనసభ్యులు మీతో విభేదించారు. మీకు అధికారం లేకపోయినా ఎలా సస్పెండ్ చేస్తారు... రూల్స్ ను అధిగమించి ఎలా సస్పెండ్ చేస్తారు.. అని అడిగిన సంగతి గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు అబద్దాలు చెబుతూ సభ ఏకగ్రీవంగా ఆమోదించింది అని చెబుతున్నారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా..?
      ఇప్పుడు ఇదే సభ సోమవారం నాడు సమావేశమై చర్చ చేస్తారట. న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తూ, న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ధిక్కరిస్తూ స్పీకర్.. సభను నడిపిస్తున్న తీరుని చూసి నిరసన తెలుపుతున్నాం. ఒక వైపు కోర్టు ధిక్కార నేరం మీద హైకోర్టులో విచారణ సోమవారం నాడు చేపట్టినప్పుడు, అదే న్యాయ వ్యవస్థను ధిక్కరిస్తూ ఇక్కడ చర్చ జరుపుతారట. అందుకే అప్పటిదాకా సభను మేం బహిష్కరిస్తున్నాం. చట్ట సభల్లో న్యాయస్థానాలకు ఎంతటి గౌరవం ఇస్తున్నారో చూస్తున్నాం.
      న్యాయస్థానాల ఉత్తర్వులు చూపించి సభకు హాజరు అవుతామని మహిళా ఎమ్మెల్యే రోజా అడిగారు. అయినా సరే న్యాయస్థానం కన్నా మేం పెద్దోళ్లం, మేం అటువంటివి అంగీకరించం అని పాలన సాగిస్తున్న తీరును మేం ఖండిస్తున్నాం. న్యాయ వ్యవస్థకు బాసటగా నిలిచేందుకు సోమవారం దాకా సభల్ని మేం బహిష్కరిస్తున్నాం. ఇది ఎంతటి దిక్కుమాలిన సభ అనేది అర్థం అవుతోంది. న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్ని చర్చిస్తారట. అంటే న్యాయవ్యవస్థను అవహేళన చేస్తూ ఇక్కడ చర్చలు జరిపి తీర్పులు ఇస్తారట. అందుకే మేం దీన్ని బహిష్కరిస్తున్నాం.
      ఒక వైపు న్యాయస్థానంలో ఇదే అంశం మీద విచారణ జరుపుతున్నప్పుడు, న్యాయస్థానం చేసే విచారణ మీద మీరు విచారణ జరిపి తీర్పు ఇస్తారా. అలా అయితే మీరే విచారణ చేసుకోండి. మీరే తీర్పులు రాసుకోండి.
      నిజంగా ముఖ్యమంత్రి కి సిగ్గు, లజ్జ ఉంటే కనుక.. వేరే పార్టీ నుంచి ఎన్నికై, పార్టీ ఫిరాయించిన 8మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలి. ప్రజల దగ్గరకు వెళ్లి ప్రజల తీర్పు కోరాలి. చంద్రబాబు నాయుడికి ప్రజల దగ్గరకు వెళ్లే దమ్ము, ధైర్యం లేవు. ఎందుకంటే ప్రజల దగ్గరకు వెళితే ప్రజలు బుద్ది చెబుతారని తెలుసు. పైగా స్పీకర్ కుర్చీని ఉపయోగించి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు.
            రాజకీయాల్లో ఉండే వారికి రెండు లక్షణాలు ఉండాలి. క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం, క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత అవసరం. కానీ చంద్రబాబు వ్యక్తిత్వం ఎటువంటిది అంటే పదవి కోసం సొంత మామ గారిని వెన్నుపోటు పొడిచిన స్వభావం. ఎన్నికలకు ముందు అబద్దాలు చెప్పి, అధికారంలోకి వచ్చాక మోసం చేసిన స్వభావం ఆయనది. ఇటవంటి వ్యక్తి లంచాలు, అవినీతి తో సంపాదించిన సొమ్ములను ఎరగా చూపించి, ప్రలోభ పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటమే కాకుండా స్పీకర్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు కి సిగ్గు, లజ్జ, రోషం ఉంటే తక్షణమే ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హుల్ని చేయాలి. ప్రజల ఆశీస్సులు తాజాగా కోరాలి.
      స్పీకర్ వ్యవస్థ ద్వారా ఒక అబలకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూనే ఉన్నాం. ఒక అబల తనకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కోర్టుకి వెళ్లి న్యాయపోరాటం చేసి ఆదేశాలు తెచ్చుకొంటే అన్యాయం చేస్తారా. ప్రజలు, దేవుడు అన్నీ చూస్తూనే ఉన్నారు. త్వరలోనే ప్రజలు బుద్దిచెబుతారు. ’’ అని వైఎస్ జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఎమ్మెల్యే రోజాకు జరిగిన అన్యాయంపై వినతి

  • టీడీపీ అరాచకాలపై గవర్నర్ కు ఫిర్యాదు
  • చర్యలు తీసుకోవాలని కోరిన జన నేత వైఎస్ జగన్

హైదరాబాద్: హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పట్టించుకోకుండా మహిళా ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీలోకి రానీయకుండా తెలుగుదేశం చేస్తున్న కుట్రల్ని... గవర్నర్ నరసింహన్ కు తెలియపరిచారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ఈ మేరకు గవర్నర్ కార్యదర్శికి రెండు పేజీల వినతి పత్రాన్ని సమర్పించారు. వినతి పత్రం సారాంశం ఇదే..!
          గవర్నర్ నరసింహన్ గారికి,
      ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిబంధనా వళి లోని రూల్ నెం. 340 (2) కింద డిసెంబర్ 18, 2015 నాడు అసెంబ్లీ నుంచి నగిరి శాసనసభ్యురాలు శ్రీమతి ఆర్ కే రోజా ను ఏడాది పాటు  సస్పెండ్ చేయటం జరిగింది. దీన్ని గౌరవ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి ప్రతిపాదించగా, మా పార్టీ తరపున మేమంతా నిరసన తెలుపుతున్నప్పటికీ సభలో ఆమోదించినట్లు ప్రకటించారు.
      ఈ నిబంధన 340(2) అనేది ఒక సభ్యుడు లేక సభ్యురాలిని ఆ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయగలరు తప్పితే అంతకు మించి సస్పెండ్ చేయటం కుదరదు. అదే విషయాన్ని మేం తెలియపరిచి నిరసన వ్యక్తం చేశాం. కానీ, తాము తలచుకొంటే ఏదైనా చేయగలం అని, ఎటువంటి కోర్టులు తమను ఏమీ చేయలేవని సదరు మంత్రి సభలో వెల్లడించారు. అయితే ఈ దేశంలో నిర్దిష్టమైన చట్టవ్యవస్థ ఉందని మరిచిపోయారు. అనేక సందర్బాల్లో శాసన వ్యవస్థలో చోటు చేసుకొన్న పరిణామాలపై కోర్టులు జోక్యం చేసుకొన్నాయి. తాజాగా అలగాపురమ్ ఆర్ మోహన్ రాజ్ మరియు ఇతరులు వెర్సస్ తమిళనాడు శాసనసభ అనే కేసులో ఉన్నత న్యాయస్థానం సదరు సభ్యులకు న్యాయం ప్రసాదించింది.
      శాసనసభ నుంచి డిసెంబర్ 18, 2015 నాడు సస్పెండ్ చేస్తూ చేసిన తీర్మానం మీద హైకోర్టు ..శ్రీమతి రోజా కు మార్చి 17, 2016వ తేదీన ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది. వెంటనే సమావేశాలకు హాజరు అయ్యేందుకు అనుమతిని ఇవ్వటంతో పాటు, ఈ ఆదేశాలను శాసన వ్యవహారాల శాఖ ముఖ్య కార్యదర్శికి  ఈ మెయిల్ ద్వారా పంపటం జరిగింది.
      అంతే కాకుండా అసెంబ్లీ కార్యదర్శికి మార్చి 17, 2016వ తేదీనే మధ్యాహ్నం శ్రీమతి రోజా  ఈ ఉత్తర్వుల కాపీని అందచేయటం జరిగింది. దీన్ని స్వీకరించినట్లు ఆయన ధ్రువీకరించారు.
      ఈ ఆదేశాలకు అనుగుణంగా శ్రీమతి రోజా శాసనసభ సమావేశాలకు హాజరు అయ్యేందుకు సభకు వెళుతుంటే చీప్ మార్షల్స్ ఆమెను నిలిపివేశారు. దీనిమీద ప్రతిపక్ష నేత గా నేను ఆయన్ని ప్రశ్నించాను. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఆమెను నిలిపివేస్తున్నానని చెప్పటం తప్ప ఆయనేమీ నిర్దిష్ట జవాబు ఇవ్వనే లేదు. కనీసం రాత పూర్వకంగా ఉన్న ఆదేశాల్ని చూపటం లేదు. దీనిమీద కొందరు మా పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శిని ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం రాలేదు. శాసనసభ స్పీకర్ నుంచి ఆదేశాలు వచ్చినట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. కానీ, ఒక ఎమ్మెల్యేకు చట్టబద్దంగా సంక్రమించిన హక్కుని కాలరాయటం కన్నా తీరని అవమానం ఏముంటుంది.
      బహిరంగంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని ఉల్లంఘించటమే కాకుండా తీవ్ర అన్యాయానికి ఒడిగడుతున్న పరిస్థితి మీద మేం నిరసన తెలిపాం. అసెంబ్లీ గేటు దగ్గర ఉదయం 8.45 నుంచి 10.45 దాకా, తర్వాత గాంధీ విగ్రహం దగ్గర మేం శాంతియుతంగా నిరసన తెలిపాం. కానీ ఏ మాత్రం ఉపయోగం లేకుండా పోయింది.
      హైకోర్టు ఆదేశాల్ని పాటించాలని గౌరవ శాసనసభ స్పీకర్ కు సూచించాలని ఈ రాష్ట్ర రాజ్యాంగ అధిపతిగా మిమ్మల్ని కోరుతున్నాం.
ధన్యవాదములతో..
వైఎస్ జగన్.

18 March 2016

నిజంగా ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా..!

హైదరాబాద్ : శాసనసభలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాల్ని చూస్తుంటే అసలు నిజంగా..మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అన్న అనుమానం కలుగుతుందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అభిప్రాయ పడ్డారు. అసెంబ్లీలో ఏం జరిగింది అనేది అందరూ చూస్తూనే ఉన్నారని ఆయన అన్నారు.

అసెంబ్లీ దగ్గర ఎమ్మెల్యే రోజా ను ప్రభుత్వం అడ్డుకోవటంతో శాసనసభ దగ్గర వైఎస్ జగన్ నాయకత్వంలో ఆందోళన నిర్వహించారు. అనంతరం తోటి ఎమ్మెల్యేలతో కలిసి రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిసే ప్రయత్నం చేశారు. గవర్నర్ నరసింహన్ లేకపోవటంతో ఆయన కార్యదర్శి కి ఫిర్యాదు చేశారు. అనంతరం రాజ్ భవన్ దగ్గర వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు.  వైఎస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం..
      చంద్రబాబు ప్రభుత్వం శాసనసభను చేతుల్లోకి తీసుకొని పెడదోవ పట్టిస్తున్నారనేది చూస్తున్నాం. శాసనసభలో స్పీకర్ అనే వ్యక్తి రూల్స్ కు వ్యతిరేకంగా తెలుగుదేశానికి కొమ్ము కాస్తున్నారు. నిబంధనలు అనుమతించక పోయినా కానీ ఎమ్మెల్యే రోజమ్మను సస్పెండ్ చేయటం చూశాం. నిబంధన 340 ప్రకారం సస్పెండ్ చేశామని చెబుతున్నారు.  కానీ,  ఈ నిబంధన ప్రకారం చూస్తే అసెంబ్లీ సెషన్స్ వరకు మాత్రమే సస్పెండ్ చేయటానికి వీలవతుంది. నిబంధనలు ఇంత స్పష్టంగా చెబుతున్నప్పటికీ, ఏడాదిపాటు సస్పెండ్ చేశారు.
తర్వాత అసెంబ్లీలో జరుగుతున్న దుర్మార్గాల్ని ఒక్కొక్కటిగా వైఎస్ జగన్ వివరించారు.